Let's talk: editor@tmv.in
పాక్ ఆటగాళ్లకు బ్యాట్‌తోనే బదులిచ్చాం: తిల‌క్ వ‌ర్మ

పాక్ ఆటగాళ్లకు బ్యాట్‌తోనే బదులిచ్చాం: తిల‌క్ వ‌ర్మ

Shaik Mohammad Shaffee
1 అక్టోబర్, 2025

ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తెలుగు తేజం తిలక్ వర్మ వీరోచిత పోరాటం ఫలితంగా టీమిండియా ఆసియా కప్ విజేతగా నిలిచింది. తాజాగా హైదరాబాద్‌కు చేరుకున్న తిలక్ వర్మ ఈ టోర్నీలో ముఖ్యంగా ఫైనల్లో పాక్ ఆటగాళ్ల నుంచి ఎదురైన స్లెడ్జింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఫైనల్‌లో పాక్ ఆటగాళ్ల నుంచి వచ్చిన స్లెడ్జింగ్‌ (మాటల దాడి)కి తాము బ్యాట్‌తోనే సమాధానమిచ్చామని స్పష్టం చేశాడు.

ట్రోఫీతోనే సమాధానం ఇచ్చాం: తిలక్

"మ్యాచ్‌లో ఒత్తిడి, ఆందోళన అనేవి సహజం. అయితే ఆ సమయంలో నేను దేశం గురించి మాత్రమే ఆలోచించాను. ఆసియా కప్‌ను గెలవడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం. పాకిస్థాన్ ఆటగాళ్లు మాటల దాడికి దిగారు. కానీ దానికి ఉత్తమ సమాధానం మ్యాచ్ గెలవడమే అని భావించాను. మేము అదే చేశాం, అందుకే గెలిచాం" అని తిలక్ వర్మ ధీమాగా చెప్పాడు.

147 పరుగుల ఛేదనలో భారత్ 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పుడు తాను క్రీజులోకి వచ్చానని తిలక్ గుర్తు చేసుకున్నాడు. "మేము త్వరగా మూడు వికెట్లు కోల్పోయాం, ఆ సమయంలో వాతావరణం కొంచెం వేడెక్కింది. పాక్ ఆటగాళ్లు మాటల దాడికి దిగారు. నన్ను విసిగించడానికి ప్రయత్నించారు. కానీ అదంతా పట్టించుకోకుండా నేను ఆడాను. ఒకవేళ భావోద్వేగాలకులోనై నేను తొందరపడి చెత్త షాట్ ఆడి ఉంటే అది జట్టును, 140 కోట్ల మంది భారతీయులను నిరాశపరిచినట్టే అయ్యేది” అని తిలక్ వివరించాడు.

‘మ్యాచ్ తర్వాతే బదులిచ్చా’

మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాక్ ఆటగాళ్ల స్లెడ్జింగ్‌కు బదులివ్వడానికి తాను సిద్ధంగా లేనని, ఆ సమయంలో కేవలం తన బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టానని తిలక్ చెప్పాడు. "ఆ సమయంలో నేను కేవలం నా ఆటపైనే దృష్టి పెట్టాను. ఆట జరుగుతున్నప్పుడు వారికి సమాధానం చెప్పకూడదని నిర్ణయించుకున్నా. మ్యాచ్ గెలిచాక వారికి చెప్పాలనుకున్నది చెప్పాను" అని తిలక్ అన్నాడు. అయితే మైదానంలో ఏం జరిగిందనే వివరాలను మాత్రం పూర్తిగా బయటపెట్టలేనని తిలక్ తెలిపాడు.

కెప్టెన్ సూర్య మాటలకు మద్దతు

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పిన 'పాకిస్థాన్‌తో మాకు పోటీ లేదు' అన్న వ్యాఖ్యలకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తిలక్ తెలిపాడు. "కెప్టెన్ సూర్య అన్న మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. మా ముందు పాకిస్థాన్ ఒక లెక్క కాదు. అయితే, ప్రతి ప్రత్యర్థి తమ వ్యూహాలతో వస్తారు. పాకిస్థాన్ కూడా అదే చేసింది. కానీ మేం గొప్ప భాగస్వామ్యాలను నెలకొల్పి, కఠినమైన పిచ్‌పై కూడా విజయం సాధించాం" అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.

తాను సాధించిన డబుల్ సెంచరీలకంటే కూడా ఆసియా కప్‌ ఫైనల్‌లో పాక్‌పై ఆడిన ఇన్నింగ్సే తనకు ఫేవరెట్‌ అని తిలక్ అన్నాడు. తనను తీర్చిదిద్దిన చిన్ననాటి కోచ్‌ సలాంకు రుణపడి ఉంటానని చెప్పాడు. అలాగే హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ (హెచ్‌సీఏ), బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఆసియా కప్ ఫైనల్‌లో తిలక్ వర్మ 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 69 పరుగులు చేసి, భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అతడి ప్రదర్శన భారతదేశ క్రికెట్ అభిమానుల ప్రశంసలు అందుకుంది.

పాక్ ఆటగాళ్లకు బ్యాట్‌తోనే బదులిచ్చాం: తిల‌క్ వ‌ర్మ - Tholi Paluku