Let's talk: editor@tmv.in
పాక్‌లో రికార్డు స్థాయికి జెట్ ఫ్యూయల్ ధర

పాక్‌లో రికార్డు స్థాయికి జెట్ ఫ్యూయల్ ధర

Shaik Mohammad Shaffee
30 మార్చి, 2026

ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌పై ఇంధన ధరల భారం మరింత పెరిగింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల తలెత్తిన చమురు సంక్షోభం పాక్‌ను అతలాకుతలం చేస్తోంది. శనివారం ప్రభుత్వం వాణిజ్య విమానాల్లో వాడే జెట్ ఫ్యూయల్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేవలం 28 రోజుల వ్యవధిలోనే విమాన ఇంధన ధర పెరగడం ఇది ఐదోసారి కావడం గమనార్హం.

చుక్కలు చూపిస్తున్న విమాన ప్రయాణం

పాకిస్థాన్ స్టేట్ ఆయిల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. తాజాగా లీటరు జెట్ ఫ్యూయల్‌పై 5 రూపాయలు పెంచడంతో దీని ధర రికార్డు స్థాయిలో 476.97 రూపాయలకు చేరుకుంది. మార్చి 1వ తేదీన 188 రూపాయలుగా ఉన్న ధర, ఈ ఒక్క నెలలోనే ఏకంగా 288 రూపాయలు పెరగడం గమనార్హం. ఇంధన ధరలు భారమవడంతో విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. కరాచీ-ఇస్లామాబాద్ వంటి దేశీయ మార్గాల్లో వన్-వే టికెట్ ధర 40,000 రూపాయలకు చేరగా, అంతర్జాతీయ ప్రయాణ ధరలు (టొరంటో, పారిస్ వంటి నగరాలకు) 3 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు పలుకుతున్నాయి.

సామాన్యుడిపై కిరోసిన్ భారం.. పెట్రోల్ రిలీఫ్

మరోవైపు ప్రభుత్వం కిరోసిన్ ధరను కూడా లీటరుకు 4.66 రూపాయలు పెంచింది. దీంతో కొత్త ధర 433.40 రూపాయలకు చేరింది. అయితే అంతర్జాతీయంగా ధరలు మారుతున్నప్పటికీ సామాన్యులకు కొంత ఊరటనిస్తూ పెట్రోల్ (రూ.321.17), డీజిల్ (రూ.335.86) ధరలను ప్రస్తుతానికి యథాతథంగా ఉంచింది. వీటిపై పడుతున్న అదనపు భారాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తూ ఆయిల్ కంపెనీలకు చెల్లిస్తోంది. విలాసవంతమైన వాహనాల్లో వాడే హై-ఆక్టేన్ పెట్రోల్‌పై మాత్రం లీటరుకు 200 రూపాయల అదనపు పన్ను విధించి సంపన్నులకు షాక్ ఇచ్చింది.

నిత్యావసరాలకు రెక్కలు.. ప్రజల అవస్థలు

ఇంధన ధరల పెరుగుదల ప్రభావం రవాణా వ్యవస్థపై పడి, నిత్యావసర వస్తువులైన పండ్లు, కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. సామాన్యుడి జీవన వ్యయం భారమైపోవడంతో దేశవ్యాప్తంగా అసహనం వ్యక్తమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల వద్ద వింత పరిస్థితులు నెలకొన్నాయి. ధరల పెరుగుదల భయంతో లీటరు కంటే తక్కువ పరిమాణంలో ఇంధనం పోసేందుకు పెట్రోల్ బంకుల యజమానులు నిరాకరిస్తుండటంతో వాహనదారులకు, సిబ్బందికి మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.