Let's talk: editor@tmv.in
పశ్చిమ గుంటూరు అభివృద్ధికి రూ.406 కోట్లు :ఎమ్మెల్యే గళ్ళా మాధవి

పశ్చిమ గుంటూరు అభివృద్ధికి రూ.406 కోట్లు :ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Panthagani Anusha
7 ఏప్రిల్, 2026

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సుమారు రూ.406 కోట్ల నిధులతో భారీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి వెల్లడించారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ ప్రగతిపై తనకున్న స్పష్టమైన విజన్‌ను వివరించారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని అందులో భాగంగానే పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.

గత పాలకుల నిర్ణయాల వల్ల గుంటూరు కార్పొరేషన్‌కు చెందిన సుమారు రూ.500 కోట్ల నిధులు సి.ఎఫ్.ఎమ్.ఎస్‌కు మళ్లించరాని దీనివల్ల ప్రస్తుతం కేవలం రూ.100 కోట్లతోనే జీతాలు, బకాయిలు అత్యవసర మౌలిక వసతుల పనులు చేపట్టాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో నిధుల కొరతను అధిగమించి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

కాగా నియోజకవర్గ పరిధిలో ఐదు కీలక ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా గుర్తించి వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా పీకల వాగు ప్రక్షాళన, రిటైనింగ్ వాల్ నిర్మాణం డైమండ్ మెష్ ఏర్పాటు కోసం రూ.145 కోట్లు, అంబేడ్కర్ వాగు అభివృద్ధి, రూ.30 కోట్లతో పి.వి.కె నాయుడు మార్కెట్ ఆధునీకరణ, రూ.18 కోట్లతో మూడు అంతస్తుల అంబేడ్కర్ భవనం మరియు రూ.10 కోట్లతో బీసీ భవన్ నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఈ ఐదు ప్రధాన ప్రాజెక్టుల్లో కనీసం రెండు ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు లభించి ఈ ఏడాదిలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

అనంతరం నియోజకవర్గ కూటమి నేతలు కార్యకర్తలు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ వివరాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని గళ్ళా మాధవి సూచించారు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వంటి ప్రాథమిక అవసరాల విషయంలో ఎక్కడా రాజీ పడబోమని అవసరమైతే అదనపు నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని పేర్కొన్నారు. పారదర్శక పాలనతో పశ్చిమ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆమె పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో మున్సిపల్ అడిషనల్ కమిషనర్ చల్లా ఓబులేసు కూడా పాల్గొని శాఖల వారీ నిధుల వ్యయంపై వివరణ ఇచ్చారు.