
పశ్చిమాసియాలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు వాయిదా
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న అస్థిరత, విద్యార్థుల భద్రత, వారి మానసిక ఆందోళనను పరిగణనలోకి తీసుకుని 12వ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సోమవారం రాత్రి ప్రకటించింది.
పరీక్షల వాయిదా.. ఏ ఏ దేశాల్లో అంటే?
పశ్చిమాసియా ప్రాంతంలోని ప్రస్తుత పరిస్థితులపై క్షుణ్ణంగా సమీక్షించిన అనంతరం, మార్చి 12 నుండి మార్చి 16 వరకు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు బోర్డు ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఈ నిర్ణయం గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలోని సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలన్నింటికీ వర్తిస్తుందని బోర్డు స్పష్టం చేసింది. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని, విద్యార్థులు తాజా సమాచారం కోసం తమ పాఠశాలలను సంప్రదించాలని సూచించింది. కాగా మార్చి 16 తర్వాత జరగబోయే పరీక్షలపై మార్చి 14న మరోసారి సమీక్ష నిర్వహించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.
భారతీయులకు రాయబార కార్యాలయాల అడ్వైజరీ
ప్రాంతీయ భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు అక్కడి భారతీయులకు కీలక సూచనలు చేశాయి. బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయులను అప్రమత్తంగా ఉండాలని కోరింది. ముఖ్యంగా అక్కడ చిక్కుకుపోయిన పర్యాటకులు, షార్ట్-టర్మ్ వీసాపై ఉన్న భారతీయులను సౌదీ అరేబియా మీదుగా స్వదేశానికి పంపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. సౌదీ గుండా ట్రాన్సిట్ వీసాల కోసం రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటున్నట్లు పేర్కొంది.
ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా అక్కడి భారతీయులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాయబార కార్యాలయం ముందస్తు అనుమతి, సమన్వయం లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. ఒకసారి ఇరాన్ భూభాగాన్ని దాటిన తర్వాత, ఒకవేళ పొరుగు దేశంలోకి ప్రవేశం లభించకపోతే రాయబార కార్యాలయం సహాయం అందించడం సాధ్యపడదని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లను కూడా రాయబార కార్యాలయాలు అందుబాటులో ఉంచాయి. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత పౌరులంతా ఎప్పటికప్పుడు అధికారిక ప్రకటనలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.
