
పశ్చిమ బెంగాల్‌లో రైలు బోగీ దగ్ధం
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పూర్బ బర్ధమాన్ జిల్లాలోని కట్వా రైల్వే స్టేషన్ వద్ద నిలిపివుంచిన ఖాళీ ప్రయాణికుల రైలులో ఒక బోగీలో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తూర్పు రైల్వే అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం సుమారు 4.30 గంటల సమయంలో ప్లాట్‌ఫామ్ నంబర్ 2పై నిలిచివున్న కట్వా–అజిమ్‌గంజ్ ప్యాసింజర్ రైలులోని ఒక కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది. రెండు ఫైర్ టెండర్ల సాయంతో సుమారు 30 నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చారు.
మంటలు పక్క బోగీలకు వ్యాపించకుండా రైల్వే సిబ్బంది వెంటనే మంటలంటుకున్న బోగీని వేరుచేశారు. హౌరా డివిజన్ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టనుండగా, ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించనుంది. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం దర్యాప్తు అనంతరం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు. మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు. బోగీ అంతర్భాగం తీవ్రంగా దెబ్బతింది. సీట్లు పూర్తిగా కాలిపోయి ఇనుప ఫ్రేమ్‌లు మాత్రమే మిగిలాయి. బయటి భాగంలో కూడా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. హౌరా డివిజనల్ రైల్వే మేనేజర్ విశాల్ కపూర్ సంఘటనా స్థలాన్ని సందర్శించి దెబ్బతిన్న బోగీని పరిశీలించారు.
కేంద్రానిది ప్రచారం మాత్రమే
ఇదిలా ఉండగా, అధికార పార్టీ టీఎంసీ ఈ ఘటనపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పించింది. రైల్వే భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఇది ‘రెండు భారతాల’కు ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం వందే భారత్ రైళ్లు, హైస్పీడ్ కారిడార్లను ప్రచార హంగులతో ప్రారంభిస్తున్నప్పటికీ, సాధారణ ప్రయాణికుల భద్రతపై తగిన దృష్టి లేదని విమర్శించింది. అలాగే, బాలాసోర్ రైలు ప్రమాదం తర్వాత వ్యవస్థాగత సంస్కరణలు ఆశించినప్పటికీ, అవి కనిపించలేదని వ్యాఖ్యానించింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పై కూడా పరోక్షంగా విమర్శలు చేసింది.
