
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీ బహిరంగంగా మాట్లాడాలి: ఎంపీ అసదుద్దీన్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సైనిక సంఘర్షణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడి, అది తప్పని బహిరంగంగా ప్రకటించాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. శుక్రవారం ఇక్కడి మక్కా మసీదులో జరిగిన ఒక సభలో ఆయన ప్రసంగిస్తూ, గతంలో భారత్ అవలంబించిన తటస్థ వైఖరికి భిన్నంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
గతంలో భారత్ పశ్చిమాసియా దేశాలన్నింటితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూనే, పాలస్తీనా సమస్యను తన సొంత సమస్యగా పరిగణించేదని ఓవైసీ గుర్తు చేశారు. కానీ మోదీ ఏం చేశారు? ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లకు అత్యంత సన్నిహితులుగా మారిపోయారు. మీరు తటస్థంగా ఉండి ఉంటే, మీ మాటలకు ప్రపంచ వేదికపై మరింత బలం ఉండేది. కనీసం ఇప్పుడైనా ఈ యుద్ధం తప్పని మీరు స్పష్టంగా చెప్పాలి అని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమాసియా దేశాలపై మోదీకి ప్రేమ లేకపోయినా, అక్కడ పనిచేస్తున్న సుమారు ఒక కోటి మంది భారతీయుల కోసమైనా ఆయన ఈ యుద్ధాన్ని వ్యతిరేకించాలని ఓవైసీ కోరారు. భారత్‌కు వచ్చే విదేశీ మారకద్రవ్యంలో 50 శాతం ఈ దేశాల నుంచే వస్తుందని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ యుద్ధం కారణంగా అక్కడి ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిని, ఆ దేశాలు భారతీయులను తిరిగి పంపించేస్తే, వారికి మోదీ ఉపాధి కల్పించగలరా? అని ప్రశ్నించారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ వర్గాలకు ట్రంప్, నెతన్యాహులే ముఖ్యం తప్ప, అక్కడ శ్రమిస్తున్న భారతీయుల పట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.
ముడి చమురు నిల్వలపై ఆందోళన
భారతదేశ వ్యూహాత్మక చమురు నిల్వల గురించి కూడా ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం దేశంలో 90 రోజులకు సరిపడా నిల్వలు ఉండాలని, కానీ ప్రస్తుతం మన వద్ద కేవలం 9.50 రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
పాకిస్థాన్‌ను ఇజ్రాయెల్ యొక్క తమ్ముడు గా ఒవైసీ అభివర్ణించారు. ఈ రెండు దేశాలు తమ పొరుగువారు ప్రశాంతంగా ఉండనివ్వవని విమర్శించారు. ఆఫ్ఘనిస్థాన్‌పై దాడులు చేస్తున్న పాకిస్థాన్ వైఖరిని తప్పుపడుతూ, ఆ దేశం ఇస్లాం గురించి గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు.
దేశంలో పెరుగుతున్న విద్వేషపూరిత సంఘటనలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలను ఆర్థికంగా బహిష్కరించాలని సంఘ్ పరివార్ శక్తులు పిలుపునివ్వడాన్ని ఆయన ప్రశ్నించారు. ముస్లింలను బహిష్కరించాలనుకుంటే, ఖతార్ లేదా సౌదీ అరేబియా నుంచి చమురు, గ్యాస్ ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు? అక్కడి పెట్టుబడులను ఎందుకు ప్రశ్నించడం లేదు? అని నిలదీశారు. దేశంలో 67 శాతం మంది గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉన్నారని, వారిని అభివృద్ధి పథంలో నడిపించాల్సింది పోయి మతపరమైన అంశాల్లోకి నెడుతున్నారని విమర్శించారు. గంగానదిలో పడవపై ఉపవాసం విరమించినందుకు 11 మందిపై కేసులు పెట్టడాన్ని, ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ వంటి ప్రాంతాల్లో ముస్లింలు తమ ఇళ్లు వదిలి వెళ్లేలా బెదిరింపులకు గురికావడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. భారతదేశం తన ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, అంతర్జాతీయ వేదికపై శాంతి కోసం గొంతు ఎత్తాలని ఓవైసీ పిలుపునిచ్చారు.
