Let's talk: editor@tmv.in
పసిడి పధకాల వైపు ఓ లుక్ వేద్దాం…

పసిడి పధకాల వైపు ఓ లుక్ వేద్దాం…

Dantu Vijaya Lakshmi Prasanna
17 అక్టోబర్, 2025

ధన త్రయోదశి సందర్భంగా అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకొనే అంశం కొత్త స్వర్ణాభరణాలను, వస్తువులను కొనుగోలు చేయడం.ఈ రోజున బంగారం కొనుగోలు చేసి ఆ మహాలక్ష్మికి సమర్పిస్తే సకల అభీష్టాలు నెరవేరతాయని, ఇంటిల్లిపాదీ సుఖసంతోషాలతో కళకళలాడుతుంటారని భావిస్తారు. ధన త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అష్త్టెశ్వర్యాల సిద్ధి కోసం కొన్ని ప్రాంతాల్లో కుబేరుడిని పూజించడం కూడా ఒక ఆచారంగా ఉంది.

మనం ఏ ఉద్దేశంతో బంగారం కొంటున్నామనే దానిపైనే దాన్ని ఏ రూపంలో కొనుగోలు చేయాలనే నిర్ణయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత వినియోగం కోసం అయితే నగల రూపంలో కొనుగోలు చేయవచ్చు. అదే పెట్టుబడి ఉద్దేశమైతే మాత్రం, పసిడి పథకాలు, గోల్డ్ ఈటీఎఫ్‌ వంటి వాటిని పరిశీలించడం ఉత్తమం. ఏదేమైనా, బంగారంలో పెట్టిన పెట్టుబడులపై ఆదాయపు పన్నువర్తిస్తుంది. మరి ఏ రూపంలో బంగారం కొంటే ఎంత పన్ను పడుతుందో తెలుసుకుందామా?

మూలధన లాభాలు:

ఆదాయపు పన్ను విషయానికి వస్తే, బంగారం విక్రయించినప్పుడు వచ్చే మూలధన లాభాలపై పన్ను వర్తిస్తుంది. ఈ పన్ను రెండు రకాలుగా ఉంటుంది:

• స్వల్పకాలిక మూలధన లాభం

• దీర్ఘకాలిక మూలధన లాభం

బంగారం కొనుగోలు చేసిన మూడేళ్ల (36 నెలలు) లోపు విక్రయిస్తే వచ్చే లాభాన్ని స్వల్పకాలిక మూలధన లాభం అంటారు. మూడేళ్ల తర్వాత విక్రయిస్తే దానిని దీర్ఘకాలిక మూలధన లాభంగా లెక్కిస్తారు

బంగారు నాణేలు, బిస్కెట్లు, ఆభరణాలు విక్రయించినప్పుడు

స్వల్ప కాలిక లాభం లో అయితే ఈ లాభాన్ని పన్ను చెల్లింపుదారుని సాధారణ ఆదాయానికి జతచేసి, ఆ ఆదాయ మొత్తానికి వర్తించే స్లాబ్ రేటు ప్రకారం పన్ను లెక్కిస్తారు.

దీర్ఘకాలిక లాభం లో అయితే దీనిపై ఇండెక్సేషన్ ప్రయోజనంతో కలిపి 20% పన్ను (సెస్ అదనంగా) పడుతుంది.

జీఎస్టీ: భౌతిక బంగారపు వస్తువుల కొనుగోలుపై 3% జీఎస్టీ, తయారీ ఛార్జీలపై 5% నుండి జీఎస్టీ వర్తిస్తుంది.

మూలధన లాభాల పన్ను వ్యక్తులకు (పెట్టుబడిదారులకు) మాత్రమే వర్తిస్తుంది. బంగారం కొనుగోలు, విక్రయించే వ్యాపారులకు ఇది వర్తించదు. వారికి ఇది వ్యాపారంపై వచ్చిన ఆదాయంగా పరిగణించి పన్ను విధిస్తారు.

గోల్డ్ ఈటీఎఫ్‌, గోల్డ్ ఫండ్లు:

గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్ ఎక్స్‌ఛేంజీలలో ట్రేడ్ అవుతాయి. ఒక ఈటీఎఫ్‌ యూనిట్, 1 గ్రాము బంగారంతో సమానం. వీటిపై వచ్చే మూలధన లాభాలపై భౌతిక బంగారం లాగే పన్నులు వర్తిస్తాయి.

డిజిటల్ గోల్డ్

మొబైల్ వ్యాలెట్ల ద్వారా కొనుగోలు చేసే బంగారాన్ని డిజిటల్ గోల్డ్‌గా పిలుస్తారు. దీనిపై కూడా భౌతిక బంగారం తరహాలోనే పన్నులు (జీఎస్టీ, మూలధన లాభాల పన్ను) వర్తిస్తాయి.

సావరిన్ గోల్డ్ బాండ్లు

పసిడి బాండ్లు అనేది ప్రభుత్వ సెక్యూరిటీ. ఇక్కడ ఒక యూనిట్ ఒక గ్రాము బంగారంతో సమానం. ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. మెచ్యూరిటీ కాలం 8 సంవత్సరాలు. ఐదో సంవత్సరం తర్వాత ప్రీ-మెచ్యూర్ విత్‌డ్రాలను అనుమతిస్తారు.

ఈ బాండ్లను మెచ్యూరిటీ వరకు కొనసాగిస్తే మూలధన లాభాలపై పన్ను ఉండదు. పూర్తి మినహాయింపు ఉంటుంది. ప్రీ-మెచ్యూర్ విత్‌డ్రా ఒకవేళ ఐదేళ్ల తర్వాత, మెచ్యూరిటీ కంటే ముందే విత్‌డ్రా చేసుకుంటే, ఇండెక్సేషన్ ప్రయోజనంతో కలిపి 20% దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది.

గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్

బంగారం దిగుమతులను తగ్గించడానికి, ఇళ్లలో ఉన్న నిరుపయోగ బంగారాన్ని వాడుకలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని (2015లో) ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఎవరైనా తమ బంగారాన్ని డిపాజిట్ చేసి వడ్డీ పొందవచ్చు. ఈ పథకంలో డిపాజిట్ చేసిన పాత బంగారంపై వచ్చే మూలధన లాభాల పన్ను పూర్తిగా మినహాయించబడుతుంది. అలాగే, దీనిపై వచ్చే వడ్డీ కి కూడా పన్ను మినహాయింపు లభిస్తుంది.

మరి ఇక మీరే ఆలోచించండి ఆకాశాన్ని అందుకుంటున్న పసిడి పరుగుల వెనక సంప్రదాయం పేరుచెప్పి పరిగెట్టాలా .. లేక పొదుపు పేరుచెప్పి డిజిటల్ బాండ్ల రూపంలో కొని భవిష్యత్తుకు భరోసాగా చేసుకోవాలా అని. ప్రస్తుతమైతే పసిడి పరుగులు ఇప్పట్లో ఆగేలా లేవు . వెండి కొందామన్నా అది పసిడికన్నా దూకుడుగా పరిగెడుతుంది..సాంప్రదాయాలు మన ఆచారాలు ముందుతరాలకు కానుకలుకావాలి కాని బరువులు కాకూడదు.అందరి జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి దివ్వెలా కాంతులతో మరింత అందంగా మెరావాలి కాని బంగారు ఆభరణాల వెలుగులో కాదు. ఇది గుర్తించుకుంటే సరదాల సంబురాలు అంబారాన్ని అంటుతాయి.

పసిడి పధకాల వైపు ఓ లుక్ వేద్దాం… - Tholi Paluku