
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీ మౌనం వీడాలి: ఎంపీ అసదుద్దీన్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ తన మౌనాన్ని వీడాలని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడి యుద్ధాన్ని ముగించేలా ఒత్తిడి తీసుకురావాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు.
ఈ ప్రాంతంలో పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం కొనసాగితే భారతీయులకు, ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న భారతీయులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. గజా విషయంలో మీరు మౌనంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మన పౌరులు చనిపోతున్నారు. వెంటనే ట్రంప్‌కు ఫోన్ చేసి ఈ యుద్ధం ఆపమని చెప్పండి అని ప్రధానిని ఉద్దేశించి అన్నారు.
రెండు రోజుల క్రితం శ్రీలంక సమీపంలో అమెరికా సైనిక సబ్‌మరిన్ దాడితో ఇరాన్ నౌక ఐఆర్‌ఐఎస్ దెనా మునిగిపోయిన ఘటనపై కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని ఓవైసీ డిమాండ్ చేశారు. ఈ ఘటన భారత జలాల్లో కాకపోయినా భారతదేశానికి సమీపంలోనే జరిగినందున దీని ప్రభావాన్ని తక్కువగా చూడలేమన్నారు. నీటికి ఎలాంటి సరిహద్దులు ఉండవు. మన దేశానికి ఎంత దగ్గరగా శత్రువు చేరుకున్నాడో అర్థం చేసుకోవాలి. జరిగిన విషయాలపై దేశానికి వివరాలు చెప్పడం ప్రధాని రాజ్యాంగబద్ధ బాధ్యత అని అన్నారు.
భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఈ ఘటనపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇరాన్ నౌక విశాఖపట్నానికి భారత ఆహ్వానంతో వచ్చిన సందర్భం ఉందని గుర్తు చేశారు. అదే సమయంలో అమెరికా ఆ నౌకాదళ వ్యాయామాల్లో పాల్గొనడానికి నిరాకరించిందని కూడా పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో యుద్ధం మరింత విస్తరించినట్లయితే గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న సుమారు ఒక కోటి మంది భారతీయుల ఉపాధి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అందువల్ల ఈ యుద్ధాన్ని తక్షణం నిలిపివేయాలని అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వం చురుకుగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
అమెరికా ఆధిపత్యంపై నిప్పులు
అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఇటీవల భారతదేశం రష్యా నుంచి చమురు దిగుమతులపై చేసిన వ్యాఖ్యలపై కూడా ఓవైసీ తీవ్రంగా స్పందించారు. భారతీయ రిఫైనరీలు రష్యా చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా 30 రోజుల తాత్కాలిక మినహాయింపు ఇచ్చిందని ఆయన చెప్పడాన్ని విమర్శిస్తూ, భారతదేశం నిజంగా సార్వభౌమ దేశమా? లేక అమెరికా వద్ద తాకట్టు పెట్టారా? ఒక విదేశీ మంత్రి మనకు నెల రోజుల పాటు చమురు కొనుగోలుకు అనుమతి ఇస్తున్నామని చెప్పడమేంటి? అని ప్రశ్నించారు.
ఇది మనం బ్రిటీష్ వారి నుంచి పొందిన స్వాతంత్య్రం ఇదేనా? ఒక విదేశీయుడు ఎంత కాలం కొనాలి అని చెప్పే పరిస్థితి ఎందుకు రావాలి? అంటూ ఆయన విమర్శించారు. ఈ విషయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు ట్రంప్ అంటే భయపడుతున్నారని, అందుకే అమెరికా అధికారుల వ్యాఖ్యలకు గట్టిగా సమాధానం చెప్పలేకపోతున్నారని ఆరోపించారు. భారత్ ఎదుగుదలను అమెరికా అడ్డుకుంటోందని, మనం వారి బానిసలం కాదని ఆయన పేర్కొన్నారు.
ఇజ్రాయెల్‌పై కూడా ఓవైసీ విమర్శలు గుప్పించారు. మధ్యప్రాచ్యంలో పెద్ద ఇజ్రాయెల్ అనే లక్ష్యంతో అరబ్ దేశాల భూభాగాలను ఆక్రమించాలనే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ దురాక్రమణ దృష్టి పవిత్ర నగరం మదీనాపై కూడా పడుతోందని వ్యాఖ్యానించారు. చివరగా, దేశాన్ని 'హిందూ రాష్ట్రం'గా మార్చాలని చూస్తున్న, ముస్లింల మతమార్పిడికి పిలుపునిస్తున్న మితవాద సంస్థలకు కేంద్రం నిధులు ఇస్తోందని ఓవైసీ ఆరోపించారు. ఇటువంటి చర్యలు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
