
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ‘ఎక్స్’ ఖాతా బ్లాక్!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ‘ఎక్స్’ ఖాతాను నిషేధించాలని పాకిస్థాన్ ప్రభుత్వం ఎక్స్ యాజమాన్యాన్ని కోరింది. గత రెండేళ్లుగా పలు కేసుల్లో జైలుశిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. "మేము ఇమ్రాన్ ఖాన్ ఖాతాను బ్లాక్ చేయాలని ఎక్స్ మేనేజ్‌మెంట్‌ను సంప్రదించాం. ముఖ్యంగా సైన్యానికి, దేశానికి వ్యతిరేకంగా ట్వీట్‌లను ఆయన తన ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు” అని ఆ దేశ న్యాయశాఖ మంత్రి బారిస్టర్ అఖీల్ మాలిక్ ఆదివారం ఒక టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ ఎక్స్ ఖాతాను ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరు దేశ వ్యతిరేక పోస్టులు చేస్తున్నారనే దానిపై కూడా దర్యాప్తు ప్రారంభించామని, త్వరలోనే ఈ అంశానికి సంబంధించిన అన్ని ఆధారాలు వెలికితీస్తామని ఆయన అన్నారు.
సైన్యానికి వ్యతిరేకంగా పోస్టులపై దర్యాప్తు
పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు అయిన ఇమ్రాన్ ఖాన్‌ను గత నెలలో ప్రభుత్వ జాతీయ దర్యాప్తు సంస్థ అయిన ఎన్‌సీసీఐఏ జైలులో విచారించింది. ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఇతర ప్రభుత్వ సంస్థలకు వ్యతిరేకంగా రెగ్యులర్ పోస్ట్‌లు చేస్తున్న ఎక్స్ ఖాతా వివరాలను వెల్లడించాలని అధికారులు కోరారు.
నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌సీసీఐఏ) అధికారులు ఇటీవల అడియాలా జైలుకు వెళ్లి, ఇమ్రాన్‌ను ఆయన చేస్తున్న రాజ్య వ్యతిరేక పోస్టుల గురించి ప్రశ్నించారు. అయితే ఇమ్రాన్ దర్యాప్తు అధికారులకు సహకరించలేదని, ముఖ్యంగా తన ఎక్స్ ఖాతాను ఎవరు నిర్వహిస్తున్నారనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించారని ఎన్‌సీసీఐఏ అధికారి ఒకరు తెలిపారు.
తాజా ఎక్స్ పోస్ట్‌లో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, "నా ట్వీట్లలోని రాజ్య వ్యతిరేక పోస్టులు, ఆఫ్ఘనిస్తాన్, విదేశాంగ విధానం, 'అసిమ్ లా', మునీర్ చర్యలను ఢాకా పతనానికి దారితీసిన జనరల్ యాహ్యా ఖాన్ చర్యలతో పోల్చడం, జైలులో మానసిక చిత్రహింసలు" వంటి విషయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు తనను విచారించారని పేర్కొన్నారు.
మరోవైపు, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్, ఇమ్రాన్ ఖాన్ ఎక్స్ ఖాతాలోని కథనాల వెనుక భారతదేశం హస్తం ఉందని గతంలో ఆరోపించారు. దీనిపై మాజీ మంత్రి, పీటీఐ సీనియర్ నాయకుడు మూనిస్ ఎలాహి తీవ్రంగా స్పందిస్తూ, "ప్రతి దేశీయ వైఫల్యాన్ని విదేశీ కుట్రగా చిత్రీకరించడానికి ఆసిఫ్ ప్రయత్నిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమైనవి" అని అన్నారు.
ఇమ్రాన్ ఖాన్ ఎందుకు జైలులో ఉన్నారు?
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలు కేసుల్లో దోషిగా తేలడంతో జైలులో ఉన్నారు. ప్రధానంగా ఆయనకు అవినీతికి సంబంధించిన 'అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసు'లో 14 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అంతకుముందు ప్రభుత్వ బహుమతుల దుర్వినియోగం (తోషాఖానా కేసు), రహస్య పత్రాలను బహిర్గతం చేయడం వంటి ఇతర కేసులలో కూడా ఆయనకు శిక్షలు పడ్డాయి. అయితే వాటిలో కొన్ని రద్దు చేయబడినప్పటికీ, అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో విధించిన శిక్ష కారణంగా ఆయన ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. ఈ కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని ఆయన పార్టీ పీటీఐ ఆరోపిస్తోంది.
