Let's talk: editor@tmv.in
పశ్చిమాసియా యుద్ధం ప్రభావం…5,500కు పైగా విమానాలు రద్దు

పశ్చిమాసియా యుద్ధం ప్రభావం…5,500కు పైగా విమానాలు రద్దు

Panthagani Anusha
17 మార్చి, 2026

పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న భద్రతా పరమైన ఉద్రిక్తతలు అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ సంక్షోభం కారణంగా భారతీయ, విదేశీ విమానయాన సంస్థలు భారీ సంఖ్యలో సర్వీసులను రద్దు చేసినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ఆరో రోజున లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు భారతీయ విమానయాన సంస్థలు 4,335 సర్వీసులను రద్దు చేయగా వివిధ విదేశీ విమానయాన సంస్థలు మరో 1,187 విమానాలను నిలిపివేశాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్న కొన్ని ప్రాంతాల్లో ఎయిర్‌స్పేస్ (గగనతలం) పూర్తిగా మూసివేయడం వల్ల విమానాలను నడపడం అసాధ్యంగా మారిందని ఆయన వివరించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రయాణికుల భద్రతే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

కాగా ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ పశ్చిమ ఆసియా ప్రాంతం నుంచి సుమారు 2,19,780 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు మంత్రి తెలిపారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డీజీసీఏ) అధికారులు నిరంతరం ఆయా దేశాల సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. గగనతలంపై ఆంక్షలు తొలగి పరిస్థితులు చక్కబడిన తర్వాతే విమాన సేవలు సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా విమానాల రద్దు నేపథ్యంలో డిమాండ్ పెరిగి టికెట్ ధరలు సామాన్యులకు భారం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమాన సంస్థలు వసూలు చేసే ఛార్జీలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆపరేషనల్ మార్పులు చేయాలని విమానయాన సంస్థలకు సూచించినట్లు వెల్లడించారు. ప్రయాణికులు తమ విమాన ప్రయాణ షెడ్యూల్‌ల గురించి తాజా సమాచారం కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్ సంస్థలతో సంప్రదింపులు జరపాలని అధికారులు కోరారు.