
పాకిస్థాన్ క్రూరత్వానికి ముగింపులేదా?
పాకిస్తాన్ భూమిపై క్రూరత గాలిలా వ్యాపిస్తోంది. అదృశ్యమవుతున్న మనుషులు, రాత్రిళ్లు తలుపులు తెరిచి వణుకుతున్న కుటుంబాలు, సమాధి లేకుండా మట్టిలో కలిసిపోతున్న శరీరాలు..ఇలా ఆ దేశం తన ప్రజలపై సృష్టిస్తున్న నరకాన్ని చూపిస్తున్నాయి. మానవ హక్కుల అనే పదమే అక్కడ శూన్యమవుతోంది, దాని స్థానంలో భయం, రక్తం, మరణం మాత్రమే మిగిలిపోతున్నాయి. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి 60వ సమావేశంలోఈ దారుణాలపై చర్చ జరిగింది. 'పాకిస్తాన్‌లో అదృశ్యాలు' అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సమావేశాన్ని మానవ హక్కుల, శాంతి ప్రచార కేంద్రం నిర్వహించింది. అక్కడ కశ్మీర్ వాసులు, పశ్తూన్ ప్రతినిధులు, బలూచ్ కార్యకర్తలు, అంతర్జాతీయ మానవహక్కుల వేదికలు ఒకే గళంలో పాకిస్తాన్ క్రూరత్వాన్ని చూపించారు.
అక్కడ వినిపించిన వివరాలు భయంకరమైనవి. కశ్మీర్‌లో సెప్టెంబర్29 నుంచి ఇప్పటివరకు 12మంది చనిపోయారు. వందలమంది నిరసనకారులు జైలులో వేయబడ్డారు. వీరిలో చాలామందిని దారుణంగా హింసిస్తున్నారు. పశ్తూన్ ప్రాంతాల నుంచి దాఖలైన అదృశ్యాల కేసులు 32,000 దాటాయి. అందులో 6,500 కేసులు ధృవీకరించబడ్డాయి. ఐక్యరాజ్యసమితి స్వయంగా కనీసం 300 కేసులను పరిశీలించి పాకిస్తాన్ ప్రభుత్వానికి సమాచారం పంపింది. కానీ సమాధానం మాత్రం ఎప్పుడూ తప్పించుకునే ప్రయత్నమే.
ఇంటర్న్‌మెంట్ కేంద్రాలు అనే భయానక గుహలు కూడా బయటపడ్డాయి. మొత్తం 44 గుప్త ఖైదు కేంద్రాల్లో నిర్భందితులు ఉంచబడి ఉన్నారు. అక్కడ శరీరాలు విరిగిపోతాయి, అరుపులు గోడలలో మునిగిపోతాయి, కొన్ని శవాలు రహస్య గుంతల్లో పాతిపెట్టబడుతున్నాయి. పశ్తూన్ ప్రాంతం మాత్రమే కాకుండా బలూచిస్తాన్‌లోనూ, సింధ్ భూములలోనూ ఇదే దుస్థితి.
జెనీవా వేదికపై పాకిస్తాన్ ఒక భయంకరమైన ముఖంతో బయటపడింది. ప్రజలపై నియంత్రణ కోసం ఈ దేశం మానవ హక్కులను తొక్కుతోంది. ఇది కేవలం ఒక దేశం లోపలి సమస్య కాదు, అంతర్జాతీయ స్థాయిలో యుద్ధ నేరం లాంటి క్రూరత. ఈ పరిస్థితి కొనసాగితే శాంతి అనే పదం కేవలం పుస్తకాల్లో మాత్రమే మిగిలిపోతుంది. ప్రపంచం ఇప్పుడు ఒక సవాల్ ముందు నిలబడి ఉంది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి ఈ దారుణాలకు ఎప్పుడెప్పుడు ముగింపు తెస్తుంది అనేది భవిష్యత్తు అడుగుతున్న ప్రశ్న. ప్రతి అదృశ్యమైన మనిషి ఒక పిలుపు, ప్రతి గల్లంతైన కుటుంబం ఒక కన్నీటి జలపాతం. ఈ పిలుపు వినిపించకపోతే, మానవత్వం అన్నది తన అర్ధాన్నే కోల్పోతుంది.
