
పశ్చిమాసియా ఉద్రిక్తతలు: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ
పశ్చిమాసియాలో రోజురోజుకూ ముదురుతున్న ఉద్రిక్తతలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య కొనసాగుతున్న పోరాటం నేపథ్యంలో గురువారం ఆయన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్‌తో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతల క్షీణత, పౌరుల మరణాలు మరియు మౌలిక సదుపాయాల విధ్వంసంపై తన విచారాన్ని పంచుకున్నారు. సమస్యల పరిష్కారానికి దౌత్యం, చర్చలే ఏకైక మార్గమని ఈ సందర్భంగా మోదీ నొక్కి చెప్పారు.
భారతీయుల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం
ఈ సంక్షోభ సమయంలో ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరుల భద్రత తమకు అత్యంత ముఖ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అలాగే, అంతర్జాతీయ వాణిజ్యానికి విఘాతం కలగకుండా వస్తువుల రవాణా, ఇంధన సరఫరా సజావుగా సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. "శాంతి మరియు స్థిరత్వానికి భారత్ కట్టుబడి ఉంది. ఉద్రిక్తతలను తగ్గించడానికి తక్షణమే చర్చలు ప్రారంభించాలని కోరుతున్నాం" అని మోదీ ఎక్స్ (X) వేదికగా వెల్లడించారు.
రంగంలోకి విదేశాంగ శాఖ.. 9 వేల మందికి భరోసా
భారత ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర దౌత్య ప్రయత్నాలు చేస్తోంది. ఇరాన్‌లో ఉన్న సుమారు 9,000 మంది భారతీయుల (విద్యార్థులు, నావికులు, యాత్రికులు) భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు స్వదేశానికి చేరుకోగా, మిగిలిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం విదేశాంగ మంత్రి జైశంకర్ ఇప్పటికే తన ఇరాన్ సహచరుడు అబ్బాస్ అరాగ్చీతో మూడుసార్లు చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగానే కీలకమైన 'హోర్ముజ్ జలసంధి' ద్వారా భారత చమురు ట్యాంకర్ల రవాణా స్థిరంగా సాగుతోందని అధికారులు తెలిపారు.
సరిహద్దుల ద్వారా స్వదేశానికి తరలింపు
ఇరాన్ నుంచి బయటపడాలనుకునే భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. టెహ్రాన్‌లోని భారతీయులను సురక్షిత నగరాలకు తరలించడంతో పాటు, భూ సరిహద్దుల ద్వారా వారిని పొరుగు దేశాలైన అర్మేనియా, అజర్‌బైజాన్‌లకు చేరుస్తున్నట్లు జైస్వాల్ వివరించారు. అక్కడి నుంచి వాణిజ్య విమానాల ద్వారా వారిని భారత్‌కు తీసుకువచ్చేందుకు వీసా సహాయం మరియు ఇతర లాజిస్టిక్ మద్దతును ప్రభుత్వం అందిస్తోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు కుదుటపడే వరకు భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
