
పశ్చిమాసియాలో భగ్గుమన్న మంటలు
లెబనాన్ ఆకాశం మళ్లీ మంటలు కక్కుతోంది. ఒక ఏడాది క్రితం శాంతి పేరుతో సంతకం చేసిన ఒప్పందం ఇప్పుడు శవపేటికలో నిద్రిస్తున్న కాగితంలా మారింది. ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఏడాది కాలంలో ఇజ్రాయెల్ ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడడం ఇది ఏకంగా 4,500వ సారి. గాలిలో మంటల శబ్దాల మధ్య ప్రతి రోజు మరొక గ్రామం దహనమవుతోంది. లెబనాన్ ప్రజలు శాంతి అనే మాటను మరిచిపోతున్నారు, ఎందుకంటే ప్రతీ ఉదయం వారికి ఆకాశం నుంచి అగ్ని మాత్రమే కురుస్తోంది. 2024 నవంబర్‌లో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య యుద్ధం ముగిసిందని ప్రపంచం నమ్మింది. కానీ యుద్ధం ఆగలేదు.. రూపం మాత్రమే మార్చుకుంది. లెబనాన్‌లో షియా ముస్లిం సంస్థ అయిన హిజ్బుల్లా టార్గెట్‌గా ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. పలువురు హిజ్బుల్లా టాప్ లీడర్లే లక్ష్యంగా ఈ దాడి జరగగా.. ఈ ఘటనలో ఓ సిరియన్ పౌరుడు చనిపోయాడు.. మరో ఏడుగురు లెబనాన్ పౌరులు గాయపడ్డారు. ఇక ఈ దాడుల పరంపర ఇప్పటిలో ఆగేలా కనిపించడంలేదు. అసలు ఈ రెండు దేశాల మధ్య ఎందుకు యుద్ధం జరుగుతుందో తెలుసుకోవాలంటే ముందుగా హిజ్బుల్లా గురించి అర్థంచేసుకోవాలి.
హిజ్బుల్లా అంటే లెబనాన్ నేలలో పుట్టిన ప్రతిఘటన సంస్థ. 1982లో ఇజ్రాయెల్ లెబనాన్‌పై దండెత్తినప్పుడు ఈ సంస్థ పుట్టింది. ఆ సమయంలో లెబనాన్ ప్రజల చేతుల్లో తుపాకీ లేదు.. గుండెల్లో కోపం మాత్రమే ఉంది. ఆ కోపమే హిజ్బుల్లాగా మారింది. ఇరాన్ మద్దతుతో పెరిగిన ఈ సంస్థ లెబనాన్ దక్షిణ సరిహద్దులో ఇజ్రాయెల్ ఆక్రమణకు ఎదురీది నిలిచింది. ఇటు 2006లో ఈ రెండు దేశాలు ఎదురెదురుగా నిలిచాయి. నెలరోజులు సాగిన ఆ యుద్ధం రక్తంతో నిండిన జ్ఞాపకంగా నిలిచింది. రెండు పక్షాలూ తలవంచలేదు. ఆ యుద్ధం ముగిసినా, భయం మాత్రం ముగియలేదు. ఇజ్రాయెల్ ప్రతీసారి హిజ్బుల్లా సాకుతో లెబనాన్‌పై దాడులు చేస్తూ వస్తోంది. అయితే బాంబులు పడేది పేదల ఇళ్ల మీద, చనిపోయేది అమాయక పిల్లలు, తల్లులే. ఇక హిజ్బుల్లా ఒక సాయుధ సంస్థ అయినా, లెబనాన్ ప్రజలలో ఇది ప్రతిఘటనకు చిహ్నం. ఇజ్రాయెల్ దృష్టిలో ఇది ఉగ్రవాదం, కానీ లెబనాన్ దృష్టిలో ఇది రక్షణ. ఈ విరోధమే ఇప్పుడు మళ్లీ దేశాన్ని చీల్చేస్తోంది.
ఇక అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా పోరాట సంస్థ అయిన హమాస్ దళాలు దాడులు చేశాయి. ఆ ఘటనలో దాదాపు 1200మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా పాలస్తీనాలోని గాజా గడ్డపై ఇజ్రాయెల్ దళాలు దాడులకు దిగాయి. ఈ సమయంలోనే పాలస్తీనాకు మద్దతుగా హిజ్బుల్లా బరిలోకి దిగింది. దీంతో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌పై బాంబులు విసిరింది. చివరకు 2024 నవంబర్‌లో ఇజ్రాయెల్ -లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా ఇప్పటికీ ఘర్షణ ఆగలేదు. ఇజ్రాయెల్ దళాలు సరిహద్దు నుంచి వెళ్లిపోవాల్సింది, కానీ ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. లెబనాన్ గ్రామాల్లో మళ్లీ ట్యాంకులు కదులుతున్నాయి. యుద్ధం ఆగలేదని ఆ నేలలోని ప్రతి భూభాగం చెబుతోంది.
ఐక్యరాజ్యసమితి ప్రకారం ఇజ్రాయెల్ ఇప్పటికీ లెబనాన్ దక్షిణ ప్రాంతంలో 10 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. దీని కారణంగా 80వేల మంది ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళలేకపోతున్నారు. వారిలో చాలామంది ఇంకా శిబిరాల్లోనే జీవిస్తున్నారు. ఆ శిబిరాల గోడల వెనుక పిల్లల నవ్వులు కాదు, పేలుళ్ల ప్రతిధ్వనులే వినిపిస్తున్నాయి. ప్రతి వారం కొత్త దాడులు జరుగుతున్నాయి. ఇటు మసైలె పట్టణంలో జరిగిన దాడి లెబనాన్ గుండెల్లో రంధ్రం వేసింది. నిర్మాణ యంత్రాలు అమ్మే స్థలంపై జరిగిన బాంబు దాడి ఒక క్షణంలో నాశనంగా మారింది. బుల్డోజర్లు, క్రేన్లు మంటల్లో మాయం అయ్యాయి. అక్కడ పనిచేసిన కార్మికుల కేకలు ఇంకా గాలిలో నిలిచే ఉన్నాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే లెబనాన్ నేలపై శాంతి అనే పదం ఇప్పుడు ఒక శవగీతంలా మారింది. శిథిలాల మధ్య జీవించే ప్రజలు ఆకాశాన్ని చూసి భయపడుతున్నారు. అనేక పట్టణాలు మంటల్లో మసకబారాయి. ఒకప్పుడు పిల్లలు ఆడుకున్న వీధుల్లో ఇప్పుడు కాలిన ఇళ్ల వాసన మాత్రమే ఉంది. సిమెంట్ ఫ్యాక్టరీలు, రోడ్లు, నీటి పైపులు బూడిదగా మారాయి. బాంబుల ధూళిలో శాంతి అనే స్వప్నం మళ్లీ కూలిపోయింది. ప్రజలు జీవించడమే ఒక యుద్ధంగా మారింది. ఇజ్రాయెల్ దాడులు కేవలం సైనిక వ్యూహాలు కావు, అవి యుద్ధ నేరాలు. 4500 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘించడం అంటే అంతర్జాతీయ చట్టాలపై తుపాకీ తూటాలు దింపడమనే అర్థం. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పిన గణాంకాలు రక్తంతో రాసిన వాస్తవం. కాల్పుల విరమణ తర్వాత ఏడాది కాలంలో 270మంది లెబనాన్ పౌరులు ఇజ్రాయెల్ బాంబులకు బలయ్యారు. ఇందులో 16మంది పిల్లలున్నారు. 19మంది పౌరులను ఇజ్రాయెల్ సైన్యం అపహరించింది. ఇటు ఐక్యరాజ్యసమితి కూడా ఈ మానవతా నేరాల ముందు మౌనం వహించడం అత్యంత బాధాకరం. మరోవైపు ఈ యుద్ధం ముగిసే సూచనలు ఇప్పటికైతే కనిపించడంలేదండి..! అంటే మరో గాజా తరహా పరిస్థితులు దక్షిణ లెబనాన్‌లోనూ రావొచ్చు.. చూడాలి ఏం జరుగుతుందో!
