
పాకిస్తాన్ హ్యాండ్లర్లతో ఎర్రకోట నిందితుల ‘ఘోస్ట్’ కమ్యూనికేషన్
ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో నవంబర్ 10, 2025న జరిగిన పేలుడుకు సంబంధించిన దర్యాప్తులో ఉన్నత విద్యావంతులైన డాక్టర్లు ‘ఘోస్ట్’ సిమ్‌లను ఉపయోగించి పాకిస్తాన్ హ్యాండ్లర్లతో కమ్యూనికేట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసుల సమాచారం ప్రకారం ఈ నిందితులు డ్యూయల్ ఫోన్ వ్యూహాన్ని అనుసరించి, ఒక్కొక్కరికి 2–3 ఫోన్లు వున్నాయి. ఒక ఫోన్ సాధారణ వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాల కోసం, పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్లతో సంప్రదించడానికి మరొక ఫోన్ వాడారు. అందులో కేవలం వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వారితో సంభాషణ కొనసాగించారు. నకిలీ ఆధార్, గోస్ట్ సిమ్‌లను ఉపయోగించి ఈ ఫోన్లను రిజిస్టర్ చేశారు. కొంతమంది సిమ్‌లు అసలు వ్యక్తుల ఆధార్ వివరాలను దుర్వినియోగం చేస్తూ జారీ అయ్యాయి. పోలీసులు జమ్మూ–కాశ్మీర్‌లో కూడా ఫేక్ ఆధార్ సిమ్ రాకెట్‌ను బయటపెట్టారు.
దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడి
ఈ నిందితులు ఐఈడీ తయారీ విధానాలను యూట్యూబ్ ద్వారా నేర్చుకొని, ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు. వీరి హ్యాండ్లర్లు కోడ్ నేమ్‌లు ‘ఉకాసా’‘ఫైజాన్’‘హాష్మీ’గా కనుగొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ టెలికమ్యూనికేషన్ యాక్ట్ , 2023, టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ ఆధారంగా, వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లు ఫోన్‌లో యాక్టివ్ సిమ్ లేకుండా వినియోగించకుండా డీఓటీ ఆదేశాలు జారీ చేసింది. 90 రోజులలో అన్ని యాప్‌లు ఈ నియమాలకు అనుగుణంగా ఉండాలి. ఈ ‘వైట్-కాలర్’ టెర్రర్ మాడ్యూల్ అక్టోబర్ 18–19 రాత్రి శ్రీనగర్‌లో జైషే మహ్మాద్ పోస్టర్లు వెలిసిన తరువాత బయటపడింది. జమ్మూ–కాశ్మీర్ పోలీస్‌లతో సహా నేషనల్ ఇన్వేష్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు (ఎన్ఐఏ) నిర్వహిస్తోంది. హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో నుంచి ఇద్దరు నిందితులు అరెస్ట్ కాగా, 2,900 కిలోల అమోనియం నైట్రేట్, పొటాసియం నైట్రేట్, సల్ఫర్ వంటి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విశ్లేషణ
డిజిటల్ లోపాలను ఉగ్రవాదులు దుర్వినియోగం చేస్తుండటమే ప్రధాన ప్రమాదం. టెలికాం నిబంధనలు కఠినతరం చేయడం ద్వారా భద్రతను బలోపేతం చేస్తాం అని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
