
పశ్చిమ గోదావరి తీరంలో నలభై తొమ్మిది తాబేళ్లు మృతి
పశ్చిమ గోదావరి జిల్లా సముద్ర తీరంలో తాబేళ్ల వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 49 చనిపోయిన తాబేళ్లు తీరానికి కొట్టుకువచ్చాయి. కాగా బుధవారం మూడు క్వింటాళ్ల బరువున్న డాల్ఫిన్ కళేబరం కూడా ఒడ్డుకు కొట్టుకొచ్చింది.
మోగల్తూరు నుంచి నరసాపురం వరకు సముద్ర తీరమంతా తాబేళ్ల మృతదేహాలు కనిపిస్తున్నాయి. తొలుత సహజ కారణాలతో చనిపోయి ఉండవచ్చని భావించిన స్థానికులు, సంఖ్య పెరుగుతుండటంతో వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అటవీ, మత్స్యశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కొన్నింటిని నమూనాలుగా సేకరించి ప్రయోగశాలలకు పంపించారు.
సాధారణంగా తాబేళ్లు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి సముద్ర ఉపరితలంపైకి వచ్చి గాలి పీల్చుకుంటాయి. అయితే నిబంధనలను అతిక్రమించి తీరానికి అతి సమీపంలో వలలు వేయడంతో, ఆహారం కోసం వచ్చే తాబేళ్లు వాటిలో చిక్కుకుపోతున్నాయి. జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) ఎఫ్.ఎ. కిరణ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వలల నుంచి బయటపడలేక నీటిలోనే ఉండిపోవడంతో అవి ఊపిరాడక మరణిస్తున్నాయి. మృతి చెందిన తాబేళ్లకు నిర్వహించిన పోస్ట్‌మార్టంలో కళ్లు బయటకు రావడం, మెడ వాపు వంటి లక్షణాలు కనిపించాయని, ఇవి నీటిలో మునిగి చనిపోయినప్పుడు కనిపించే లక్షణాలేనని విద్యాపరిష్యాల్లో తేలినట్టు ఆయన పేర్కొన్నారు.
అదేవిదంగా జనవరి–ఫిబ్రవరి కాలం తాబేళ్ల గుడ్ల పెట్టే సీజన్ కావడంతో ఈ సమయంలో భారీగా మృతి చెందడం పలు అనుమానాలకు దారితీస్తోంది. కలుషిత జలాల ప్రభావమా? అంశంపై విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా గతంలో ఇలాంటి ఘటనల నేపథ్యంలో పీఎం లంక వద్ద తాబేళ్ల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసి, గుడ్లు పొదిగే వరకు సంరక్షించి సముద్రంలో విడిచిపెట్టే కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం ఆ కేంద్రం కార్యాచరణలో లేకపోవడం గమనార్హం.
మరోవైపు సముద్రంలో వేటపై నిఘా పెట్టాల్సిన మెరైన్ పోలీసుల వ్యవస్థ జిల్లాలో నామమాత్రంగానే ఉంది. మెరైన్ పోలీసుల ప్రధాన కేంద్రం కోనసీమలో ఉండటంతో వారు ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. అదేవిధంగా జిల్లా అటవీ శాఖ వద్ద పర్యవేక్షణకు కేవలం ఒకే ఒక యాంత్రిక పడవ అందుబాటులో ఉండటం గమనార్హం. దీనికి తోడు సముద్రంలో వదిలివేసిన పాత వలలు మూగజీవాలకు ప్రాణసంకటంగా మారుతున్నాయి.
