Let's talk: editor@tmv.in
పశ్చిమ బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు: సీఎం మమతాబెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు: సీఎం మమతాబెనర్జీ

Pinjari Chand
5 ఫిబ్రవరి, 2026

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సుప్రీంకోర్టులో స్వయంగా హాజరై వాదనలు వినిపించడం రాజకీయ–న్యాయ రంగాల్లో అరుదైన, చారిత్రాత్మక పరిణామంగా మారింది. ఈ సందర్భంగా ఆమె, ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్ఐఆర్) ప్రక్రియ పశ్చిమ బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకుని, అసలైన ఓటర్లను తొలగించేందుకే ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించిన మమతా బెనర్జీ, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్లను చేర్చడం కోసం కాకుండా, కేవలం తొలగింపుల కోసమే నడుస్తోందని తెలిపారు. తార్కిక లోపాలు పేరిట లక్షలాది మంది ఓటర్లను అన్యాయంగా తొలగించారని ఆమె ఆరోపించారు. మమతా బెనర్జీ తరఫున సీనియర్ అడ్వకేట్ శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తూ, కొంతమంది ఓటర్ల వివరాల్లో తేడాలు గుర్తించడానికి గల కారణాలను వెల్లడించకపోవడం, చెల్లుబాటు అయ్యే పత్రాలను తిరస్కరించడం వంటి విధివిధాన లోపాలు ఎన్నికల సంఘం వైపు నుంచి జరిగాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఇప్పటికే సుమారు 58 లక్షల మంది ఓటర్లను తొలగించారని, మరో 88 లక్షల మంది ఓటర్లను ‘లోపాలున్నవారిగా’ గుర్తించారని, ఇంకా దాదాపు మూడు లక్షల అభ్యంతరాలు పెండింగ్‌లో ఉన్నాయని, ఓటర్ల జాబితా తుది ప్రచురణకు కేవలం 11 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆమె న్యాయవాది తెలిపారు. భాషా, సాంస్కృతిక వాస్తవాలను విస్మరిస్తున్నారని పేర్కొంటూ, బెంగాల్‌లో సాధారణంగా కనిపించే దత్త–దత్తా, రాయ్–రే, గంగూలీ–గంగూలి వంటి ఇంటిపేర్ల తేడాలను కూడా తప్పులుగా పరిగణిస్తున్నారని మమతా బెనర్జీ అన్నారు. ఇవి స్పెల్లింగ్ తప్పులు కావు. ఇవి స్థానిక భాషా తేడాలు. ఇవి దేశమంతటా కనిపిస్తాయని ఆమె స్పష్టం చేశారు. వివాహానంతరం మహిళలు భర్త ఇంటిపేరును ఉపయోగించడం సాధారణ విషయమని, ఆ కారణంతోనే వారి పేర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఒక కుమార్తె పెళ్లయ్యాక అత్తింటికి వెళ్లి భర్త ఇంటిపేరును వాడుతుంది. అది ఓటరు జాబితా నుంచి పేరు తొలగించడానికి కారణమా? అని ప్రశ్నించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణ సమయాన్ని కూడా ఆమె ప్రశ్నించారు. పండుగలు, పంటల కాలంలో అనేక మంది ఓటర్లు ఊళ్లకు దూరంగా ఉండే సమయంలో ఈ ప్రక్రియ చేపట్టడానికి కారణమేంటని ఆమె నిలదీశారు. ఇంత హడావుడి ఎందుకు? ఎందుకు పశ్చిమ బెంగాల్ మాత్రమే? అస్సాం ఎందుకు కాదు? అంటూ, బీజేపీ పాలనలో లేని రాష్ట్రాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.

అసలైన ఓటర్లకు రక్షణ కల్పిస్తాం

ఈ అంశంపై స్పందించిన సుప్రీంకోర్టు, అసలైన ఓటర్లకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఏ ఒక్క అర్హుడైన పౌరుడూ ఓటర్ల జాబితా నుంచి తప్పించకుండా మేము చూసుకుంటామని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. చిన్నపాటి స్పెల్లింగ్ లేదా భాషా తేడాలు ఓటరు తొలగింపుకు కారణం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే చనిపోయినవారు లేదా చట్టపరంగా అనర్హులైనవారి పేర్లు మాత్రం తొలగించాల్సిందేనని పేర్కొంది. ఆధార్ కార్డుల స్వీకరణ అంశంపై మమతా బెనర్జీ ప్రస్తావించగా, ఆ విషయం కోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉన్నందున తాము వ్యాఖ్యానించలేమని ధర్మాసనం తెలిపింది. ఆధార్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ అంశంపై తీర్పు నిలిపివేశామని చీఫ్ జస్టిస్ తెలిపారు.

సమయం కావాలి

ఎన్నికల సంఘం తరఫున సీనియర్ అడ్వకేట్ రాకేష్ ద్వివేది వాదిస్తూ, ఎస్ఐఆర్ సమయంలో జారీ చేసిన నోటీసుల్లోనే లోపాల కారణాలు పేర్కొన్నామని తెలిపారు. విచారణ సమయంలో లేవనెత్తిన కొత్త అభ్యంతరాలు తమకు అందలేదని, వాటిని పరిశీలించడానికి సమయం కావాలని ఆయన కోర్టును కోరారు. రాష్ట్ర కార్యాలయాలను ఈ ప్రక్రియలో పాల్గొననివ్వడం లేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూర్చున్న మైక్రో-ఆబ్జర్వర్లను నియమించి, కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతోనే మైక్రో-ఆబ్జర్వర్లను నియమించాల్సి వచ్చిందని ద్వివేది సమాధానం ఇచ్చారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) తదితర సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసినా, కేవలం 80 మంది అధికారులనే ఇచ్చారని తెలిపారు.

అన్ని వాదనలు నమోదు చేసిన సుప్రీంకోర్టు, మమతా బెనర్జీ పిటిషన్‌పై ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తాజా అభ్యంతరాలను పరిశీలించేందుకు సమయం ఇస్తూ, ఈ కేసును వచ్చే సోమవారం మళ్లీ విచారిస్తామని తెలిపింది. ఈ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఓబ్రియన్ సహా పలువురు పిటిషనర్లు ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విధివిధాన లోపాలపై గతంలోనే కోర్టు ఎన్నికల సంఘానికి పలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ స్వయంగా కోర్టుకు హాజరై వాదనలు వినిపించారు.

సుప్రీం సీఎం వాదన.. రాజకీయంగా ప్రభావమెంత?

పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా సవరణ అంశంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా సుప్రీం కోర్టులో వాదించడం దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. ఇది కేవలం ఒక న్యాయపోరాటం కాకుండా, ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, రాబోయే ఎన్నికలతో నేరుగా ముడిపడిన రాజకీయ సంకేతంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

పదవి కోసం కాదు..

మమతా బెనర్జీ ఈ వ్యవహారంలో వ్యక్తిగత ప్రయోజనం కోసం గానీ, తన పదవిని కాపాడుకోవడం కోసం గానీ కోర్టుకు వెళ్లలేదని ఆమె వాదన స్పష్టం చేస్తోంది. ఓటర్లను తొలగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారనే కథనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఆమె లక్ష్యంగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అంశం కేవలం న్యాయపరమైనది కాకుండా, రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపే అంశమని పేర్కొంటున్నారు. అందుకే ఇది ఒకేసారి న్యాయపోరాటం, రాజకీయ పోరాటంగా మారింది.

కేంద్రం–రాష్ట్రాల మధ్య ఫెడరలిజం అంశం

ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ ప్రభావంలో పనిచేస్తోందన్న ఆరోపణలతో మమతా కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా బీజేపీని నేరుగా ప్రశ్నించారు. స్వతంత్ర సంస్థల తటస్థతపై సందేహాలు వ్యక్తం చేస్తూ, ఇది రాష్ట్ర హక్కుల కోసం పోరాటంగా మారిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ప్రతిపక్షాలకు కొత్త ‘మోడల్’

ఇప్పటివరకు ప్రతిపక్షాలు తమ నిరసనలను ప్రెస్‌మీట్లు, రోడ్ ప్రొటెస్టులు, సోషల్ మీడియా వరకు పరిమితం చేశాయి. అయితే, మమతా బెనర్జీ నేరుగా సుప్రీం కోర్టు వేదికను ఎంచుకోవడం ప్రతిపక్షాలకు ఒక కొత్త మార్గాన్ని చూపినట్టయింది. భవిష్యత్తులో ఇతర సీఎంలు, ప్రతిపక్ష నేతలు కూడా ఇలాంటి అంశాల్లో న్యాయపోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశముందని విశ్లేషణ.

సీఎం స్వయంగా వాదించడంవల్ల ప్రభావం

సాధారణంగా న్యాయవాదులే కోర్టులో వాదిస్తారు. కానీ ప్రజలచే ఎన్నికైన ముఖ్యమంత్రి స్వయంగా కోర్టులో మాట్లాడటం వల్ల, ఈ అంశం ప్రజాస్వామ్యానికి సంబంధించిన గంభీరమైన విషయం అన్న సందేశం న్యాయస్థానానికి, ప్రజలకు వెళ్లింది. కోర్టు పక్షపాతం చూపకపోయినా, అంశ ప్రాముఖ్యతను మరింత లోతుగా పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఏర్పడిందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. సీఎం హాజరుతో ఈ కేసు మీడియా హెడ్‌లైన్స్‌గా, ప్రైమ్‌టైమ్ చర్చలుగా మారాయి. ఫలితంగా ఎన్నికల సంఘం, ఓటర్ల తొలగింపు వంటి అంశాలు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చాయి.

కోర్టు వ్యాఖ్యలకు రాజకీయ బలం

ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఏ నిరపరాధ ఓటర్ కూడా బయటకు పోవద్దని చేసిన వ్యాఖ్య రాజకీయంగా బలమైన వాక్యంగా మారింది. ఇది కేవలం న్యాయ వ్యాఖ్య మాత్రమే కాకుండా, భవిష్యత్తులో రాజకీయ ప్రచారంలో ఉపయోగించే అంశంగా మారే అవకాశముంది. దీంతో మమతా బెనర్జీ సుప్రీం కోర్టులో చేసిన వాదన ఒక న్యాయచర్యకే పరిమితం కాకుండా, ఒక రాజకీయ సంకేతంగా, ఫెడరల్ పోరాటంగా, ప్రజాస్వామ్య రక్షణ నినాదంగా మారింది. సుప్రీం కోర్టు వేదికను ఎన్నికల రాజకీయాలు, జాతీయ చర్చకు కేంద్రంగా మార్చిన అరుదైన ఘటనగా దీనిని రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.