Let's talk: editor@tmv.in
పశ్చిమాసియాలో సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు

పశ్చిమాసియాలో సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు

Shaik Mohammad Shaffee
16 మార్చి, 2026

పశ్చిమాసియా ప్రాంతంలో ముదురుతున్న యుద్ధ జ్వాలల నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాల్లో నెలకొన్న అసాధారణ ఉద్రిక్త పరిస్థితులు, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం గల్ఫ్ రీజియన్‌లోని వేలాది మంది భారతీయ విద్యార్థుల భవితవ్యంపై పెద్ద ఎత్తున ప్రభావం చూపనుంది.

నేటి నుంచి జరగాల్సిన ఎగ్జామ్స్ రద్దు

తాజాగా విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం.. మార్చి 16 (నేటి) నుంచి ఏప్రిల్ 10 వరకు జరగాల్సి ఉన్న 12వ తరగతి పరీక్షలన్నీ పూర్తిగా రద్దు అయ్యాయి. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల్లోని విద్యార్థులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటికే ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరగాల్సిన 10వ తరగతి పరీక్షలను రద్దు చేసిన బోర్డు, తాజా పరిస్థితుల దృష్ట్యా ఇంటర్ విద్యార్థుల విషయంలోనూ అదే బాటలో పయనించింది.

గతంలో వాయిదా పడిన పరీక్షలు కూడా రద్దే

పశ్చిమాసియా రీజియన్‌లో నెలకొన్న యుద్ధ మేఘాల కారణంగా ఈ నెల ప్రారంభంలో (మార్చి 1, 3, 5, 7, 9 తేదీల్లో) జరగాల్సిన పరీక్షలను బోర్డు గతంలోనే వాయిదా వేసింది. అయితే, ప్రస్తుత పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతుండటంతో ఆ వాయిదా పడిన పరీక్షలను సైతం ఇప్పుడు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సీబీఎస్‌ఈ వెల్లడించింది. దీంతో ఈ నెల ప్రారంభం నుంచి ఏప్రిల్ 10 వరకు షెడ్యూల్ చేసిన అన్ని పరీక్షలు రద్దయినట్లయ్యిందని బోర్డు వివరించింది.

ఫలితాల వెల్లడికి కొత్త విధివిధానాలు

పరీక్షల రద్దుతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించేందుకు బోర్డు కీలక ప్రకటన చేసింది. పశ్చిమాసియా ప్రాంతంలోని 12వ తరగతి అభ్యర్థులకు మార్కులను ఏ ప్రాతిపదికన కేటాయించాలి, ఫలితాలను ఏ విధానంలో ప్రకటించాలి అనే అంశంపై బోర్డు త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను నిపుణుల కమిటీతో చర్చించిన అనంతరం ప్రత్యేకంగా నోటిఫై చేస్తామని సీబీఎస్‌ఈ పేర్కొంది.