Let's talk: editor@tmv.in
పాకిస్థాన్ ర‌క్ష‌ణ ద‌ళాల తొలి చీఫ్‌గా అసిమ్ మునీర్‌ నియామ‌కం

పాకిస్థాన్ ర‌క్ష‌ణ ద‌ళాల తొలి చీఫ్‌గా అసిమ్ మునీర్‌ నియామ‌కం

Dantu Vijaya Lakshmi Prasanna
6 డిసెంబర్, 2025

పాకిస్తాన్ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్‌ను ఐదేళ్ల కాలానికి నియమిస్తూ ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదం తెలిపారు.

ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన సిఫార్సు మేరకు ఈ నియామకం జరిగింది. మునీర్ సిడిఎఫ్ బాధ్యతలతో పాటు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పదవిని కూడా ఏకకాలంలో కొనసాగించనున్నారు. జనరల్ ఆయుబ్ ఖాన్ తర్వాత, దేశ చరిత్రలో ఫీల్డ్ మార్షల్ బిరుదును పొందిన రెండో సైనిక అధికారిగా చరిత్ర సృష్టించిన మునీర్ ఈ పదవిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అన్న చర్చ ఇప్పటికే ప్రపంచ దేశాలలో మొదలయ్యి వుండవచ్చు.

సైనిక కమాండ్‌ను కేంద్రీకృతం చేయాలనే లక్ష్యంతో, రాజ్యాంగానికి చేసిన 27వ సవరణ కింద ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ పదవిని గత నెలలో ఏర్పాటు చేశారు. అదనంగా, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధు సేవను మార్చి 19, 2026 నుండి అమలులోకి వచ్చేలా అధ్యక్షుడు రెండు సంవత్సరాల పాటు పొడిగించారు.

27వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సి డి ఎఫ్ పదవిని సృష్టించారు.దీని ద్వారా త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) అన్నింటిపై మునీర్‌కు సంపూర్ణ అధికారం లభించింది. దేశంలోని అణ్వాయుధ వ్యవస్థల నియంత్రణ కూడా కొత్త సిడిఎఫ్ అయిన మునీర్ చేతిలోనే ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా మునీర్‌కు చట్టపరమైన విచారణల నుంచి జీవితకాల ఇమ్యూనిటీ లభించింది

ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్

ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్ ప్రస్తుతం పాకిస్తాన్ సైనిక చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన అధికారి. పాకిస్తాన్ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారిగా 2025 డిసెంబర్ 4న నియమితులయ్యారు. ఈ పదవిని ఐదేళ్ల కాలానికి కొనసాగిస్తారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా 2022 నవంబర్ నుండి ఆర్మీ చీఫ్‌గా కూడా కొనసాగుతున్నారు. సిడిఎఫ్ బాధ్యతలతో పాటు ఈ పదవిని కూడా ఏకకాలంలో నిర్వహిస్తారు. ఫీల్డ్ మార్షల్ గా 2025 మేలో ఈ ఐదు-నక్షత్రాల అత్యున్నత సైనిక హోదాకు పదోన్నతి పొందారు. జనరల్ అయూబ్ ఖాన్ తర్వాత పాకిస్తాన్ చరిత్రలో ఈ ర్యాంక్‌ను పొందిన రెండో వ్యక్తి మునీర్. ఆర్మీ చీఫ్ పదవిలో ఉంటూ ఫీల్డ్ మార్షల్ హోదాను కలిగి ఉన్న మొట్టమొదటి అధికారి కూడా ఈయనే.

మునీర్ 1968లో రావల్పిండిలో జన్మించారు. ఆయన తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు, మత గురువు ( ఇమామ్ ). మునీర్ 'హాఫిజ్' హోదాను కలిగి ఉన్నారు.సౌదీ అరేబియాలో మిలిటరీఅటాచ్‌గా పనిచేస్తున్నప్పుడు ఆయన ఖురాన్ మొత్తాన్ని కంఠస్థం చేశారు.ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ నుండి పట్టభద్రులైనప్పుడు అత్యుత్తమ కేడెట్‌గా 'స్వర్డ్ ఆఫ్ ఆనర్' ను అందుకున్నారు.మునీర్ తన కెరీర్‌లో పాకిస్తాన్‌లోని రెండు ప్రధాన గూఢచార సంస్థలకు నాయకత్వం వహించిన ఏకైక ఆర్మీ చీఫ్. ఇతను అంచలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాడు. అతని పదవులు ,

కమాండర్, ఫోర్స్ కమాండ్ నార్తర్న్ ఏరియాస్ 2014 – 2016

డైరెక్టర్ జనరల్ , మిలిటరీ ఇంటెలిజెన్స్ 2017 – 2018

డైరెక్టర్ జనరల్ , ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ 2018 – 2019

కార్ప్స్ కమాండర్ 2019 – 2021

క్వార్టర్ మాస్టర్ జనరల్ 2021 – 2022

చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా 2022 నవంబర్ నుండి ప్రస్తుతం వరకు ఆర్మీ చీఫ్‌గా కూడా కొనసాగుతున్నారు.