
పాకిస్థాన్‌లో గోధుమ పిండి కష్టాలు
పొరుగు దేశమైన పాకిస్థాన్ లో పిండి ధరలు ఆకాశాన్ని అంటాయి. సుమారు కేజీ పిండి ధర రూ.70 నుంచి రూ.140 వరకు పెరిగాయి. తాజాగా పంజాబ్ ప్రావిన్స్ గోధుమలను ఎగుమతి చేయం అని తేల్చి చెప్పడంతో మరింత ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అక్కడ చక్కెర, టమాటల ధరలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి.
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం గోధుమ సరఫరాపై ఆకస్మికంగా నిషేధం విధించడంతో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్, దాని పొరుగు రావల్పిండి నగరాల్లో పిండి కొరత తీవ్రరూపం దాల్చింది. పంజాబ్ ఆహారశాఖ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఫ్లోర్ మిల్స్ అసోసియేషన్ సోమవారం నుంచి పిండి పంపిణీ నిలిపివేస్తామని ప్రకటించింది. దీంతో ఆహార అత్యవసర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ హెచ్చరించింది.
శుక్రవారం రాత్రి నుంచే డీలర్లు, తందూర్ (రోటీ దుకాణాలు), కిరాణా వ్యాపారులు పెట్టిన గోధుమ, పిండి, ఫైన్ పిండి ఆర్డర్లు రద్దయాయి. ఫలితంగా మార్కెట్లలో ఒక్కసారిగా కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో రావల్పిండి ఫ్లోర్ మిల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. పేట్రన్ ఇన్‌చీఫ్ షేఖ్ తారిక్ సాదిక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పంజాబ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రావల్పిండి, ఇస్లామాబాద్ పూర్తిగా పంజాబ్ గోధుమ ఉత్పత్తులపైనే ఆధారపడి ఉన్నాయని, సరఫరా నిలిచిపోవడంతో పిండి ఉత్పత్తి స్తంభించిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అనుమతులు పునరుద్ధరించకపోతే పరిస్థితి మానవతా సంక్షోభం దిశగా వెళ్తుందని హెచ్చరించారు.
నాన్బాయ్ అసోసియేషన్ (తందూర్ యజమానుల సంఘం) కూడా ప్రభుత్వంపై మండిపడింది. సంఘం అధ్యక్షుడు షఫిక్ ఖురేషీ మాట్లాడుతూ ‘షెహ్బాజ్ షరీఫ్, మరియం నవాజ్ ప్రభుత్వాలు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 79 కిలోల పిండి బస్తా ధర రూ.5,500 నుంచి రూ.11,000కు పెరిగింది. ఫైన్ పిండి రూ.6,200 నుంచి రూ.12,600కు చేరిందన్నారు. ప్రభుత్వం ధరల నియంత్రణ పేరుతో దుకాణాలపై అణచివేత కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు. అక్టోబర్ 1 నుంచి ఇప్పటివరకు డజన్ల కొద్దీ తందూర్ దుకాణాలు కూల్చివేసి, 79 దుకాణాలను మూసివేసి, 100 మందికి పైగా యజమానులకు రూ.25,000 నుంచి రూ.50,000 వరకు జరిమానాలు విధించారని వెల్లడించారు. ప్రస్తుత పిండి ధరలకు అనుగుణంగా రొటీ ధరలను సవరించేందుకు ప్రైస్ కంట్రోల్ కమిటీ తక్షణం సమావేశమవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల సహనం, రొటీ ధరల భారం రెండూ కూడా తీవ్ర స్థాయికి చేరుకున్నాయి అని హెచ్చరించారు.
పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం రానున్న శీతకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎగుమతులను నిషేదించింది. ఈ కాలంలో ప్రజలు ఎక్కువగా రొట్టెలపైనే ఆధారపడతారు. అలాగే పౌల్ట్రీ, ఫీడ్ కోసం కూడా ఇవే వినియోగిస్తుండడం, ప్రస్తుతం నిల్వలు తగ్గడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
