Let's talk: editor@tmv.in
పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య శాంతి చర్చలు విఫలం

పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య శాంతి చర్చలు విఫలం

Yekkirala Akshitha
28 అక్టోబర్, 2025

పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇస్తాంబుల్‌లో జరిగిన కీలక శాంతి చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. ఆఫ్ఘన్ గడ్డపై నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ), ఇతర మిలిటెంట్ గ్రూపులపై చర్యలు తీసుకోవడానికి ఆఫ్ఘన్ తాలిబన్ ప్రతినిధి బృందం నిరాకరించడంతో ఈ చర్చలు మరోసారి ప్రతిష్టంభనలోకి వెళ్లాయి. సంవత్సరాల నాటి అపనమ్మకం, సరిహద్దు హింస, ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాలు తీవ్ర ఘర్షణల అంచుకు చేరుకున్న నేపథ్యంలో ఈ చర్చలు వైఫల్యం చెందడం ఆందోళన కలిగిస్తోంది.

రెండు రౌండ్ల చర్చలు విఫలం

ఈ నెలలో పాకిస్తాన్-ఆఫ్ఘన్ తాలిబన్ మధ్య జరిగిన చర్చల్లో ఇది రెండవ రౌండ్. అక్టోబర్ మధ్యలో (అక్టోబర్ 13-14) జరిగిన మొదటి రౌండ్ చర్చలు కూడా టర్కీ, ఖతార్ అధికారుల మధ్యవర్తిత్వం ఉన్నప్పటికీ ఎటువంటి స్పష్టమైన పురోగతి లేకుండానే ముగిశాయి. రెండవ రౌండ్ చర్చలు అక్టోబర్ 26,27 తేదీల్లో జరిగాయి. కాబూల్ నుండి లిఖితపూర్వక హామీలను పొందడానికి ఈ చర్చలను ఒక అవకాశంగా భావించినప్పటికీ, తాలిబన్ ప్రతినిధి బృందం ఎటువంటి ధృవీకరించదగిన చర్యలకు హామీ ఇవ్వడానికి, సంతకం చేయడానికి నిరాకరించడంతో మరోసారి ప్రతిష్టంభన కొనసాగింది.

సంక్షోభానికి మూలం: టీటీపీకి ఆశ్రయం

2021 ఆగస్టులో అమెరికా తమ సైనికులను ఉపసంహరించుకున్న తర్వాత తాలిబన్లు కాబూల్‌లో అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ మొదట్లో వారిని స్వాగతించింది. తమకు సైద్ధాంతిక సంబంధాలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌లో ఘోరమైన దాడులకు పాల్పడుతున్న టీటీపీని అదుపులోకి తీసుకుంటారని ఆఫ్ఘన్ ప్రభుత్వంపై పాక్ ఆశలు పెట్టుకుంది. అయితే సహకారం లభించకపోగా, టీటీపీ ఆఫ్ఘనిస్తాన్ లో తిరిగి బలోపేతం కావడం, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్లలో పాక్ భద్రతా బలగాలు, పౌరులపై సరిహద్దు దాడులు చేయడం పాకిస్తాన్ గమనించింది.

తాలిబన్ పాలన టీటీపీ నాయకులకు సురక్షిత ఆశ్రయాలు కల్పిస్తోందని, ఆఫ్ఘన్ భూభాగం రక్షణలో వారు స్వేచ్ఛగా పనిచేయడానికి అనుమతిస్తోందని పాక్ ఆరోపిస్తోంది. అయితే ఆఫ్ఘన్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, పాకిస్తాన్ సరిహద్దు విధానాలు ఉద్రిక్తతలను పెంచాయని వాదిస్తోంది. 2022లో టీటీపీతో చర్చలు జరపడానికి పాకిస్తాన్ ప్రయత్నించగా, తాలిబన్ సౌకర్యంతో ఆ చర్చలు జరిపినా, పదేపదే ఆత్మాహుతి దాడులు జరగడంతో పాకిస్థాన్ ఆ చర్చలను పూర్తిగా విరమించుకుంది.

ఉద్రిక్తతల పెరుగుదల

2024 అక్టోబర్ ప్రారంభంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్, పక్తికా ప్రావిన్సుల్లోని టీటీపీ స్థావరాలపై పాకిస్తాన్ సరిహద్దు దాటి వైమానిక దాడులు ప్రారంభించడంతో ఘర్షణ తీవ్రమైంది. అక్టోబర్ 6న నార్త్ వజీరిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై జరిగిన టీటీపీ దాడిలో పలువురు పాక్ సైనికులు మరణించడం, ఈ దాడి ఆఫ్ఘన్ గడ్డపై నుంచి జరిగినట్లు ఇంటెలిజెన్స్ ధృవీకరించడంతో పాకిస్తాన్ ఈ చర్యకు దిగింది.

ఆఫ్ఘన్ తాలిబన్ వైమానిక దాడులను "ఆఫ్ఘన్ సార్వభౌమాధికారం ఉల్లంఘన"గా ఖండించింది. దీంతో డ్యూరాండ్ లైన్ వెంబడి సరిహద్దు ఘర్షణలు తీవ్రమయ్యాయి. పాకిస్తాన్ ప్రభుత్వం సరైన పత్రాలు లేని ఆఫ్ఘన్ శరణార్థులను దేశం నుండి బహిష్కరించడం, సరిహద్దు నియంత్రణలను కఠినతరం చేయడం సంబంధాలను మరింత దిగజార్చింది.

ఈ పరిణామాలు ద్వైపాక్షిక సంఘర్షణను ప్రమాదకరమైన దశలోకి నెట్టాయి. దీంతో ప్రాంతీయ మధ్యవర్తులుగా ఖతార్, టర్కీ రంగంలోకి దిగాయి. అక్టోబర్ 19న ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ తాత్కాలికంగా ఘర్షణలను నిలిపివేసింది. ఇస్తాంబుల్ చర్చలకు మార్గం సుగమం చేసింది.

చర్చల్లో ప్రతిష్టంభన

చర్చలు ఆదివారం చివరి వరకు కొనసాగినా ఇరుపక్షాలు తమ కీలక సమస్యలను పరిష్కరించుకోలేకపోయాయి. పాకిస్తాన్ భద్రతా అధికారులు తమ ప్రతినిధి బృందం తుది వైఖరిని సమర్పించిందని, ఉగ్రవాద స్థావరాలను లేకుండా చేయడానికి తాలిబన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిందని తెలిపారు. "ఆఫ్ఘన్ తాలిబన్ ఉగ్రవాదులకు ఇస్తున్న ఆశ్రయం ఆమోదయోగ్యం కాదు" అని పాకిస్తాన్ స్పష్టం చేసింది. ఆఫ్ఘన్ ప్రతిస్పందనలు వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉన్నాయని పాక్ అధికారి ఒకరు ఆరోపించారు.

తాలిబన్ ప్రతిపాదన

ఒక దశలో తాలిబాన్ పాకిస్తాన్, టీటీపీ మధ్య నేరుగా చర్చలు జరపడానికి మధ్యవర్తిత్వం చేస్తామని ఆఫర్ చేసినా, ఇస్లామాబాద్ దాన్ని పూర్తిగా తిరస్కరించింది. “ఉగ్రవాద సంస్థతో ఎప్పుడూ చర్చలు జరపమని” స్పష్టం చేసింది. పాకిస్తాన్ చర్చల సమయంలో టీటీపీ, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇతర ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘాన్ భూభాగం నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని “ఫోటోలు, పత్రాధారాలతో కూడిన సాక్ష్యాలు” సమర్పించింది.

రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ పాకిస్తాన్ ప్రతినిధులు “దేశ ప్రజలను ఉగ్రవాదం నుండి రక్షించడానికి ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని” పునరుద్ఘాటించారు. చర్చలు జరుగుతున్న సమయంలోనే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని లీపా సెక్టార్‌లో కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగిందని వార్తలు రావడం, అలాగే కుర్రం, నార్త్ వజీరిస్తాన్‌లో చొరబాటు ప్రయత్నాలను పాక్ సైన్యం నివేదించడం తాలిబన్ చిత్తశుద్ధిపై అనుమానాలను పెంచింది. ప్రస్తుతానికి ఖతార్, టర్కీ మధ్యవర్తులు ఇరుపక్షాల మధ్య సంభాషణను కొనసాగించడానికి, సంబంధాలను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నారు.