
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్.. 10 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు
పశ్చిమాసియా దేశాల మధ్య నెలకొన్న భీకర యుద్ధ వాతావరణం అంతర్జాతీయ విమాన ప్రయాణాలను అస్తవ్యస్తం చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ కూటమికి, ఇరాన్‌కు మధ్య మొదలైన పరస్పర దాడుల ప్రభావం భారతీయ విమానయాన సంస్థలపై తీవ్రంగా పడింది. గగనతల ఆంక్షలు, భద్రతా కారణాల దృష్ట్యా ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు భారతీయ విమాన సంస్థలు సుమారు 10,000కు పైగా సర్వీసులను రద్దు చేసుకున్నాయి. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి అసంబా చుబా ఆవో మంగళవారం వెల్లడించారు.
భారీగా తగ్గిన సర్వీసులు.. సుదీర్ఘ ప్రయాణాలు
సాధారణంగా పశ్చిమాసియా దేశాలకు భారతీయ విమాన సంస్థలు రోజుకు సగటున 300 నుంచి 350 సర్వీసులను నడిపేవి. కానీ ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల ఈ సంఖ్య 80-90కి పడిపోయిందని ప్రభుత్వం తెలిపింది. ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ వంటి దేశాలు తమ గగనతలాన్ని పాక్షికంగా, పూర్తిగా మూసివేయడంతో విమానాలను దారి మళ్లించాల్సి వస్తోంది. ముఖ్యంగా ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు వెళ్లే విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి రావడంతో ప్రయాణ సమయంతో పాటు ఇంధన ఖర్చులు కూడా భారీగా పెరిగాయి.
పైలెట్ల పనివేళల్లో వెసులుబాటు
సుదీర్ఘ మార్గాల్లో విమానాలను నడపడం వల్ల ఏర్పడుతున్న పైలెట్ల కొరతను, పని ఒత్తిడిని అధిగమించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పైలెట్ల పనివేళల నిబంధనలను ఏప్రిల్ 30 వరకు సడలించింది. దీని ప్రకారం పైలెట్ల విమాన ప్రయాణ సమయాన్ని సుమారు 11.5 గంటల వరకు పెంచారు. ఈ వెసులుబాటు వల్ల విమాన సంస్థలు తక్కువ మంది సిబ్బందితో సుదీర్ఘ రూట్లను నిర్వహించే అవకాశం లభిస్తుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి మే నెలలో ఈ గడువును సమీక్షించనున్నారు.
పెరిగిన చార్జీల భారం
అంతర్జాతీయ మార్కెట్‌లో విమాన ఇంధనం ధరలు రెట్టింపైనప్పటికీ, దేశీయ విమాన సంస్థలపై ఆ భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ ధరల పెరుగుదలలో కొంత భాగాన్ని మాత్రమే ఇక్కడ అమలు చేస్తూ ధరలను నియంత్రిస్తోంది. విమాన నిర్వహణ వ్యయంలో 40 శాతం వాటా ఇంధనానిదే కావడం గమనార్హం. అయినప్పటికీ, పెరిగిన వ్యయాన్ని భర్తీ చేసుకునేందుకు విమాన సంస్థలు ప్రయాణికులపై 'దూర ప్రాతిపదికన సర్ఛార్జ్' విధిస్తున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతోంది.
సరఫరా గొలుసు దెబ్బతినకుండా జాగ్రత్తలు
యుద్ధం కారణంగా సరకు రవాణా నిలిచిపోకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఎమిరేట్స్, కువైట్ ఎయిర్‌వేస్, జజీరా వంటి విదేశీ విమాన సంస్థలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ప్రయాణికుల విమానాలను కేవలం సరకు రవాణా కోసమే వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించింది. దీనివల్ల నిత్యావసరాలు, ఇతర కీలక వస్తువుల సరఫరా గొలుసులో ఆటంకాలు కలగకుండా జాగ్రత్త పడుతోంది.
భారతీయ విమాన సంస్థల మొత్తం ఆదాయంలో పశ్చిమాసియా మార్గాల వాటా దాదాపు 50 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం సర్వీసులు తగ్గడంతో విమాన సంస్థల ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. పరిశ్రమను ఆదుకునేందుకు, ప్రయాణికుల భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతోందని అధికారులు స్పష్టం చేశారు.
