
పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్-బాల్టిస్తాన్‌లో కేర్‌టేకర్ కేబినెట్‌పై యువత ఆగ్రహం
పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్-బాల్టిస్తాన్ (పీవోజీబీ)లో ఏర్పాటు చేసిన కేర్‌టేకర్ ప్రభుత్వ కేబినెట్‌పై(తాత్కాలిక ప్రభుత్వం) తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. రాబోయే సాధారణ ఎన్నికల ముందు ఎన్నికల నిష్పక్షపాతాన్ని దెబ్బతీసే విధంగా నియామకాలు జరిగాయంటూ యువజన సంఘాలు, ప్రతిపక్ష నేతలు, పౌర సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. జీబీ యూత్ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో గిల్గిట్‌లోని చినార్‌బాగ్ ప్రాంతంలో ఉన్న ముఖ్యమంత్రి సచివాలయం ఎదుట భారీ నిరసన కార్యక్రమం జరిగింది. డాన్ పత్రిక కథనం ప్రకారం కేర్‌టేకర్ కేబినెట్‌లో నియమితులైన పలువురు వ్యక్తులు గతంలో రాజకీయ పార్టీలతో అనుబంధం కలిగి ఉండటం లేదా మునుపటి ప్రభుత్వాల్లో బాధ్యతలు నిర్వహించారని నిరసనకారులు ఆరోపించారు. ఇలాంటి నియామకాలు తాత్కాలిక (కేర్‌టేకర్) ప్రభుత్వానికి ఉండాల్సిన తటస్థ సూత్రాలకు విరుద్ధమని, దీని వల్ల ఎన్నికల విశ్వసనీయతపై తీవ్ర అనుమానాలు తలెత్తుతున్నాయని వారు తెలిపారు. ముందస్తు ఎన్నికలలో మోసాలకు ఇది దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
రోడ్డుపై ధర్నా – ఎనిమిది మంది అరెస్ట్
నిరసన క్రమంగా సిట్-ఇన్‌గా మారడంతో చినార్‌బాగ్‌లోని రివర్ రోడ్ కొంతసేపు పూర్తిగా నిలిచిపోయింది. అనంతరం పోలీసులు చర్యలు తీసుకుని జీబీ యూత్ మూవ్‌మెంట్ చైర్మన్‌తో సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులను పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. జీబీ యూత్ మూవ్‌మెంట్ చైర్మన్ అజ్ఫర్ జంషెడ్ మాట్లాడుతూ కేర్‌టేకర్ ప్రభుత్వంపై యువత అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలు గిల్గిట్‌కే పరిమితం కావు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న పీవోజీబీ యువత కూడా ఉద్యమంలో భాగస్వాములవుతారని ఆయన స్పష్టం చేశారు.
ఇతర జిల్లాల్లోనూ వ్యతిరేకత
కేర్‌టేకర్ కేబినెట్‌పై అసంతృప్తి గిల్గిట్‌కే పరిమితం కాలేదు. ఘాంచే, నగర్, షిగర్ జిల్లాల్లో కూడా రాజకీయ పార్టీలు, పౌర సంస్థలు సమాంతర నిరసనలకు పిలుపునిచ్చాయి. పీవోజీబీ అసెంబ్లీ మాజీ సభ్యుడు సుల్తాన్ అలీ ఖాన్, అవామీ యాక్షన్ కమిటీ ఘాంచే నేత జకీర్ హుస్సేన్ కాజిమ్ సహా పలువురు నాయకులు ఈ కేబినెట్‌ను ప్రాతినిధ్యం లేని, వివక్షతో కూడిన ఏర్పాటుగా అభివర్ణించారు. కాజిమ్ మాట్లాడుతూ సరిహద్దు జిల్లా అయిన ఘాంచేను పూర్తిగా పక్కన పెట్టడం అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని పెంచుతోందని, దీని ప్రభావం దీర్ఘకాలికంగా ఉండొచ్చని హెచ్చరించారు. ఒకే జిల్లాకు చెందిన పలువురిని కేబినెట్‌లో చేర్చడం, ఇతర జిల్లాలను విస్మరించడం స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికలకు ముప్పుగా మారుతుందని ఆయన ప్రశ్నించారు.
నగర్ జిల్లాలోనూ ప్రతిపక్ష ఆగ్రహం
నగర్ జిల్లాలో కూడా పీపీపీ, పీఎంఎల్-ఎన్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయంగా, వ్యూహాత్మకంగా కీలకమైన తమ జిల్లాకు కేబినెట్‌లో చోటు లేకపోవడాన్ని వారు తప్పుబట్టారు. సమానత్వం, న్యాయం సాధించే వరకు మా నిరసనలు కొనసాగుతాయని వారు ప్రకటించారు.
మాజీ ముఖ్యమంత్రి, పీఎంఎల్-ఎన్ పీవోజీబీ అధ్యక్షుడు హఫీజ్‌ఉర్ రెహ్మాన్ మాట్లాడుతూ కేర్‌టేకర్ ప్రభుత్వానికి సంబంధించి ముందుగా ఒప్పుకున్న రూపకల్పన ప్రకారం ప్రతి జిల్లాకు ప్రాతినిధ్యం ఉండాలి, రాజకీయ పార్టీలతో అనుబంధాలు ఉన్నవారిని కేబినెట్‌కు దూరంగా ఉంచాలని తెలిపారు. ఈ ప్రమాణాలు లేకుంటే ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
