
పహల్గాం ఉగ్రదాడి కేసులో చార్జిషీట్
కశ్మీర్ లోని పహల్గాం బైసరన్ మైదానాల్లో జరిగిన ఘోర ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం ప్రత్యేక కోర్టులో 1,597 పేజీల సమగ్ర చార్జిషీట్ ను దాఖలు చేసింది. ఈ దాడిలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానిక గుర్రపు స్వారీ నిర్వాహకుడు మృతి చెందారు. ఈ కేసులో ఆరుగురు వ్యక్తులు, పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రసంస్థలు లష్కర్-ఈ-తోయిబా (ఎల్ఈటీ), దాని అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)పై అభియోగాలు మోపారు. ఎన్ఐఏ ప్రకారం, ఈ ఉగ్రదాడి వెనుక ఉన్న కుట్ర పాకిస్తాన్ నుంచే నడిచింది. భారత్‌పై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్ పాత్ర నిరంతరంగా కొనసాగుతోందని చార్జిషీట్‌లో పేర్కొంది. లష్కర్-ఈ-తోయిబా చీఫ్ హాఫిజ్ సయీద్ (అమెరికా, భారత్ రెండింటి చేత గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తింపు పొందిన వ్యక్తి)తో పాటు, టీఆర్ఎఫ్ చీఫ్ హబీబుల్లా మాలిక్ అలియాస్ సాజిద్ జాట్ను కూడా ప్రధాన నిందితులుగా పేర్కొంది.
ఈ దాడిలో పాల్గోన్న ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులైన ఫైసల్ జాట్ అలియాస్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అలియాస్ జిబ్రాన్, హమ్జా అఫ్ఘానీ ఉన్నారు. వీరిని జూలై 29న శ్రీనగర్ శివార్లలోని దాచిగాం ప్రాంతంలో ‘ఆపరేషన్ మహాదేవ్’లో భారత సైన్యం హతమార్చింది. అలాగే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఆరోపణలపై పర్వైజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ జోతార్లను కూడా నిందితులుగా చేర్చారు. విచారణలో వారు ఉగ్రవాదుల గుర్తింపును, వారు పాకిస్తాన్‌కు చెందినవారేనని ధృవీకరించారు. ఈ కేసులో భారతదేశంపై యుద్ధం చేయడానికి సంబంధించిన సెక్షన్లను కూడా ఎన్ఐఏ చేర్చింది. ఎనిమిది నెలల పాటు సాగిన శాస్త్రీయ, సవివర దర్యాప్తు అనంతరం ఈ చార్జిషీట్ దాఖలైంది.
