Let's talk: editor@tmv.in
పాకిస్థాన్ దుశ్చర్యలకు పాల్పడితే ధీటుగా జవాబిస్తాం: రాజ్‌నాథ్‌ సింగ్

పాకిస్థాన్ దుశ్చర్యలకు పాల్పడితే ధీటుగా జవాబిస్తాం: రాజ్‌నాథ్‌ సింగ్

Pinjari Chand
3 ఏప్రిల్, 2026

సరిహద్దుల్లో ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా భారత్ నుంచి కఠినమైన ప్రతిస్పందన ఎదురవుతుందని పాకిస్థాన్‌కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించిన వీర్ సైనిక్ సమ్మాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో పొరుగు దేశమైన పాకిస్థాన్‌ ఏదైనా అవివేకపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. అలాంటి చర్యలు జరిగితే భారత్ నుంచి ధీటైన, నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేశారు.

ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్‌‌’ కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్థాన్‌ను మోకాళ్లపైకి తెచ్చిందని ఆయన పేర్కొన్నారు. భారత సైనిక చరిత్రలో ఉగ్రవాదంపై చేపట్టిన అత్యంత పెద్ద ఆపరేషన్ ఇదేనని ఆయన అన్నారు. అయితే ‘ఆపరేషన్ సింధూర్‌‌’ ఇంకా పూర్తిగా ముగియలేదని, సరిహద్దు అవతల నుంచి ఎలాంటి కుట్రలు జరిగినా తగిన ప్రతిస్పందన మాత్రమే కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇక గతంలో యూపీఏ ప్రభుత్వం ఉగ్రదాడుల విషయంలో కఠిన చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. అప్పట్లో దాడులు జరిగినప్పుడు కేవలం పత్రాల సమాహారాలు పంపడమే జరిగేదని ఆరోపించారు. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా స్పందించిందని పేర్కొంటూ, 2016 ఉరి సర్జికల్‌ స్ట్రైక్స్‌, 2019 బాలాకోట్‌ ఎయిర్‌‌ స్ట్రైక్‌ వంటి చర్యలతో పాటు తాజా ఆపరేషన్ సింధూర్‌‌లో కూడా ఉగ్రవాదానికి గట్టి దెబ్బ కొట్టామని ఆయన తెలిపారు.

ఇక పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కూడా రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఆ ప్రాంతంలో ఉన్న భారతీయుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. దేశంలో పెట్రోల్‌, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలను కొందరు తప్పుడు ప్రచారంగా వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. భారత నౌకాదళం ఆ ప్రాంత పరిస్థితులను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముఖ్యంగా కేరళకు చెందిన అనేక మంది పశ్చిమాసియా దేశాల్లో పనిచేస్తున్న నేపథ్యంలో వారి భద్రతపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు.