
పశ్చిమాసియా యుద్ధం సవాల్… రాజకీయాలకు తావులేదు: ప్రధాని మోడీ
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా దేశం ఎదుర్కొంటున్న పరిస్థితి సవాలుతో కూడుకున్నదని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఈ సంక్షోభాన్ని అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రస్తుతం దేశ ప్రయోజనాలకు సంబంధించిన కీలక సమయం అని, ఈ పరిస్థితిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవద్దని హెచ్చరించారు. స్వార్థ రాజకీయాలకు ఇక్కడ స్థానం లేదని స్పష్టం చేశారు. అపోహలు వ్యాప్తి చేయడం దేశానికి హానికరమని పేర్కొన్న మోడీ, ప్రజలు అపోహలకు లోనుకాకుండా ప్రభుత్వం అందిస్తున్న సమాచారాన్నే నమ్మాలని సూచించారు. గతంలో ఎదురైన సంక్షోభాలను దేశం ఏకతాటిపై నిలబడి అధిగమించినట్లే, ఈ సారి కూడా విజయవంతంగా బయటపడతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న కోట్లాది భారతీయుల గురించి ప్రస్తావిస్తూ, వారికి సహాయం అందిస్తున్న ఆయా దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమాసియా ప్రాంతం భారత్‌కు ముఖ్యమైన ఇంధన వనరు కావడంతో, ఈ యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై పడుతోందని చెప్పారు. ఇటీవల నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, కరోనా తర్వాత ప్రపంచం సాధారణ స్థితికి వస్తుందని భావించినప్పటికీ, యుద్ధాలు మళ్లీ పరిస్థితిని క్లిష్టతరం చేశాయని వ్యాఖ్యానించారు.
జల సంరక్షణ, సౌర శక్తిపై దృష్టి
దేశంలో జల సంరక్షణపై కూడా మోడీ దృష్టి సారించారు. గత 11 సంవత్సరాల్లో లక్షల సంఖ్యలో నీటి సంరక్షణ నిర్మాణాలు, వేల సంఖ్యలో సరస్సులు ఏర్పాటయ్యాయని తెలిపారు. గ్రామస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో నీటి సమస్యకు పరిష్కారాలు కనిపిస్తున్నాయని చెప్పారు. అలాగే ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోందని, సౌరశక్తి వినియోగం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తోందని అన్నారు.
సాంప్రదాయం–ఆధునికత కలయిక
నాగాలాండ్‌లోని మోరుంగ్ విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ, సాంప్రదాయ జ్ఞానం ద్వారా పిల్లల్లో విజ్ఞానంపై ఆసక్తి పెంచుతున్నారని తెలిపారు. సంప్రదాయాలను కాపాడుకుంటూనే ఆధునికత వైపు ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. కర్ణాటకలో చేపల పెంపకంలో విజయం సాధించిన రైతును ఉదాహరణగా చూపిస్తూ, వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలు రైతుల ఆదాయాన్ని పెంచగలవని మోడీ అన్నారు. యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
