Let's talk: editor@tmv.in
పాక్‌లో భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు.. లీటర్‌ రూ.275.70కు చేరిన డీజిల్‌ రేటు

పాక్‌లో భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు.. లీటర్‌ రూ.275.70కు చేరిన డీజిల్‌ రేటు

Shaik Mohammad Shaffee
17 ఫిబ్రవరి, 2026

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో సామాన్యుడిపై ఇంధన ధరల భారం మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చుతగ్గులు, కరెన్సీ మార్పిడి రేట్ల ప్రభావంతో పాక్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 5 పాకిస్థానీ రూపాయలు (5 పీకేఆర్), హైస్పీడ్ డీజిల్‌పై 7.32 పాకిస్థానీ రూపాయలను పెంచింది. ఈ కొత్త ధరలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి 15 రోజులకోసారి జరిగే సమీక్షలో భాగంగా ఈ సవరణలు చేశారు.

కొత్త ధరలు ఇలా..

తాజా పెంపుతో పాకిస్థాన్‌లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. గతంలో లీటర్ పెట్రోల్ 253.17 పీకేఆర్ (పాకిస్థానీ రూపాయలు) ఉండగా, తాజా పెంపుతో అది 258.17కు చేరింది. లీటర్ డీజిల్ 268.38 పీకేఆర్ నుండి 275.70కు పెరిగింది. గత ఫిబ్రవరి 1న జరిగిన సమీక్షలో డీజిల్ ధరను 14 పాకిస్థానీ రూపాయలను తగ్గించిన ప్రభుత్వం, ఈసారి మాత్రం అంచనాలను మించి వడ్డించింది. నిజానికి పెట్రోల్‌పై 4.39 పాకిస్థానీ రూపాయలు, డీజిల్‌పై 5.40 పాకిస్థానీ రూపాయలు పెరుగుతుందని తొలుత భావించినప్పటికీ, అంతకంటే ఎక్కువే పెంచడం గమనార్హం.

సామాన్యుడి బతుకు భారమే..

హైస్పీడ్ డీజిల్ ధరల పెంపు పాక్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. రవాణా, వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో డీజిల్ వాడకం ఎక్కువగా ఉండటంతో, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం చుక్కలు చూపే అవకాశం ఉంది. మరోవైపు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వాడే ద్విచక్ర వాహనాలు, రిక్షాలు, చిన్న కార్లకు పెట్రోల్ ధరల పెంపు పెద్ద భారంగా పరిణమించింది. వారి నెలవారీ బడ్జెట్‌పై ఇది నేరుగా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మున్ముందు మరిన్ని వడ్డనలు?

అంతర్జాతీయ ద్రవ్య నిధి షరతులకు అనుగుణంగా పాకిస్థాన్ తన పెట్రోలియం డెవలప్‌మెంట్ లెవీ అంచనాలను ఇప్పటికే సమర్పించింది. దీని ప్రకారం.. పర్యావరణ పరిరక్షణ కోసం విధించే 'క్లైమేట్ సపోర్ట్ లెవీ'ని 2026 జూలై 1 నుంచి లీటరుకు 2.5 పాకిస్థానీ రూపాయల చొప్పున పెంచే అవకాశం ఉంది. రాబోయే ఐదేళ్లలో ఇంధనంపై పన్నుల భారం మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో పాక్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.