
పాక్ ఐఎంఎఫ్ ప్యాకేజీ కన్నా.. కశ్మీర్ బడ్జెట్టే ఎక్కువ: ఐరాసలో భారత్
అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తూ దుష్ప్రచారం చేస్తున్న పాకిస్థాన్‌పై భారత్ మరోసారి నిప్పులు చెరిగింది. జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) 61వ సెషన్‌లో భాగంగా బుధవారం జరిగిన చర్చలో భారత్ తన 'రైట్ ఆఫ్ రిప్లై' అధికారాన్ని ఉపయోగించుకుని పాక్ ఆరోపణలను తిప్పి కొట్టింది. పాకిస్థాన్ వాస్తవాలకు దూరంగా, కల్పిత లోకంలో (లా లా ల్యాండ్) విహరిస్తోందని భారత్ ఎద్దేవా చేసింది.
దుష్ప్రచారానికి వేదికగా ఓఐసీ
భారత ప్రతినిధి అనుపమ సింగ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ చేస్తున్న ప్రచారంలో ఇప్పుడు 'అసూయ' స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ)ను పాక్ తన స్వార్థం కోసం ఒక 'ఎకో ఛాంబర్'లా వాడుకుంటోందని, వారి ఆరోపణలను తాము పూర్తిగా తిరస్కరిస్తున్నామని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, 1947లో జరిగిన విలీనం అంతర్జాతీయ చట్టాల ప్రకారం చట్టబద్ధమైనదని, దానిని వెనక్కి తీసుకోలేమని ఆమె పునరుద్ఘాటించారు.
పాక్ బడ్జెట్ కంటే మా కశ్మీర్ బడ్జెట్టే ఎక్కువ!
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎత్తిచూపుతూ భారత్ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. జమ్మూ కశ్మీర్ అభివృద్ధి బడ్జెట్.. పాకిస్థాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి కోరిన తాజా బెయిలవుట్ ప్యాకేజీ కంటే రెండింతలు ఎక్కువగా ఉందని అనుపమ సింగ్ గుర్తుచేశారు. "గతేడాది జమ్మూ కశ్మీర్‌లో ప్రారంభించిన ప్రపంచంలోనే ఎత్తైన 'చీనాబ్ రైల్వే బ్రిడ్జి' నకిలీదని పాక్ భావిస్తే.. ఆ దేశం భ్రమల్లో ఉన్నట్లు లేదా 'లా లా ల్యాండ్'లో బతుకుతున్నట్లు లెక్క" అని ఆమె ఎద్దేవా చేశారు.
ప్రజాస్వామ్యంపై మీ దగ్గర పాఠాలు అక్కర్లేదు
భారత ప్రజాస్వామ్యంపై పాక్ విమర్శలను తిప్పికొడుతూ.. పౌర ప్రభుత్వాలు కనీసం తమ పదవీకాలాన్ని కూడా పూర్తి చేయలేని దేశం నుంచి తాము ప్రజాస్వామ్య పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని భారత్ ఘాటుగా సమాధానమిచ్చింది. జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీగా నమోదైన ఓటింగ్ శాతమే అక్కడి ప్రజలు ఉగ్రవాదాన్ని, హింసను తిరస్కరించారనడానికి నిదర్శనమని పేర్కొంది. ప్రజలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నారని భారత్ వెల్లడించింది.
సొంత సమస్యలపై దృష్టి పెట్టండి
పాకిస్థాన్ స్పాన్సర్ చేస్తున్న ఉగ్రవాదం ప్రాంతీయ సుస్థిరతను దెబ్బతీసేలా ఉందని భారత్ ఆరోపించింది. ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక వివాదం.. భారత్ భూభాగాలను పాక్ అక్రమంగా ఆక్రమించుకోవడమేనని, వెంటనే ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి నాటకాలు ఆడటం మానేసి, పాక్ తన దేశంలో ముదురుతున్న అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించుకోవడంపై దృష్టి పెడితే మంచిదని భారత్ హితవు పలికింది. పాక్ వేస్తున్న వేషాలను ప్రపంచం మొత్తం గమనిస్తోందని హెచ్చరించింది.
