Let's talk: editor@tmv.in
పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం.. 6.0గా తీవ్రత నమోదు

పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం.. 6.0గా తీవ్రత నమోదు

Shaik Mohammad Shaffee
12 ఫిబ్రవరి, 2026

పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం బుధవారం భారీ భూకంపంతో ఒక్కసారిగా వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం సముద్ర గర్భంలో పెను అలజడి సృష్టించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2:14 గంటలకు ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

అగాధంలో భూకంప కేంద్రం

సముద్ర మట్టానికి సుమారు 515 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని అక్షాంశం 21.15 ఎస్, రేఖాంశం 178.28 డబ్ల్యూగా నమోదైంది. ఈ తీవ్రత కారణంగా సమీప తీర ప్రాంతాల్లో స్వల్పంగా ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం. అయితే లోతు ఎక్కువగా ఉండటంతో పెను ముప్పు తప్పిందని నిపుణులు భావిస్తున్నారు.

ఇక్కడే ఎందుకు ఎక్కువ భూకంపాలు వస్తాయి?

ప్రపంచంలో సంభవించే అతిపెద్ద భూకంపాలలో 81 శాతం పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ఈ 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలోనే జరుగుతున్నాయి. ఇది సుమారు 40 వేల కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న ఒక ప్రమాదకరమైన జోన్. ఇక్కడ భూమి అంతర్భాగంలో ఉండే పలకలు (టెక్టోనిక్ ప్లేట్లు) ఒకదానితో ఒకటి బలంగా ఢీకొనడం వల్ల విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు భారీ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతంగా పిలుస్తారు.

చరిత్రలో భారీ భూకంపాలన్నీ ఇక్కడే..

ప్రపంచంలోని 90 శాతం భూకంపాలు ఈ 'రింగ్ ఆఫ్ ఫైర్' పరిధిలోనే సంభవిస్తాయి. 1960లో చిలీలో సంభవించిన 9.5 తీవ్రత భూకంపం, 1964లో అలస్కాలో వచ్చిన 9.2 తీవ్రత భూకంపం ఈ ప్రాంతానికే చెందినవి. ఏటా ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 లక్షల భూకంపాలు నమోదవుతుండగా, అందులో లక్ష భూకంపాలు మాత్రమే మనుషులకు తెలిసేలా (ప్రకంపనలు బయటకు కనిపించేలా) ఉంటాయి. వీటిలో సుమారు 100 భూకంపాలు మాత్రమే తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయి.

కోట్లాది ఏళ్ల క్రితమే..

ప్రస్తుతం కనిపిస్తున్న ఈ 'రింగ్ ఆఫ్ ఫైర్' దాదాపు 11.5 కోట్ల ఏళ్ల క్రితమే ఏర్పడిందని పరిశోధనలు చెబుతున్నాయి. తొలుత ఉత్తర, దక్షిణ అమెరికా అలాగే ఆసియా తీర ప్రాంతాల్లో భూమి లోపలి పలకలు ఢీకొనడం వల్ల ఈ ప్రక్రియ మొదలైంది. కాలక్రమేణా 7 కోట్ల ఏళ్ల క్రితం ఇండోనేషియా, న్యూ గినియా ప్రాంతాలకు.. చివరగా 3.5 కోట్ల ఏళ్ల క్రితం న్యూజిలాండ్ వరకు ఇది విస్తరించింది. ఇలా కొన్ని కోట్ల ఏళ్ల పాటు భూమి అంతర్భాగంలో సహజంగా జరిగిన మార్పుల వల్లే నేడు ఉన్న ఈ ప్రమాదకరమైన భూకంప వలయం ఆవిర్భవించింది.

బంగ్లాదేశ్, మయన్మార్‌లలోనూ భూప్రకంపనలు

మరోవైపు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్‌లలో బుధవారం భూప్రకంపనలు సంభవించాయి. బంగ్లాదేశ్‌లో 4.0 తీవ్రతతో, మయన్మార్‌లో 3.8 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. ఇవి కేవలం 10-11 కి.మీ. లోతులోనే సంభవించడం వల్ల ప్రకంపనల ధాటి ఎక్కువగా ఉంది. సాధారణంగా లోతు తక్కువగా ఉండే భూకంపాలు ప్రాణ, ఆస్తి నష్టానికి ఎక్కువ కారణమవుతాయి.

బంగ్లాదేశ్ మూడు టెక్టోనిక్ ప్లేట్ల (ఇండియన్, యురేషియా, బర్మా) కలయిక వద్ద ఉండటం వల్ల అత్యంత ప్రమాదకర జోన్‌లో ఉంది. ముఖ్యంగా రాజధాని ఢాకా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర 20 నగరాల్లో ఒకటిగా ఉంది. మరోవైపు మయన్మార్‌లోని 'సగాయింగ్ ఫాల్ట్' కారణంగా అక్కడి 46 శాతం జనాభాకు భూకంప ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.