
పశ్చిమాసియాలో ఆగని యుద్ధ మంటలు
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ ఘర్షణలు బుధవారం 12వ రోజుకు చేరుకొని మరింత తీవ్రరూపం దాల్చాయి. గల్ఫ్ ప్రాంతంలోని చమురు నిల్వ కేంద్రాలు, వాణిజ్య నౌకలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విస్తృత దాడులు చేసింది. దీనికి ప్రతిగా అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. గల్ఫ్ దేశాల గగనతలంలో అప్రమత్త పరిస్థితి నెలకొంది.
అరబ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు
ఇరాన్ సౌదీ అరేబియాలోని కీలక చమురు నిల్వ కేంద్రాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరంలోని వాణిజ్య నౌకలు, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా-ఇజ్రాయెల్ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. సౌదీ అరేబియా తన చమురు క్షేత్రాల వైపు వస్తున్న ఐదు డ్రోన్లు, ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ వైపు దూసుకొచ్చిన ఆరు బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు కువైట్ తన భూభాగంపైకి వచ్చిన ఎనిమిది ఇరాన్ డ్రోన్లను కూల్చివేసింది. ఖతార్, ఒమన్, బహ్రెయిన్, యూఏఈ దేశాలు కూడా సంయుక్త రక్షణ చర్యలను చేపట్టాయి.
దుబాయ్ ఎయిర్ పోర్ట్‌పై దాడి.. నలుగురికి గాయాలు
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కూడా రెండు ఇరాన్ డ్రోన్లు కూలిపోవడంతో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు ఘనా జాతీయులు, ఒకరు బంగ్లాదేశ్ పౌరుడు కాగా, ఒక భారతీయుడికి గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటన జరిగినప్పటికీ విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
భారత్‌కు వస్తున్న నౌకపై క్షిపణి దాడి
ఇరాన్ దాడులు సముద్ర మార్గాల్లో కూడా కొనసాగుతున్నాయి. హార్ముజ్ జలసంధి సమీపంలో థాయ్‌లాండ్‌కు చెందిన ‘మయూరీ నారీ’ అనే సరుకు రవాణా నౌకపై క్షిపణి దాడి జరగడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది అదృశ్యమవగా, మరో 20 మందిని ఒమన్ నౌకాదళం రక్షించింది. ఈ నౌక యూఏఈలోని ఖలీఫా పోర్ట్ నుండి గుజరాత్‌లోని కాండ్లా పోర్ట్‌కు వెళ్తుండగా ఉదయం 10 గంటల సమయంలో దాడికి గురైనట్లు సమాచారం. బుధవారం మొత్తం మూడు నౌకలు క్షిపణి దాడులకు గురయ్యాయి.
హార్ముజ్‌లో ఉద్రిక్త పరిస్థితులు
ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం వాటా కలిగిన హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వాణిజ్య నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇరాన్ ఈ మార్గం ద్వారా శత్రు దేశాలకు ఒక్క లీటరు చమురును కూడా వెళ్లనివ్వబోమని హెచ్చరించింది. దీనికి ప్రతిస్పందనగా సముద్రపు మైన్లు అమర్చేందుకు సిద్ధమైన 16 ఇరాన్ నౌకలను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. జలసంధిలో ఇరాన్ ఇప్పటివరకు పేలుడు పదార్థాలను అమర్చలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
చమురు ధరల్లో పెరుగుదల.. ఇంధన మార్కెట్ ఆందోళన
యుద్ధ ప్రభావంతో ప్రపంచ చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి బ్రెంట్ క్రూడ్ ధర సుమారు 20 శాతం పెరిగింది. ధరలు బ్యారెల్‌కు సుమారు 90 డాలర్లకు చేరగా, ఒక దశలో 120 డాలర్ల వరకు పెరిగాయి. పరిస్థితిని నియంత్రించేందుకు అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రపంచ వ్యూహాత్మక నిల్వల నుండి 400 మిలియన్ బారెళ్ల చమురును విడుదల చేయాలని ప్రతిపాదించింది.
ఇరాన్ క్లస్టర్ బాంబులు వాడుతోంది: ఇజ్రాయెల్ ఆరోపణ
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నేరుగా క్షిపణి దాడులు కూడా కొనసాగుతున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4’ పేరిట 37వ విడత దాడులను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఖైబర్ షెకాన్, ఖద్ర్, ఖోరంషాహర్ వంటి భారీ బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగించినట్లు తెలిపింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, బీర్ యాకోవ్, బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళ స్థావరం లక్ష్యాలుగా నిలిచాయి.
ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణుల్లో ‘క్లస్టర్ బాంబులు’ ఉన్నట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇవి గగనతలంలో పేలి పదుల సంఖ్యలో చిన్న బాంబులను పెద్ద విస్తీర్ణంలో పడవేసే ప్రమాదకర ఆయుధాలు. ఇలాంటి బాంబులను అడ్డుకోవడం చాలా కష్టమని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
యుద్ధం వల్ల భారీ ప్రాణ నష్టం!
ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా, ప్రజలు బాంబు షెల్టర్లలో ఆశ్రయం తీసుకుంటున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్‌లో కనీసం 12 మంది మరణించగా, 2,000 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో మరణాల సంఖ్య 570కి చేరింది. వీరిలో 86 మంది పిల్లలు, 45 మంది మహిళలు ఉన్నారు. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుండి ఇప్పటివరకు ఇరాన్‌లో 1,300 మందికి పైగా పౌరులు మరణించినట్లు సమాచారం. అమెరికా వైపు ఏడుగురు సైనికులు మరణించగా, 140 మంది గాయపడ్డారు. ఇప్పటివరకు మొత్తం 14 వాణిజ్య నౌకలు దాడులకు గురయ్యాయి.
ఇరాన్‌లో నల్లటి ఆమ్ల వర్షం!
ఇరాన్ అంతర్గత పరిస్థితి కూడా ఉద్రిక్తంగా మారింది. అమెరికా దాడుల కారణంగా టెహ్రాన్ నగరం చమురు పొగతో కప్పుకుపోయి ‘నల్లటి ఆమ్ల వర్షం’ కురుస్తోందని స్థానికులు చెబుతున్నారు. ప్రజలు భయంతో గ్రామీణ ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచివేయడానికి భద్రతా దళాలు కఠిన చర్యలకు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ ప్రభుత్వం హెచ్చరించింది.
మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై అనుమానాలు
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం ప్రారంభంలో జరిగిన వైమానిక దాడిలో ఆయన గాయపడ్డారని ఇజ్రాయెల్ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై ఇరాన్ అధికారికంగా స్పందించలేదు. అయితే ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఇరాన్ అధ్యక్షుడి కుమారుడు యూసఫ్ పెజెష్కియన్ తెలిపారు.
ఆర్థిక ప్రభావం.. విదేశీయుల వలసలు
ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విమాన ఇంధన ధరలు రెట్టింపు కావడంతో హాంకాంగ్‌కు చెందిన క్యాథే పసిఫిక్ విమానయాన సంస్థ ఫ్యూయల్ సర్‌చార్జీని పెంచుతున్నట్లు ప్రకటించింది. మరోవైపు యుద్ధ భయంతో విదేశీయులు భారీగా పశ్చిమాసియా ప్రాంతాన్ని విడిచిపెడుతున్నారు. ఇప్పటివరకు 45,000 మంది బ్రిటన్ పౌరులు, 40,000 మంది అమెరికన్లు స్వదేశాలకు చేరుకున్నారు. లెబనాన్‌లో సుమారు 6.6 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
ఇద్దరు భారతీయుల మృతి
ఈ ఘర్షణల ప్రభావం భారతీయులపై కూడా పడింది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో ఇద్దరు భారతీయులు మరణించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖపేర్కొంది. మరో వ్యక్తి గల్లంతైనట్లు సమాచారం. ఒక భారతీయుడు ఇజ్రాయెల్‌లో, ఇంకొకరు దుబాయ్‌లో గాయపడ్డారని నివేదికలు అందాయి. ఈ ప్రాంతంలో సుమారు కోటి మంది భారతీయ ప్రవాసులు ఉన్న నేపథ్యంలో వారి భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని కేంద్రం తెలిపింది. సహాయం కోసం న్యూ ఢిల్లీలో 24 గంటల ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయగా, ఒక్కరోజే 75 ఫోన్ కాల్స్, 11 ఈమెయిల్స్ వచ్చాయని అధికారులు వెల్లడించారు.
భారత ప్రధాని మోడీ దౌత్య ప్రయత్నాలు
ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్, బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఇజ్రాయెల్ నేతలతో మాట్లాడారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఇరాన్ సహా పలు దేశాల విదేశాంగ మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఆస్ట్రేలియాలో ఇరాన్ సాకర్ క్రీడాకారిణులకు ఆశ్రయం
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఇరాన్ మహిళా ఫుట్‌బాల్ జట్టులోని ఆరుగురు క్రీడాకారిణులు ఆస్ట్రేలియాలోనే ఆశ్రయం కోరుతున్నట్లు అక్కడి హోం వ్యవహారాల మంత్రి టోనీ బర్క్ తెలిపారు. గతంలో ఆశ్రయం పొందిన మరో క్రీడాకారిణి తన నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి ఇరాన్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది.
యుద్ధం ఆపండి: ప్రపంచ దేశాలు
అంతర్జాతీయ స్థాయిలో కూడా యుద్ధం ఆపాలని పిలుపులు వినిపిస్తున్నాయి. అరబ్ దేశాలపై దాడులను నిలిపివేయాలని ఈజిప్ట్ ఇరాన్‌ను కోరగా, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ దౌత్య మార్గాల ద్వారా వెంటనే శాంతి సాధించాలని పిలుపునిచ్చారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ప్రతిపాదించిన తీర్మానంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఓటింగ్ జరపనుంది.
అమెరికా యుద్ధ లక్ష్యాలు.. ఇరాన్ మొండివైఖరి
అమెరికా మాత్రం ఈ యుద్ధంలో విజయం తమవైపే ఉందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం, నౌకాదళాన్ని నాశనం చేయడం, అణు ఆయుధాలు తయారు చేసే అవకాశాన్ని శాశ్వతంగా ముగించడం తమ ప్రధాన లక్ష్యాలని అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ తెలిపారు. ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రకటిస్తూ దాడులను కొనసాగిస్తోంది.
