Let's talk: editor@tmv.in
పశ్చిమ బెంగాల్లో కచ్చితంగా విజయం సాధిస్తాం: అమిత్ షా

పశ్చిమ బెంగాల్లో కచ్చితంగా విజయం సాధిస్తాం: అమిత్ షా

Pinjari Chand
27 ఫిబ్రవరి, 2026

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క చొరబాటుదారుని వెళ్లగొడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. గురువారం బీహార్‌లోని అరారియా జిల్లాలో ఎస్ఎస్బీ కు చెందిన రూ.175 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న చొరబాటుదారులను దేశం నుంచి బయటకు పంపించడం బీజేపీ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని ఆయన స్పష్టం చేశారు. వారు జాతీయ భద్రతకు ముప్పు మాత్రమే కాదు, ప్రజలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాల ప్రయోజనాలను కూడా దుర్వినియోగం చేస్తున్నారు. చొరబాటు పెరగడం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో ఆక్రమణలు, జనాభా నిర్మాణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది ప్రాంత సంస్కృతి, భౌగోళిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. జనాభా మార్పులపై అధ్యయనం చేసి, అత్యంత ప్రభావిత ప్రాంతాలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం హై-పవర్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ సమస్యతో తీవ్రంగా ప్రభావితమయ్యాయని చెప్పారు.

త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగిందని గుర్తు చేశారు. సీమాంచల్ ప్రాంతం నుంచే చొరబాటుదారులపై చర్యలు ప్రారంభిస్తాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ అంశాన్నే ప్రాధాన్యంగా తీసుకుని పోటీ చేశాం. ప్రజలు మాకు భారీ మద్దతును ఇచ్చారు. వచ్చే ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క చొరబాటుదారుని దేశం నుంచి వెళ్లగొడతామని హామీ ఇచ్చారు.

ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలి

సరిహద్దు భద్రతలో ఎస్ఎస్బీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, పొరస్ బోర్డర్ల వద్ద ప్రత్యేక విధానాలు అవసరమని అన్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలతో భద్రతా సిబ్బంది సత్సంబంధాలు కొనసాగించాలని సూచించారు. ఇది అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టడంలో ఉపయోగపడుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జవాన్ల సంక్షేమానికి కట్టుబడి ఉందని, సీఏపీఎఫ్, ఆవాస్ యోజన, ఆయుష్మాన్ ఆరోగ్య బీమా, విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌లు వంటి పథకాలు అమల్లో ఉన్నాయని తెలిపారు. ప్రసంగ ప్రారంభంలో స్వాతంత్ర్య సమరయోధుడు, హిందుత్వ భావజాల నేత వీడీ.సావర్కర్ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించారు. వీర సావర్కర్ ధైర్యవంతుడే కాకుండా గొప్ప రచయిత కూడా. 1857 తిరుగుబాటును తొలి స్వాతంత్ర్య సమరంగా ప్రజలు చూడటానికి ఆయన రచనలు కారణమయ్యాయని కొనియాడారు.