
పశ్చిమ బెంగాల్‌లో ‘సర్’ పై రాజకీయ వివాదం
పశ్చిమ బెంగాల్‌లో అమలు చేస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను వ్యతిరేకిస్తూ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన ఐదుగురు సభ్యుల బృందం రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ (సీఈవో)ను కలిసింది. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
టీఎంసీ ఈ విషయాన్ని తమ అధికారిక ఎక్స్ ద్వారా వెల్లడిస్తూ ఈ విధమైన చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. బెంగాల్‌లో ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను నాశనం చేస్తున్నాయని పేర్కొంది. అలాగే ఎటువంటి భయం లేదా పక్షపాతం లేకుండా చట్టబద్ధమైన విధానాలను అమలు చేయాలి. అర్హులైన ఒక్క ఓటరుని కూడా కుట్రపూరితంగా, అక్రమంగా తొలగించకుండా రక్షించాలి అని రాష్ట్ర ఎన్నికల అధికారిని డిమాండ్ చేసింది. బెంగాల్ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు మేం అప్రమత్తంగా ఉన్నాం. ఎలాంటి శక్తి, ఎలాంటి కుట్ర, బీజేపీ–ఈసీఐ యంత్రాంగం కూడా ప్రజల గొంతును నొక్కలేవు. అలాగే వారి ఓటును తొలగించలేవని స్పష్టం చేసింది.
ఫారం–7 అధికారాల బదిలీ చట్టవిరుద్ధం: మంత్రి చంద్రిమా భట్టాచార్య
ఇదే అంశంపై శనివారం పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రిమా భట్టాచార్య మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం చర్యలను తీవ్రంగా విమర్శించారు. ఆమె వివరిస్తూ ఫారం–7పై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో)కే ఉంటుందని, ఆ అధికారాన్ని తీసేసి డిస్ట్రిక్ట్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ (డీఈవో)కు అప్పగించడం చట్టవిరుద్ధమని అన్నారు. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం తో పాటు ఎన్నికల నియమాలకు కూడా విరుద్ధమని ఆమె ఆరోపించారు. విచారణలు ప్రారంభించినప్పటికీ ఎన్నికల యంత్రాంగం సరైన సంసిద్ధతతో లేదని, ఇది అన్యాయమని వ్యాఖ్యానించారు. అలాగే ఓ ప్రైవేట్ డేటా కన్సల్టెన్సీ సంస్థ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఆ సంస్థకు బీజేపీతో ఏమైనా సంబంధాలున్నాయా? 1–2 కోట్ల మంది ఓటర్లను తొలగించాలనే లక్ష్యంతోనే ఈ సర్వే చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
ఈసీఐపై అభిషేక్ బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు
టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన ఎన్నికల సంఘాన్ని వాట్సాప్ కమిషన్ గా అభివర్ణిస్తూ, బెంగాల్ ప్రజలకు ఈసీఐ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను రాష్ట్ర ప్రజలను వేధించేందుకే చేపట్టారని ఆయన ఆరోపించారు. అలాగే ఈ ప్రక్రియలో చోటుచేసుకున్న ప్రాణ నష్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ 45 మంది మరణించారని, ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, 29 మంది బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) ఆత్మహత్యాయత్నం చేశారని తెలిపారు. మేం ఎన్నికల సంఘాన్ని ఐదు ప్రాథమిక ప్రశ్నలు అడిగాం. ఒక్క ప్రశ్నకూ సమాధానం ఇవ్వలేదు. మీడియాకు సమాధానాలు ఇచ్చామని మాత్రమే చెబుతున్నారు అని అభిషేక్ బెనర్జీ విమర్శించారు.
నేపథ్యం
పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ కింద రూపొందించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా గత వారం విడుదలైంది. ఆ జాబితాలో పెద్ద సంఖ్యలో పేర్లు తొలగించారన్న ఆరోపణలతో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఈ అంశంపై టీఎంసీ–ఎన్నికల సంఘం మధ్య ఘర్షణ మరింత తీవ్రతరమవుతోంది.
