
పాక్-అఫ్గాన్ సరిహద్దులో ‘ఓపెన్ వార్’.. డ్రోన్లతో విరుచుకుపడ్డ తాలిబన్లు!
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలివానలా మారి యుద్ధానికి దారితీసింది. ఇరు దేశాలు పరస్పరం వైమానిక, డ్రోన్ దాడులతో విరుచుకుపడుతుండటంతో సరిహద్దు ప్రాంతాలు రణక్షేత్రాన్ని తలపిస్తున్నాయి. శుక్రవారం పాక్ సైనిక చర్యలకు ప్రతీకారంగా అఫ్గాన్ దళాలు జరిపిన భారీ డ్రోన్ దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన వ్యూహాత్మక సైనిక కేంద్రాలు దారుణంగా దెబ్బతిన్నాయి.
కోహత్ సైనిక కోట ధ్వంసం
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని కోహత్‌లో ఉన్న పాక్ సైనిక స్థావరాలే లక్ష్యంగా అఫ్గాన్ రక్షణ శాఖ శుక్రవారం డ్రోన్ దాడులు చేపట్టింది. డ్యూరాండ్ లైన్ వెంబడి ఉన్న కీలకమైన 'కోహత్ మిలిటరీ ఫోర్ట్'పై డ్రోన్లు విరుచుకుపడటంతో అక్కడి కమాండ్ సెంటర్, ఆయుధ డిపోలు, సైనికుల నివాస సముదాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. అంతకుముందు పాక్ జరిపిన ఫిరంగి దాడుల్లో ఖోస్ట్ ప్రావిన్స్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడానికి ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
నివాస గృహాలు, ఇంధన డిపోలే లక్ష్యంగా పాక్ దాడులు
అంతకుముందు పాకిస్థాన్ వైమానిక దళం అఫ్గాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ కాబూల్, కాందహార్, పక్తియా వంటి నగరాల్లో ఇళ్లపై బాంబుల వర్షం కురిపించిందని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఆరోపించారు. కాందహార్ విమానాశ్రయం వద్ద ఉన్న 'కామ్ ఎయిర్' ఇంధన నిల్వలపై కూడా పాక్ దాడులు చేసింది. ఐక్యరాజ్యసమితి విమానాలకు ఇంధనం అందించే ఈ కేంద్రాలపై దాడి చేయడాన్ని అఫ్గాన్ తీవ్రంగా ఖండించింది. రంజాన్ మాసంలో పౌరులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై భారత్ సహా అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
విఫలమైన శాంతి ఒప్పందాలు
గత అక్టోబర్‌లో ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తాజా దాడులతో పూర్తిగా విఫలమైంది. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఈ పరిస్థితులను “ఓపెన్ వార్”గా అభివర్ణించారు. అఫ్గాన్ గడ్డపై టీటీపీ ఉగ్రవాదులకు ఆశ్రయం లభిస్తోందని పాక్ ఆరోపిస్తుండగా, తమపై జరుగుతున్న వైమానిక దాడులను అఫ్గాన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఫిబ్రవరి నుంచి జరుగుతున్న ఈ పోరాటంలో ఇప్పటికే 55 మంది పాక్ సైనికులు మరణించినట్లు సమాచారం. డ్యూరండ్ రేఖ వివాదం ఇరు దేశాల మధ్య దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత అత్యంత భయంకరమైన యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది.
