
పసికూన స్కాట్లాండ్ పై హెట్మయర్ బీభత్సం
వెస్టీండీస్ టీ–20 ప్రపంచకప్ లో విజయంతో టోర్నీని ప్రారంభించారు. షిమ్రోన్ హెట్మయర్ మెరుపు అర్ధశతకం, రోమారియో షెఫర్డ్ అద్భుతమైన బౌలింగ్ (ఐదు వికెట్లు) ప్రదర్శనతో రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన వెస్టిండీస్ జట్టు, టీ20 ప్రపంచకప్‌లో తమ విజయాన్ని నమోదు చేసుకుంది. గ్రూప్–సీ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదే మైదానంలో దశాబ్దం క్రితం రెండో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న వెస్టిండీస్‌కు ఆరంభంలో కాస్త ఇబ్బందులు ఎదురైనా, హెట్మయర్ (36 బంతుల్లో 64; 6 సిక్సులు, 2 ఫోర్లు) ధాటికి జట్టు 182/5 స్కోరు సాధించింది. లక్ష్య చేధనలో స్కాట్లాండ్‌ను గయానాకు చెందిన పేసర్ రోమారియో షెఫర్డ్ దెబ్బతీశాడు. కేవలం 20 పరుగులకే ఐదు వికెట్లు తీసి, స్కాట్లాండ్‌ను 18.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ చేశాడు.
షెఫర్డ్ మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా ముగించాడు. వరుసగా మూడు బంతుల్లో మ్యాథ్యూ క్రాస్, మైఖేల్ లీస్క్, ఒలివర్ డేవిడ్‌సన్ వికెట్లు తీసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. అనంతరం సఫ్యాన్ షరీఫ్‌ను కూడా పెవిలియన్‌కు పంపి తన తొలి ఐదు వికెట్ల ఘనతను నమోదు చేశాడు. ఇది గత నాలుగు నెలల్లో షెఫర్డ్‌కు ఇది రెండో టీ20 అంతర్జాతీయ హ్యాట్రిక్ కావడం విశేషం. నేపాల్ చేతిలో సిరీస్ ఓటమితో నిరాశజనకంగా సిద్ధమైన వెస్టిండీస్‌కు ఈ విజయం ఊరటనిచ్చింది. 2022–23 ఎడిషన్‌లో స్కాట్లాండ్ చేతిలో ఎదురైన అనూహ్య పరాజయానికి ఇది ప్రతీకారంగా నిలిచింది. స్కాట్లాండ్, టోర్నీకి కేవలం రెండు వారాల ముందు బంగ్లాదేశ్ వైదొలగడంతో అవకాశాన్ని దక్కించుకుంది. బౌలింగ్‌లో క్రమశిక్షణ చూపినప్పటికీ, సంసిద్ధంగా లేకపోవడం లక్ష్య చేధనలో స్పష్టంగా కనిపించింది.
కెప్టెన్ రిచీ బెరింగ్టన్ 24 బంతుల్లో 42 పరుగులు (3 ఫోర్లు, 2 సిక్సులు), టామ్ బ్రూస్ 28 బంతుల్లో 35 పరుగులు చేసినప్పటికీ, అవసరమైన రన్‌రేట్ పెరుగుతూ పోయింది. జేసన్ హోల్డర్ స్లోవర్‌తో బెరింగ్టన్‌ను ఔట్ చేయడంతో 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ క్రమంలో హోల్డర్ 100 టీ20 అంతర్జాతీయ వికెట్లు తీసిన తొలి వెస్టిండీస్ బౌలర్‌గా నిలిచాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ పవర్‌ప్లేలో నెమ్మదిగా ఆడింది. 10 ఓవర్లకు 66/2 మాత్రమే చేసిన జట్టు, హెట్మయర్ ధాటికి మధ్య ఓవర్లలో వేగం పెంచింది. 11 నుంచి 15 ఓవర్ల మధ్య 72 పరుగులు సాధించి ఆధిపత్యం సంపాదించింది. హెట్మయర్‌కు రోవ్‌మన్ పావెల్ (14 బంతుల్లో 24) చక్కని సహకారం అందించాడు. ఇద్దరూ కలిసి 37 బంతుల్లో 81 పరుగులు జోడించి మ్యాచ్‌ను పూర్తిగా వెస్టిండీస్ వైపు తిప్పారు.
టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ 3 వికెట్ల విజయం
కొలంబోలో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు బలమైన ఆరంభం ఇచ్చినప్పటికీ, ఇన్నింగ్స్ చివరి దశలో గాడి తప్పింది. పాకిస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా రాణించడంతో నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ 31 బంతుల్లో 47 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. చివర్లో ఫహీమ్ అష్రఫ్ 11 బంతుల్లో అజేయంగా 29 పరుగులు చేసి జట్టును మూడు బంతులు మిగిలి ఉండగానే గెలిపించాడు. నెదర్లాండ్స్ తరఫున పాల్ వాన్ మీకెరెన్ (2/20), ఆర్యన్ దత్ (2/33) అత్యుత్తమ బౌలర్లుగా నిలిచారు.
సంక్షిప్త స్కోర్లు:
నెదర్లాండ్స్: 19.5 ఓవర్లలో 147 ఆలౌట్
(స్కాట్ ఎడ్వర్డ్స్ 37, బాస్ డి లీడ్ 30; సల్మాన్ మీర్జా 3/24, సైమ్ అయూబ్ 2/7, మహ్మద్ నవాజ్ 2/38, అబ్రార్ అహ్మద్ 2/23)
పాకిస్థాన్: 19.3 ఓవర్లలో 148/7
(సాహిబ్‌జాదా ఫర్హాన్ 47, ఫహీమ్ అష్రఫ్ 29 అజేయం; వాన్ మీకెరెన్ 2/20, ఆర్యన్ దత్ 2/33)
