
పశ్చిమాసియా యుద్ధం ఆగాలి: తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ఆమోదం
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ శాంతికి, ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమించిందని తెలంగాణ శాసనసభ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ యుద్ధాన్ని నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం అసెంబ్లీలో ఒక కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాదని, ఇది ప్రపంచ సరఫరా గొలుసును దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. ప్రతి దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపే ముడి చమురు (పెట్రోల్, డీజిల్, గ్యాస్) ఉత్పత్తి రవాణా ఈ యుద్ధం వల్ల తీవ్రంగా అంతరాయం కలుగుతోందని ఆయన వివరించారు. దీనివల్ల ముఖ్యంగా ఆసియా దేశాలు, భారత్ వంటి దేశాలపై ఆర్థిక భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
భారీ ప్రాణ, ఆస్తి నష్టం
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్, లెబనాన్‌లపై దాడులు చేస్తుండగా, ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా రక్షణ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోందని సభ దృష్టికి తెచ్చారు. ఫైటర్ బాంబర్లు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ల వంటి అధునాతన ఆయుధాల వినియోగం వల్ల ఇప్పటివరకు సుమారు 4,000 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రాణనష్టంతో పాటు ఊహించని స్థాయిలో ఆర్థిక విధ్వంసం జరుగుతోందని మండిపడ్డారు. యుద్ధం వల్ల కలిగే ప్రాణనష్టం ఆయా దేశాలకే పరిమితం కావచ్చు, కానీ ఆర్థిక విధ్వంసం ప్రపంచమంతా విస్తరిస్తుంది. ఇప్పుడే ఈ యుద్ధాన్ని ఆపకపోతే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇది మానవ మనుగడకే ముప్పుగా మారుతుందని భట్టి విక్రమార్క హెచ్చరించారు.
ఈ ప్రమాదకరమైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, తక్షణమే యుద్ధాన్ని ఆపేందుకు అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వం తన దౌత్యపరమైన చొరవను ప్రదర్శించాలని, ప్రపంచ శాంతి స్థాపనకు కృషి చేయాలని తెలంగాణ శాసనసభ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ తీర్మానం ఆమోదించబడినట్లు ప్రకటించారు.
