Let's talk: editor@tmv.in
పాక్‌లో ఎనిమిది కొత్త ప్రాచీన స్థలాల గుర్తింపు

పాక్‌లో ఎనిమిది కొత్త ప్రాచీన స్థలాల గుర్తింపు

Shaik Mohammad Shaffee
5 నవంబర్, 2025

పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌లో జరుగుతున్న తవ్వకాలు, అన్వేషణల సందర్భంగా పురావస్తు శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన పురోగతిని సాధించారు. స్వాత్ లోయ నుంచి తక్షశిల వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో ఎనిమిది కొత్త ప్రాచీన స్థలాలు కనుగొన్నట్లు ప్రకటించారు. ఇటాలియన్ పురావస్తు శాస్త్రవేత్తలు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా పురావస్తు డైరెక్టరేట్ సంయుక్త సహకారంతో ఈ ఆవిష్కరణలు జరిగాయి.

కొత్తగా కనుగొనబడిన వాటిలో అత్యంత ముఖ్యమైనది స్వాత్ జిల్లాలోని బారికోట్ (ప్రాచీన బజిరా) ప్రాంతంలో లభించిన 1,200 సంవత్సరాల నాటి చిన్న ఆలయం అవశేషాలు. ఇది ఆ ప్రాంతంలోని సాంస్కృతిక, నాగరిక వారసత్వం నిరంతరతకు అరుదైన సాక్ష్యంగా నిలుస్తోంది.

ఇటాలియన్‌ పురావస్తు మిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ లూకా మాట్లాడుతూ, ఈ చిన్న ఆలయం అవశేషాలు బారికోట్‌లో తవ్వకాల సమయంలో బయటపడ్డాయని తెలిపారు. ఆయన వివరించిన ప్రకారం, ఇప్పుడు తవ్వకాల విస్తరణను స్వాత్‌ నది దిశగా జరిపి ఆలయాన్ని, చుట్టుపక్కల ఉన్న పురావస్తు పొరలను రక్షించేందుకు బఫర్‌ జోన్‌ ఏర్పాటుచేస్తున్నారు.

“ఖైబర్ పాత్ ప్రాజెక్ట్” అనే మూడు సంవత్సరాల ప్రణాళిక కింద 400 మందికి పైగా స్థానిక కార్మికులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు తవ్వకాలు, సంరక్షణ, వారసత్వ నిర్వహణ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రాజెక్టు జూన్‌ 1న ప్రారంభమై, ప్రాంతీయ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, పర్యాటక రంగ ప్రోత్సాహం లక్ష్యంగా కొనసాగుతోంది.

ఇప్పటికే పలు ప్రాంతాల్లో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ప్రాథమిక అధ్యయనాల ప్రకారం, ఈ ప్రదేశాలు ప్రాగైతిహాసిక యుగం (చరిత్రపూర్వ కాలం) నుంచి ఇస్లామిక్‌ కాలం వరకు నిరంతర నివాస ప్రాంతాలుగా ఉన్నాయని, అందులో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ ఘజ్నవీ కాలానికి చెందిన కోటగా గుర్తించబడిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇటాలియన్‌ పురావస్తు నిపుణులు ఇప్పటివరకు ఖైబర్ పఖ్తున్‌ఖ్వా అంతటా 50కు పైగా పురావస్తు స్థలాలను గుర్తించారు. వీటిలో రాతి యుగం, అలెగ్జాండర్‌ కాలం, బౌద్ధ యుగం, రాజవంశం, గ్రీకు కాలం, ఇస్లామిక్‌ యుగం వరకు విస్తరించిన చరిత్ర కనిపిస్తోంది.

ఇటీవలి తవ్వకాలలో స్వాత్ జిల్లాలోని టోకర్దారా ప్రాంతంలో బౌద్ధ యుగానికి చెందిన విస్తృత అవశేషాలు బయటపడ్డాయి. వీటిలో బుద్ధుని విగ్రహాలు, ఒక మహా స్తూపం ఉన్నాయి. ఈ ప్రదేశం బౌద్ధ భక్తుల పూజాస్థలంగా, విద్యార్థులు నివసించి విద్యాభ్యాసం చేసిన మఠంగా ఉపయోగించబడినట్టు నిపుణులు నిర్ధారించారు.

ఈ తాజా ఆవిష్కరణలు గంధార నాగరికత మహాత్మ్యాన్ని మరింత వెలుగులోనికి తెచ్చి, స్వాత్‌ లోయ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పురావస్తు నిపుణుల ప్రకారం, ఈ ప్రదేశం భవిష్యత్తులో మతపర పర్యాటకానికి, శాస్త్రీయ పరిశోధనలకు అమూల్యమైన వారసత్వ సంపదగా మారే అవకాశముంది.

పాకిస్థాన్‌లో ఉన్న ప్రాచీన స్థలాలు ఇవే!

పాకిస్తాన్‌ అనేది ప్రపంచంలోని ప్రముఖ పురావస్తు ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ సింధు లోయ నాగరికత నుంచి గంధార, బౌద్ధ, గ్రీకు, ఇస్లామిక్‌ యుగాల వరకు విస్తరించిన అనేక ప్రాచీన స్థలాలు ఉన్నాయి. ప్రధానంగా మొహెంజోదారో, హరప్పా, తక్షశిల, మెహర్‌గఢ్, స్వాత్‌ లోయ, తఖ్త్‌-ఇ-భాయి, రోహ్తాస్‌ కోట, లాహోర్‌ కోట వంటి స్థలాలు ప్రసిద్ధి గాంచాయి. ఇవి మనిషి నాగరికత పురోగతిని ప్రతిబింబించే ముఖ్య ఆధారాలుగా నిలిచాయి.

ఇటాలియన్‌ పురావస్తు నిపుణులు, పాకిస్తాన్‌ పురావస్తు విభాగం నిర్వహిస్తున్న తవ్వకాలలో, కేవలం ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోనే 50కి పైగా కొత్త స్థలాలు గుర్తించబడ్డాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 400కు పైగా పురావస్తు స్థలాలు ఉన్నట్లు అంచనా. ఇవి ప్రాగైతిహాసిక యుగం నుంచి ఇస్లామిక్‌ కాలం వరకు నిరంతర మానవ నివాసానికి నిదర్శనంగా ఉన్నాయి.

వీటన్నింటిలో కొన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ముఖ్యంగా మొహెంజోదారో, తక్షశిల, తఖ్త్‌-ఇ-భాయి మఠం, లాహోర్‌ కోట, శాలిమార్ బాగ్, రోహ్తాస్ కోట యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్నాయి. ఈ ప్రాచీన స్థలాలు పాకిస్తాన్‌ చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలుగా నిలిచి, ప్రపంచ పర్యాటక ఆకర్షణగా మారాయి.