Let's talk: editor@tmv.in
పశ్చిమాసియా సంక్షోభాన్ని కోవిడ్‌లా అధిగమిస్తాం: ప్రధాని మోడీ

పశ్చిమాసియా సంక్షోభాన్ని కోవిడ్‌లా అధిగమిస్తాం: ప్రధాని మోడీ

Pinjari Chand
24 మార్చి, 2026

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంతో ఏర్పడిన క్లిష్ట గ్లోబల్ పరిస్థితులు మరింత కాలం కొనసాగవచ్చని, దేశం సిద్ధంగా ఉండి ఐక్యంగా ముందుకు సాగాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశం ఎలా ఐక్యంగా నిలిచిందో, అదే విధంగా ఈ సంక్షోభాన్ని కూడా అలాగే ఎదుర్కొంటామని చెప్పారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ ఇంధనం, ఎరువులు, జాతీయ భద్రతతో పాటు పశ్చిమాసియా దేశాల్లో ఉన్న భారతీయులపై ఈ సంక్షోభం ప్రభావం గురించి వివరించారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు తక్కువగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. శాంతి, మానవత్వంపై భారత్‌కు ఉన్న కట్టుబాటును పునరుద్ఘాటించిన ప్రధాని, సమస్య పరిష్కారానికి చర్చలు, దౌత్యమే ఏకైక మార్గం అని స్పష్టం చేశారు. యుద్ధ విరమణ, ఉద్రిక్తతల తగ్గింపునకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. పశ్చిమాసియా నేతలతో ఇప్పటికే చర్చలు జరిపి, ఉద్రిక్తతలు తగ్గించాలని కోరినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ సముద్ర మార్గాలు, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ ఇంధనంలో సుమారు 20 శాతం రవాణా జరుగుతుందని, అలాంటి మార్గాలను అడ్డుకోవడం పూర్తిగా అంగీకారయోగ్యం కాదన్నారు. ఈ యుద్ధంలో ప్రాణనష్టం మానవత్వానికి విరుద్ధమని, అన్ని పక్షాలు త్వరగా శాంతి పరిష్కారానికి రావాలని భారత్ కోరుతోందని తెలిపారు.

భద్రతా చర్యలు కట్టుదిట్టం

ఈ పరిస్థితులను కొందరు దుర్వినియోగం చేసుకునే అవకాశముందని హెచ్చరించిన ప్రధాని, దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలను అలర్ట్‌లో ఉంచినట్లు తెలిపారు. తీరప్రాంతం, సరిహద్దులు, సైబర్ రంగం, వ్యూహాత్మక సంస్థల భద్రతను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. అసత్య ప్రచారం, బ్లాక్ మార్కెటింగ్, నిల్వ దందాలు వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.

ఇంధన భద్రతకు ముందస్తు చర్యలు

గత దశాబ్దంలో ఇంధన దిగుమతులను 27 దేశాల నుంచి 41 దేశాలకు విస్తరించడం వల్ల ఒక్క ప్రాంతంపై ఆధారపడకుండా ఉండగలిగామని ప్రధాని తెలిపారు. దేశంలో ప్రస్తుతం 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయని, అదనంగా 6.5 మిలియన్ టన్నుల నిల్వల కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత 11 ఏళ్లలో రిఫైనింగ్ సామర్థ్యం పెరిగిందని, వివిధ దేశాల సరఫరాదారులతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.

భారతీయుల తరలింపు, భద్రత

యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు 3.75 లక్షల మంది భారతీయులను సురక్షితంగా దేశానికి తీసుకువచ్చామని చెప్పారు. ఇందులో ఇరాన్ నుంచే సుమారు 1,000 మంది, అందులో 700 మందికి పైగా మెడికల్ విద్యార్థులు ఉన్నారని వివరించారు.

వ్యవసాయం, విద్యుత్‌పై ప్రభావం లేదు

వ్యవసాయ రంగంపై ప్రభావం ఉంటుందనే ఆందోళనలపై స్పందిస్తూ, దేశంలో తగినంత ఆహార ధాన్య నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఖరీఫ్ పంటల కోసం ఎరువుల సరఫరాకు కూడా సరిపడా ఏర్పాట్లు చేశామని చెప్పారు. గతంలో కూడా గ్లోబల్ సంక్షోభాల భారం రైతులపై పడనివ్వలేదు. గత దశాబ్దంలో ఆరు యూరియా ప్లాంట్లు ప్రారంభించి, 76 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచామని చెప్పారు. వేసవి కాలం కావడంతో విద్యుత్ డిమాండ్ పెరిగినా, దేశంలోని విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. వరుసగా రెండో ఏడాది 1 బిలియన్ టన్నులకుపైగా బొగ్గు ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించామని పేర్కొన్నారు.

ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఎథనాల్ మిశ్రమ ఇంధనం, రైల్వే విద్యుదీకరణ వంటి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎథనాల్ మిశ్రమంతో ప్రతి ఏడాది సుమారు 4.5 కోట్ల బ్యారెళ్ల చమురు దిగుమతిని ఆదా చేస్తున్నాం. రైల్వే విద్యుదీకరణ వల్ల మరో 180 కోట్ల లీటర్ల డీజిల్ అవసరం తగ్గిందని వివరించారు. మెట్రో రైల్వే నెట్‌వర్క్ కూడా గణనీయంగా విస్తరించిందని తెలిపారు. 2014లో 250 కిలోమీటర్లలోపు ఉన్న మెట్రో మార్గం, ప్రస్తుతం 1,100 కిలోమీటర్లకు పైగా పెరిగిందని చెప్పారు.

సమిష్టి శక్తితో ఎదుర్కొంటాం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్న ప్రధాని, తక్షణ, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేస్తే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొగలుగుతాం.ఇదే మన బలమని ప్రధాని అన్నారు.

అమెరికా–ఇజ్రాయెల్ దాడులను ఖండించలేదు.. ‘డైలాగ్‌బాజీ’ మాత్రమే: కాంగ్రెస్

పశ్చిమాసియా సంక్షోభంపై లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అమెరికా–ఇజ్రాయెల్ దాడులను ఖండించే ఒక్క మాట కూడా చెప్పలేదని ఆరోపించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ మాట్లాడుతూ ప్రధాని ప్రసంగాన్ని ‘స్వీయ ప్రశంసలు, భయపడ్డ ధోరణి, రాజకీయ డైలాగ్‌బాజీకి ఉదాహరణగా అభివర్ణించారు. ఇరాన్‌పై జరుగుతున్న అమెరికా–ఇజ్రాయెల్ వైమానిక దాడులను ప్రధాని ఖండించకపోవడం గమనార్హమని ఆయన అన్నారు. గల్ఫ్ దేశాలు, హర్ముజ్‌పై ఇరాన్ దాడులు తప్పే అయినప్పటికీ, ఇరాన్‌పై జరుగుతున్న నిరంతర బాంబు దాడులను కూడా సమర్థించలేమని పేర్కొన్నారు.ప్రధాని తన ప్రసంగంలో కోవిడ్-19 పరిస్థితులను ప్రస్తావించడం పట్ల కూడా కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సమయంలో ప్రభుత్వ వైఖరి ‘విపరీతంగా విఫలమైందని విమర్శించారు. లాక్‌డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులు నడుచుకుంటూ స్వగ్రామాలకు వెళ్లిన దృశ్యాలు, ఆక్సిజన్ కొరతతో మరణాలు వంటి ఘటనలను దేశం మరచిపోలేదని అన్నారు.

పార్లమెంట్‌లో చర్చ జరపాలని డిమాండ్

పశ్చిమాసియా పరిస్థితిపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అన్ని పక్షాల అభిప్రాయాలు వినిపించేందుకు ఇది అవసరమని తెలిపింది. కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ మాట్లాడుతూ, ప్రధాని ప్రసంగంలో కొత్తగా ఏమీ లేదని, దేశ పరిస్థితిని మాత్రమే వివరించారని అన్నారు. మేము ఇచ్చిన నోటీసు ప్రకారం పార్లమెంట్‌లో చర్చ జరగాలని పేర్కొన్నారు.

పశ్చిమాసియా సంక్షోభాన్ని కోవిడ్‌లా అధిగమిస్తాం: ప్రధాని మోడీ - Tholi Paluku