
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్రిక్తత
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. వేలాది సంఖ్యలో జనం రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. తమ హక్కులు, ఉద్యోగాలు, ఆర్థిక భద్రతపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ పోరాటం జరుగుతోంది. కమిటీ డిమాండ్లు పాటించకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిర్పూర్, కోట్లి, ముజాఫరాబాద్‌లో డెమోస్, తదితర ప్రాంతాల్లో రాలీలు జరుగుతున్నాయి. ప్రజలు తమ హక్కుల కోసం ఏకతాటిపై నిలబడుతున్నారు.
ముజాఫరాబాద్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 22 మందికి పైగా గాయాలపాలయారు. ఈ దుర్ఘటన ప్రజల కోపాన్ని మరింత తీవ్రం చేసింది. కోట్లిలో సెంట్రల్ చౌక్ వద్ద ఆందోళనకారులు సమావేశమయ్యారు. పాక్ ప్రభుత్వం తమ రాజకీయ, ఆర్థిక, ప్రాథమ హక్కులను దెబ్బ తీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు, కానీ ఇప్పుడు అందరూ హక్కుల కోసం గట్టిగా నిలబడ్డారు. మిర్పూర్‌లో స్థానికులు, ఆందోళనకారులు బైక్ ర్యాలీలు చేశారు. రోడ్లపై నినాదాలు చేస్తూ, ప్లకార్డులు పట్టుకొని యాక్షన్ కమిటీ డిమాండ్లపై వెంటనే దృష్టి పెట్టాలని కోరారు. ప్రజలు భారీ ఎత్తున నిరసనల్లో పాల్గొనడం స్థానికంగా ఉన్న రాజకీయ అసంతృప్తిని స్పష్టం చేస్తోంది.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జమ్మూ కశ్మీర్ అవామీ యాక్షన్ కమిటీ అనేది వ్యాపారులు, ట్రాన్స్‌పోర్టర్లు, లాయర్లు, విద్యార్థులు వంటి వివిధ వర్గాల సమూహాలతో కలిసి ఏర్పడినది. ప్రధానంగా ఆర్థిక సమస్యలు, రాజకీయ హక్కులు, మెరుగైన పాలన కోసం పోరాడుతుంది. జమ్మూ కశ్మీర్ అవామీ యాక్షన్ కమిటీ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ప్రజల కోసం కొన్ని ముఖ్యమైన డిమాండ్లు పెట్టింది. అధికారుల ప్రత్యేక సౌకర్యాలు తొలగించాలని కోరింది. స్థానికంగా పాలకవర్గానికి ఉన్న అనవసర ప్రయోజనాలు ఆపాలన్నది, అందరికీ సౌకర్యాలు సమానంగా ఉండాలన్నది దీని ఉద్దేశం. అలాగే పాకిస్తాన్‌లోని కశ్మీర్ రిఫ్యూజీల సీట్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పాకిస్తాన్‌లో స్థిరపడ్డ కశ్మీర్ రిఫ్యూజీల కోసం 12 లెజిస్లేటివ్ సీట్లు కేటాయించారు. ఇవి స్థానిక ప్రజల ఓటింగ్ హక్కులను దెబ్బతీస్తున్నాయి. అందుకే ఈ సీట్లు రద్దు చేయాలని కోరుతున్నారు. స్థానిక వనరుల నుంచి రాయల్టీలు రావాలని డిమాండ్ చేస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో హైడ్రోపవర్ వంటి స్థానిక వనరుల నుంచి వచ్చే ఆదాయం నేరుగా అక్కడి ప్రజలకు రావాలి. ఇప్పుడు ఈ డబ్బు కేంద్ర ప్రభుత్వానికి వెళ్తోంది, స్థానికులకు దీంతో ఏమాత్రం ప్రయోజనం జరగడం లేదు. సబ్సిడీతో గోధుమ పిండి అందించాలని డిమాండ్ వినిపిస్తోంది. గిల్గిట్, బాల్టిస్తాన్‌లో ప్రజలకు తక్కువ ధరలో గోధుమ పిండి ఇస్తారు. అలాంటి సబ్సిడీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కూడా ఇవ్వాలని, తద్వారా పేదలకు ఆహారం తక్కువ ధరలో దొరుకుతుందన్న అభిప్రాయం నెలకొంది. విద్యుత్ ధరలు తగ్గించాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. మంగ్లా హైడ్రోపవర్ ప్రాజెక్ట్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనే ఉంది. కానీ విద్యుత్ చార్జీలు చాలా ఎక్కువగా వసూలు చేస్తున్నారు. స్థానికులకు తక్కువ చార్జీలకే విద్యుత్ అందించాలన్న డిమాండ్ నెలకొంది. అలాగే నిషేధంలో ఉన్న విద్యార్థి సంఘాలను తిరిగి ప్రారంభించి, వాటిని డెమోక్రటిక్‌గా నడపాలని కోరుతున్నారు. విద్యార్థులకు తమ సమస్యలను చెప్పే అవకాశం, నాయకత్వం ఇవ్వాలని చెపుతున్నారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఈ ఆందోళనలు ఆర్థిక, రాజకీయ, సామాజిక అసంతృప్తుల నుంచి పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి పెద్ద కారణంగా చెప్పవచ్చు. పాకిస్తాన్ ప్రభుత్వం స్థానిక వనరుల నుంచి ప్రయోజనాలు తీసుకుంటూ అక్కడి ప్రజలకు సరైన కేటాయింపులు చేయడం లేదు. స్థానికంగా విద్యుత్ బిల్లులు చాలా ఎక్కువగా వసూలు చేస్తున్నారు. సబ్సిడీలో గోధుమ పిండి అందించడం లేదు. ఇది పేదలు, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తోంది. రాజకీయంగా, రిఫ్యూజీలకు కేటాయించిన సీట్లు స్థానికుల ఓటింగ్ హక్కులను దెబ్బతీస్తున్నాయి. అధికారుల అవినీతి ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. స్టూడెంట్ యూనియన్స్ నిషేధంతో యువత రగిలిపోతున్నారు. ఆర్థికంగా, సబ్సిడీలు, విద్యుత్ ధరలు తగ్గించడం, రాయల్టీలు వంటివి పేదలకు, మధ్యతరగతి వారికి ఊరట కలిగిస్తాయి. రాజకీయంగా, రిఫ్యూజీ సీట్ల రద్దు, అధికారకులకు ప్రత్యేక సౌకర్యాల తొలగింపు స్థానికులకు ఎక్కువ రాజకీయ శక్తినిస్తాయి. స్టూడెంట్ యూనియన్స్ డిమాండ్ యువతలో పాలనలో పాల్గొనే ఆసక్తిని పెంచుతుంది. ఈ డిమాండ్లు పాకిస్తాన్ సెంట్రల్ ప్రభుత్వంతో ఉన్న లోటును స్పష్టం చేస్తున్నాయి. ప్రజల హక్కులను కాలరాస్తూ పాక్ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోంది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఈ సమస్యలతో ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమం నడుపుతోంది. పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం డిమాండ్లను పట్టించుకోకపోవడం దారుణం. ఈ నేపథ్యంలో ఆందోళనలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది.
