
పాక్ అణు పరీక్షలు: ట్రంప్ ప్రకటనతో భారత్‌లో ఆందోళన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణ ఆసియాలో ప్రకంపనలు సృష్టించాయి. పాకిస్తాన్ రహస్యంగా అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోందంటూ ఆయన చేసిన ఆరోపణ, భారత్‌కు భద్రతాపరమైన ఆందోళనలను పెంచింది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యల ఉద్దేశ్యం ఏమిటి? పాకిస్థాన్ ఏ రకమైన పరీక్షలు చేస్తోంది? భారత్‌కు దాని వల్ల కలిగే ముప్పు ఎంత? అలాగే భారత్, పాక్ అణ్వస్త్ర సామర్థ్యం ఎంత? అనే విషయాలపై ఇప్పుడు తెలుసుకుందాం
ఇంటర్య్వూలో బాంబ్ పేల్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన '60 మినిట్స్' ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్ల విరామం తర్వాత అమెరికా తిరిగి అణ్వాయుధ పరీక్షలను పునఃప్రారంభించాల్సిన అవసరం ఉందని సమర్థించుకుంటూ ఆయన ఈ ప్రకటన చేశారు. రష్యా, చైనా, ఉత్తర కొరియాతో పాటు పాకిస్థాన్ కూడా చురుగ్గా అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోందని ట్రంప్ స్పష్టం చేశారు. "రష్యా, చైనా పరీక్షలు చేస్తున్నాయి, కానీ దాని గురించి మాట్లాడడం లేదు. ఉత్తర కొరియా నిరంతరం పరీక్షిస్తోంది. పాకిస్థాన్ కూడా పరీక్షిస్తోంది" అని ఆయన అన్నారు.
ప్రపంచంలోని అణ్వస్త్ర దేశాలన్నీ రహస్యంగా లేదా అప్రకటితంగా పరీక్షలు చేస్తుంటే, అమెరికా మాత్రమే పరీక్షలు చేయకుండా ఉండడం సరికాదని ట్రంప్ వాదించారు. అణుశక్తి ఆధారిత అండర్‌వాటర్ డ్రోన్ 'పోసిడాన్' వంటి అధునాతన అణ్వాయుధ వ్యవస్థలను రష్యా ఇటీవల పరీక్షించిన నేపథ్యంలోనే, తమ అణ్వస్త్ర సంపత్తిని ఆధునీకరించడానికి, వాటి పనితీరును నిర్ధారించుకోవడానికి అమెరికా కూడా అణు పరీక్షలను పునఃప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ వివరించారు.
"ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేంత అణ్వాయుధాలు మా వద్ద ఉన్నాయి" అని ట్రంప్ తన అణ్వస్త్ర సామర్థ్యాన్ని పేర్కొంటూనే, భవిష్యత్తులో అణ్వస్త్ర నిరాయుధీకరణపై పుతిన్, జిన్‌పింగ్‌లతో చర్చించానని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రపంచంలోని అణ్వస్త్ర దేశాలన్నీ తమ అణ్వాయుధ కార్యక్రమాలను విస్తరిస్తున్న తరుణంలో, అమెరికా సైతం దాని శక్తిని నిరూపించుకోవాలి.
పాకిస్థాన్ ఏ అణ్వాయుధాలను పరీక్షిస్తోంది?
పాకిస్థాన్ 1998లో చేసిన చాగై అణు పేలుళ్ల తర్వాత తెర వెనుక అనేక అణు ప్రయోగాలు చేసినట్లు అంతర్జాతీయ నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ దేశం ప్రస్తుతం షహీన్, గజ్నవి శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను, అలాగే బాబర్ క్రూయిజ్ మిస్సైల్‌ను అణు వార్‌హెడ్‌లతో సమన్వయం చేసే ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్థాన్ అణు కార్యక్రమానికి ప్రధానంగా చైనా మద్దతు ఇస్తోందని, సాంకేతిక సహకారం అందిస్తోందని పాశ్చాత్య దేశాలు తరచుగా పేర్కొంటున్నాయి.
భారత్ ఆందోళన చెందుతోందా?
ట్రంప్ వ్యాఖ్యల తర్వాత భారత విదేశాంగ, రక్షణ వర్గాలు జాగ్రత్తగా పరిస్థితిని విశ్లేషిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, దక్షిణాసియాలో అణు సమతుల్యత కదలికలు జరుగుతున్నాయని భారత్ గుర్తిస్తోంది. పాకిస్థాన్ అణు పరీక్షలు భారత్ భద్రతకు నేరుగా ముప్పు కాకపోయినా, అణు ఆయుధాల వ్యూహాత్మక సమతుల్యతపై ప్రభావం చూపవచ్చు.
భారత్ చేసిన అణు పరీక్షలు
భారతదేశం ఇప్పటివరకు రెండు ప్రధాన అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. 1974లో రాజస్థాన్‌లోని పోఖ్రాన్ వద్ద “స్మైలింగ్ బుద్ధ” పేరిట తొలి అణు పేలుడును నిర్వహించింది. ఆ తర్వాత మళ్లీ 1998లో “ఆపరేషన్ శక్తి” కింద వరుసగా ఐదు అణు పరీక్షలు (అణు బాంబు, థర్మోన్యూక్లియర్/హైడ్రోజన్ బాంబు) నిర్వహించింది. ఇవి భారత్‌ను అధికారికంగా అణ్వాయుధ దేశంగా నిలబెట్టాయి. తర్వాత భారత్ “నో ఫస్ట్ యూజ్” (మొదటగా ఉపయోగించము) అనే సూత్రాన్ని స్వీకరించింది.
భారత్, పాకిస్థాన్ అణు సంపత్తి
అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ అంచనాల ప్రకారం భారత్ వద్ద సుమారు 160 అణు వార్‌హెడ్లు, పాకిస్థాన్ వద్ద సుమారు 170–180 అణు వార్‌హెడ్లు ఉన్నాయి. అయితే భారత్ శాస్త్రీయ మౌలిక వసతులు, ప్రయోగ సామర్థ్యం, అంతరిక్ష సాంకేతికత, రక్షణ వ్యవస్థలు పాకిస్థాన్ కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి.
భారత్ కూడా అణు పరీక్షలకు సిద్ధమా?
ప్రస్తుతం భారత్ అణు పరీక్షలు పునఃప్రారంభించే ఆలోచనలో లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే పాకిస్థాన్, చైనా అణు ప్రయోగాలు పెంచితే, భారత్ తన అణు సామర్థ్యాన్ని పునర్వ్యవస్థీకరించవచ్చు. భారత అణు విధానం “కనిష్ట విశ్వసనీయ నిరోధక శక్తి” పై ఆధారపడి ఉంది. ఒకవేళ పాకిస్థాన్ సీటీబీటీని ఉల్లంఘిస్తూ పూర్తిస్థాయి అణు పరీక్షలు చేసి, అది భారత్ జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు అని భారత్ భావిస్తే, అప్పుడు 'అణు పరీక్షలపై స్వీయ నిషేధాన్ని' భారత్ ఎత్తివేసే అవకాశం ఉంటుందని రక్షణ నిపుణులు పేర్కొన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలతో ప్రపంచ అణు రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. అమెరికా అణు పరీక్షలను తిరిగి ప్రారంభిస్తే, రష్యా, చైనా, పాకిస్థాన్ కూడా తమ సాంకేతికతను వేగంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. దానివల్ల దక్షిణాసియాలో భారత్–పాకిస్థాన్ అణు పోటీ మరింత ముదురే అవకాశం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ట్రంప్ వ్యాఖ్యలు కేవలం అమెరికా నిర్ణయం గురించే కాకుండా, భారత ఉపఖండ భద్రతా సమీకరణాలపై కూడా ప్రభావం చూపే పరిణామాలు కావచ్చని విశ్లేషకులు అంటున్నారు.
