Let's talk: editor@tmv.in
పశ్చిమాసియా సంక్షోభంపై చర్చించాలి: మల్లికార్జున్‌ ఖర్గే

పశ్చిమాసియా సంక్షోభంపై చర్చించాలి: మల్లికార్జున్‌ ఖర్గే

Pinjari Chand
2 ఏప్రిల్, 2026

పశ్చిమాసియా సంక్షోభంపై రాజ్యసభలో బుధవారం ప్రభుత్వం–ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రతిపక్షాలు ఈ అంశంపై పార్లమెంటులో చర్చకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయగా, ప్రభుత్వం దీనిపై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌రిజిజు మాట్లాడుతూ, దేశం ఐక్యంగా ఉండాల్సిన సమయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. పశ్చిమాసియా పరిస్థితిపై ఇప్పటికే ప్రభుత్వం వివరణ ఇచ్చిందని, అయినప్పటికీ ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని ఉపయోగిస్తున్నాయని అన్నారు. ఇదే సమయంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా విమర్శించారు. పశ్చిమాసియా సంక్షోభంపై చర్చ జరపాలని తాను రెండు సార్లు లేఖ రాసినా సమయం కేటాయించలేదని తెలిపారు. ఎల్పీజీ, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడుతుండగా పార్లమెంటులో చర్చ ఎందుకు జరపకూడదని ప్రశ్నించారు.

అఖిలపక్ష సమావేశానికి ప్రధాని ఎందుకు హాజరుకాలేదు?

ఆల్‌పార్టీ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరు కాలేదని ఖర్గే విమర్శించారు. మంత్రులు అధికారాలు లేని డమ్మీ మంత్రులుగా వ్యవహరిస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన రిజిజు, ప్రతిపక్ష నాయకుడు తన పదవికి తగిన గౌరవాన్ని పాటించడం లేదని ఆరోపించారు. ఆల్‌పార్టీ సమావేశానికి ప్రతిపక్ష నాయకులు హాజరు కాలేదని రిజిజు పేర్కొన్నారు. ప్రభుత్వం చర్చ నుంచి పారిపోవడం లేదని, సంబంధిత మంత్రులు ఇప్పటికే రెండు సభల్లో వివరాలు ఇచ్చారని తెలిపారు. పశ్చిమాసియా పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయని, అయినప్పటికీ భారత్‌లో ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని రిజిజు తెలిపారు. ఎక్సైజ్‌ సుంకాలను తగ్గించి పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటున్నప్పటికీ ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

దీనికి ప్రతిస్పందించిన ఖర్గే, ప్రభుత్వం ప్రతిపక్షాల సూచనలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. సభలో చర్చకు సమయం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. చివరకు ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభిస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. సభాపతి సీపీ. రాధాకృష్ణన్‌ సభను సాయంత్రం వరకు కొనసాగించి ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తి చేయాలని సూచించారు. ఆ రోజు సభలో సీఏపీఎఫ్‌ బిల్లు 2026తో పాటు దివాళా, అప్పుల పరిష్కార చట్టంలో మార్పులు చేసే బిల్లు, 2026పై కూడా చర్చ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.