
పాకిస్థాన్‌లో రూ.200 పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధర
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరాకు ఆటంకం కలగడంతో, పాక్ ప్రభుత్వం విలాసవంతమైన వాహనాల్లో వాడే 'హై-ఆక్టేన్' ఇంధన ధరను ఏకంగా 200 శాతం పెంచింది. లీటరుకు 200 పాకిస్థానీ రూపాయల (పీకేఆర్) మేర పెంచడంతో దీని ధర రూ.100 నుంచి ఒక్కసారిగా రూ.300కి చేరింది. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
హై-ఆక్టేన్' ఇంధనాన్ని ఎందులో వాడుతారు?
'హై-ఆక్టేన్' ఇంధనం అనేది సాధారణ పెట్రోల్ కంటే ఎక్కువ శక్తిని విడుదల చేస్తూ ఇంజిన్ పనితీరును మెరుగుపరిచే ఒక ప్రత్యేక రకమైన ఇంధనం. దీనిని ప్రధానంగా అత్యధిక ఒత్తిడి వద్ద పనిచేసే మెర్సిడెస్ బెంచ్, బీఎండబ్ల్యూ వంటి విలాసవంతమైన కార్లలోనూ, వేగంగా దూసుకుపోయే ఫెరారీ, లంబోర్గిని వంటి సూపర్ కార్లలోనూ ఉపయోగిస్తారు. ఇవి కాకుండా హార్లే డేవిడ్‌సన్ వంటి ఎక్కువ సీసీ కలిగిన ప్రీమియం బైక్‌లు, టర్బోఛార్జర్ అమర్చిన ఇంజిన్లలో 'నాకింగ్' వంటి అవాంఛిత శబ్దాలు రాకుండా, పికప్ పెరగడానికి దీనిని వాడుతుంటారు. సాధారణంగా మనం వాడే స్కూటర్లు లేదా చిన్న కార్లకు మామూలు పెట్రోల్ సరిపోతుంది కానీ, ఇటువంటి 'హై-ఎండ్' వాహనాల్లో సాధారణ ఇంధనం వాడితే ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఉంది.
సామాన్యులపై పెట్రో, డీజిల్ భారం
అంతకుముందు మార్చి 6న పెట్రోల్, డీజిల్ ధరలను కూడా ప్రభుత్వం భారీగా పెంచింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడమే దీనికి కారణమని పెట్రోలియం మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ పేర్కొన్నారు. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్ ధర రూ. 266.17 నుంచి రూ. 321.17కి, డీజిల్ ధర రూ.280.86 నుంచి రూ. 335.86కి పెరిగింది. అయితే హై-ఆక్టేన్ ఇంధన ధరల పెంపు ప్రభావం ప్రజా రవాణాపై ఉండబోదని ప్రభుత్వం ప్రకటించింది.
విమాన ప్రయాణం మరింత ప్రియం
ఇంధన ధరల సెగ విమానయాన రంగానికి కూడా తాకింది. జెట్ ఫ్యూయల్ ధరలు పెరగడంతో పాకిస్థాన్ విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచాయి. దేశీయ విమాన ఛార్జీలు రూ.2,800 నుంచి రూ.5,000 వరకు పెరగ్గా, అంతర్జాతీయ ప్రయాణాలు మరింత భారంగా మారాయి. విదేశీ ప్రయాణాలపై ఛార్జీలు రూ.10,000 నుంచి రూ.28,000 వరకు పెరిగాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా దేశాలకు వెళ్లే విమాన టికెట్లపై రూ.15,000 అదనపు భారం పడింది.
ఆర్థిక సంక్షోభంలో పాక్ సర్కార్
దేశ ఆర్థిక పరిస్థితి, ఇంధన ధరలపై సమీక్ష నిర్వహించిన ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్థిక ఉపశమన చర్యలపై మంత్రులతో చర్చించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్, పెట్రోలియం మంత్రి అలీ పర్వైజ్ మాలిక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు చల్లారకపోతే మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
