Let's talk: editor@tmv.in
పాక్‌-అఫ్ఘాన్‌ మధ్య కటీఫ్‌కి కారణమేంటి?

పాక్‌-అఫ్ఘాన్‌ మధ్య కటీఫ్‌కి కారణమేంటి?

FL - TRND
14 అక్టోబర్, 2025

ఒకే పర్వతాల ఒడిలో పెరిగిన రెండు దేశాలు ఇప్పుడు కొట్టుకు చస్తున్నాయ్. ఒకప్పుడు స్నేహం పేరుతో చేతులు కలిపిన అఫ్ఘానిస్థాన్‌-పాకిస్థాన్ జంట, ఇప్పుడు కత్తుల మాదిరి ఎదురెదురుగా నిలబడి పొడుచుకుంటున్నాయ్. పాక్‌-అఫ్ఘాన్‌ సరిహద్దుల్లోని డ్యూరాండ్ లైన్ ఈ రెండు దేశాల యుద్ధానికి వేదికైంది. ఇప్పటికే ఇరువైపుల నుంచి వందల సంఖ్యలో మరణాలు రికార్డయ్యాయి. అటు పాక్‌ సైనికులు, ఇటు తాలిబన్ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. పర్వతాల నడుమ తుపాకీ శబ్దాల ప్రతిధ్వని వినిపిస్తోంది. ఎప్పుడో మిత్రత్వం నాటిన నేల.. ఇప్పుడు ప్రతీకారానికి సాక్ష్యంగా నిలిచింది. విశ్వాసం అనే వృక్షం వాడిపోయి బూడిదైపోయింది. స్నేహం అనే నది ఎండిపోయింది. అది రగులుతున్న మండే నేలగా మారింది. అందుకే ఇది కేవలం రెండు దేశాల పోరాటం కాదని.. ఇది చరిత్రను తిరగరాసే అగ్నిగోళమని నిపుణులు చెబుతున్నారు. అసలు ప్రస్తుత యుద్ధానికి కారణాలు తెలుసుకోవాలంటే ఓ సారి ఫ్లాష్‌బ్యాక్‌ను గుర్తుచేసుకోవాలి.

బ్రిటిష్ పాలన చివర్లో.. అసలు పాకిస్థాన్‌ పుట్టకముందే ఒక గీత గీశారు. దానిపేరే డ్యూరాండ్ లైన్. అది కేవలం సరిహద్దు కాదు, భవిష్యత్తు తగాదాలకు విత్తనం. అఫ్ఘానిస్థాన్‌ ఎప్పటికీ ఆ సరిహద్దు గీతను అంగీకరించలేదు. కానీ పాక్ మాత్రం దాన్ని తన భూసరిహద్దుగా ప్రకటించింది. అప్పటినుంచి ప్రతి దశాబ్దం ఈ గీత చుట్టూ రక్తపు మచ్చలు వదిలింది. సోవియట్ దండయాత్ర సమయంలో పాకిస్థాన్‌ ముజాహిదీన్‌లకు దారితీసింది, ఆయుధం ఇచ్చింది, ఆశ్రయం ఇచ్చింది. ఆ ఆశతో పాక్‌ ఒక వ్యూహాన్ని వేసింది. అఫ్ఘాన్‌ నేలలో తనకు మిత్రులుగా ఉండే శక్తిని పెంచాలనుకుంది. ఆ ఆశలలోంచే తాలిబాన్‌ జన్మించింది. పాకిస్థాన్ దాన్ని తన సైనిక బిడ్డలా పెంచుకుంది. అప్పట్లో ఆ స్నేహం బలంగా కనిపించింది. కానీ అదే బలం తర్వాత తుపాకీగా తిరిగి వచ్చింది. అటు చరిత్రలో అఫ్ఘాన్‌ నేల ఎప్పుడూ ఆక్రమణలకు వేదికగా నిలిచింది. గ్రీకుల నుంచి బ్రిటిష్ వరకు, రష్యా నుంచి అమెరికా వరకు.. ఇలా ప్రతి సామ్రాజ్యం అప్ఘాన్‌ నేలపై పెత్తనాలు చేశాయి. ఇప్పుడు పాక్‌ కూడా అదే మార్గంలో నడుస్తోంది. కాబుల్‌పై కన్నేసింది.

నిజానికి దశాబ్దాలుగా తాలిబన్ల వెనుక పాక్‌ నిలబడింది. వారికి ఆయుధాలు ఇచ్చింది. ఆశ్రయం కూడా ఇచ్చింది. అలా తాలిబాన్‌ బలంగా పెరిగింది. పాక్‌ కూడా ఆనందపడింది. పక్క దేశంలో మన మాట వినే ప్రభుత్వం వచ్చిందని గర్వపడింది. కానీ ఆ కలలు ఎక్కువ రోజులు నిలవలేదు. తాలిబాన్‌ ఎదిగేకొద్దీ దాని తీరూ మారిపోయింది. వాళ్లు పాక్‌ మాట వినడం ఆపేశారు. 2001లో అమెరికా దాడుల తర్వాత తాలిబాన్‌ దాక్కుంది. చాలామంది పాక్‌ నేల మీదే తలదాచుకున్నారు. కాలం గడిచింది. అమెరికా వెళ్లిపోయింది. 2021లో తాలిబాన్‌ మళ్లీ అధికారంలోకి వచ్చింది. పాక్‌ మళ్లీ సంతోషించింది. తాలిబన్లతో తమ స్నేహం మళ్లీ మొదలైందనుకుంది. కానీ ఆ స్నేహం ఇప్పుడు కత్తిలా తిరిగి వచ్చింది. తాలిబాన్‌ తనకు సహాయం చేసిన పాక్‌పైనే కోపం చూపిస్తోంది. తానే పెంచుకున్న తాలిబాన్‌ ఇప్పుడు తనకే ప్రమాదం అయింది. పాక్‌ సరిహద్దుల్లో ప్రతి రోజూ కొత్త అనుమానాలు, కొత్త దాడులు.. ఇలా స్నేహం పేరుతో మొదలైన ఎపిసోడ్‌ ఇప్పుడు యుద్ధపు కథగా మారింది.

తాలిబాన్‌ అధికారంలోకి రాగానే పాక్‌లో టీటీపీ అనే ఉగ్రవాద గ్రూప్ మళ్లీ తల ఎత్తింది. వాళ్లకు ఆశ్రయం దొరికింది. కొత్త బలం వచ్చింది. ఆ బలం పాక్ సైన్యాన్నే లక్ష్యంగా చేసుకుంది. దేశం లోపల బాంబులు పేలుతున్నాయి, సరిహద్దుల దగ్గర తుపాకీ శబ్దాలు వినిపిస్తున్నాయి. టీటీపీ అంటే తహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్. ఇదే గ్రూప్‌ దేశాన్ని తలకిందులు చేయాలని తలపెట్టింది. ఒకప్పుడు విరిగిపోయిన ఉగ్రవాదం, తాలిబాన్‌ పాలన తర్వాత మళ్లీ ఒక్కటైంది. మళ్లీ బలంగా మారింది. పాక్ సైన్యం మీద, పోలీసుల మీద, ప్రభుత్వ కార్యలయాలపై దాడులు మొదలయ్యాయి. బాంబులు పేలుతున్నాయి, రక్తం చిమ్ముతోంది. ప్రజలు భయంతో జీవిస్తున్నారు. ఇక యునైటెడ్ నేషన్స్‌ నివేదికల ప్రకారం ఈ గ్రూప్‌కు తాలిబాన్‌ నుంచి మద్దతు ఉంది. కానీ అఫ్ఘాన్ ప్రభుత్వం మాత్రం దాన్ని తిరస్కరిస్తోంది. ఈ మాటల యుద్ధంలో నిజం ఎక్కడుందో ఎవరూ చెప్పలేరు. కానీ వాస్తవం ఒక్కటే.. పాక్‌ భూమి మీద మళ్లీ రక్తం ప్రవహిస్తోంది. ప్రతి పేలుడు వెనుక ఒక కొత్త కథ ఉంది. ప్రతి శవం వెనుక ఒక పాత తప్పు దాగి ఉంది.

2024 డిసెంబర్‌ నుంచి భీకరంగా మారిన అఫ్ఘాన్‌-పాక్‌ కోల్డ్‌ వార్‌ 2025 అక్టోబర్ నాటికి పీక్‌ స్టేజీకి చేరుకున్నట్టే కనిపిస్తోంది. అఫ్ఘాన్ పర్వతాలపై మళ్లీ యుద్ధ మంటలు చెలరేగాయి. డ్యూరాండ్ లైన్ చుట్టూ గన్ శబ్దాలు గర్జిస్తున్నాయి. రాత్రి పొగమంచులో బుల్లెట్లు దూసుకుపోతున్నాయి. అఫ్ఘాన్ సైన్యం పాక్ బంకర్లపై దాడి చేసినట్టు సమాచారం. పాక్ సైన్యం కూడా ప్రతిదాడి చేసినట్టు నివేదికలు వస్తున్నాయ్. ఎవరు మొదలు పెట్టారో ఎవరికీ తెలియదు. కానీ ఫలితం మాత్రం రక్తం. ఇరువైపులా వందలాది మంది మట్టిలో కలిసిపోయారు. కాబూల్ వైపు నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అఫ్ఘాన్ దళాలు ప్రతీకార చర్యలు చేశాయని అంటున్నారు. పాక్ మాత్రం అప్ఘాన్‌ వాదనను అంగీకరించడంలేదు. ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు అబద్ధం చెబుతున్నారో అనే విషయం తుపాకీ పొగలో కలిసిపోయింది.

మరోవైపు సరిహద్దు గ్రామాలు భయంతో ఖాళీ అయ్యాయి. వాణిజ్యం ఆగిపోయింది. ట్రక్కులు నిలిచిపోయాయి. జీవన రేఖలు కత్తిరించబడ్డాయి. తమ దేశంలో టీటీపీ లేదని అఫ్ఘాన్ అంటోంది. పాక్ మాత్రం టీటీపీకి అఫ్ఘానే ఆశ్రయం ఇస్తోందని చెబుతోంది. ఈ మాటల యుద్ధం ఇప్పుడు తుపాకీ యుద్ధంగా మారింది. ఆకాశం నిప్పుతో మండుతోంది. పర్వతాల మధ్య పేలుళ్ల ప్రతిధ్వనులు నరాల్ని వణికిస్తున్నాయి. ఈ రేఖను కాపాడే శక్తి ఎవరికి ఉందో చూడాలి మరి. ఒకవేళ యుద్ధం ఇలానే కొనసాగితే కేవలం సైనికులు, తాలిబన్ ఆర్మీ మాత్రమే కాకుండా చివరకు సామాన్యులు కూడా చనిపోవడం ఖాయం. అదే జరగకముందే యుద్ధం ఆగిపోవాలని ఇరు దేశాల ప్రజలు కోరుకుంటున్నారు. మరి రేపటి రోజు ఏం జరుగుతుందో ఇప్పటికైతే చెప్పలేం..!

పాక్‌-అఫ్ఘాన్‌ మధ్య కటీఫ్‌కి కారణమేంటి? - Tholi Paluku