Let's talk: editor@tmv.in
పశ్చిమాసియా పరిస్థితిపై నేడు అఖిలపక్ష సమావేశం

పశ్చిమాసియా పరిస్థితిపై నేడు అఖిలపక్ష సమావేశం

Pinjari Chand
25 మార్చి, 2026

పశ్చిమాసియా సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.ఇటీవల లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రసంగం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సోమవారం పార్లమెంట్‌లో మాట్లాడిన ప్రధాని, పశ్చిమాసియా ఘర్షణ కారణంగా ఏర్పడిన క్లిష్ట గ్లోబల్ పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగవచ్చని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలోలా దేశం ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంధనం, ఎరువులు, జాతీయ భద్రత వంటి రంగాలపై ఈ సంక్షోభం ప్రభావం చూపే అవకాశముందని, అలాగే పశ్చిమాసియా దేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రతపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. సాధారణ ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సంక్షోభంపై భారత పార్లమెంట్ నుంచి ఒకే స్వరం ప్రపంచానికి వినిపించాలని ప్రధాని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, పశ్చిమాసియా పరిస్థితిపై ప్రధాని వైఖరిని ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ విమర్శించింది. ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా–ఇజ్రాయెల్ దాడులను ఖండించలేదని ఆరోపించింది. లోక్‌సభలో చేసిన ప్రసంగాన్ని ఆత్మప్రశంస, భయపడే ధోరణి, పక్షపాత వ్యాఖ్యల సమాహారంగా అభివర్ణించింది.

నారీ వందన్ చట్ట సవరణపై అఖిలపక్ష సమావేశం నిర్వహించండి: మల్లికార్జున్‌ ఖర్గే

నారీ వందన్ అధినియమ్, 2023కు ప్రతిపాదిత సవరణలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర పార్లమెంటరీ వ్వవహరాల శాఖ మంత్రి కిరెన్‌రిజిజుకు లేఖ రాశారు. ప్రభుత్వం 2023 సెప్టెంబర్‌లో ఆమోదించిన రాజ్యాంగ సవరణ చట్టానికి మరిన్ని మార్పులు చేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నందున, ఈ అంశంపై అన్ని ప్రతిపక్ష పార్టీలతో చర్చ అవసరమని ఖర్గే పేర్కొన్నారు. ప్రతిపాదిత మార్పులపై సమగ్రంగా చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. సమావేశం ఫలప్రదంగా ఉండేందుకు ప్రతిపాదిత సవరణల వివరాలతో ముందుగానే ఒక నోట్‌ను ప్రభుత్వమే పంపాలని సూచించారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక, అంటే ఏప్రిల్ 29 తర్వాత ఈ సమావేశం నిర్వహించాలని కోరారు.

అధికార వర్గాల సమాచారం ప్రకారం, ప్రభుత్వం రెండు ప్రధాన సవరణలను పరిగణలోకి తీసుకుంటోంది. 2023 నారీ శక్తి వందన్ చట్టం మహిళా రిజర్వేషన్‌ను జనగణన, నియోజకవర్గాల పునర్విభజనతో అనుసంధానించింది. అయితే జనగణన ఆలస్యమవుతున్న నేపథ్యంలో, 2011 జనగణన ఆధారంగా డిలిమిటేషన్ చేసి సీట్ల పునర్విభజన చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సవరణల ప్రకారం లోక్‌సభ సీట్ల సంఖ్య 543 నుంచి సుమారు 816కు పెరగవచ్చు. మహిళలకు దాదాపు మూడో వంతు సీట్లు, అంటే సుమారు 273 స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. ఈ మార్పులకు సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అదనంగా డిలిమిటేషన్‌కు సంబంధించి మరో ప్రత్యేక బిల్లును కూడా తీసుకురానున్నారు. ఈ రెండు బిల్లులు రాజ్యాంగ సవరణలుగా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిలో ఓబీసీ రిజర్వేషన్‌కు ప్రత్యేక నిబంధనలు లేవని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగుతాయని సమాచారం. రాష్ట్రాల పాత్ర లేకుండా పార్లమెంట్ ఆమోదించిన విధంగానే ఈ మార్పులు అమలులోకి రావచ్చు.

ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలు ఉండగా, ప్రతిపాదిత మార్పుల తర్వాత ఈ సంఖ్య 816కు పెరిగే అవకాశం ఉంది. దీంతో మెజారిటీ మార్క్ కూడా 272 నుంచి 409కు పెరుగుతుంది. ఈ సవరణలు ఆమోదం పొందితే, 2029 సాధారణ ఎన్నికల్లో 800కిపైగా సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇది స్వాతంత్ర్యం తర్వాత భారత ప్రజాస్వామ్యంలో అతిపెద్ద మార్పుగా నిలవవచ్చని భావిస్తున్నారు.