Let's talk: editor@tmv.in
పశ్చిమాన పెరుగుతున్నవిధ్వంసం

పశ్చిమాన పెరుగుతున్నవిధ్వంసం

FL - BHAVN
18 సెప్టెంబర్, 2025

పశ్చిమ దేశాల్లో వలసలకు వ్యతిరేకంగా పలు దేశాల్లో జరుగుతున్న నిరసనలు అటు ప్రవాస భారతీయుల్లోనూ ఇటు దేశంలో నివసిస్తున్న వారి ఆత్మీయుల్లోనూ కలవరం రేపుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రవాసంలో స్థిరపడిన భారతీయుల సంఖ్య కాస్త ఎక్కువే. ఒక ముఫ్పై సంవత్సారాలకు పూర్వం అక్కడొకరు ఇక్కడొకరు ఏ అమెరికాలోనో, లండన్ లోనో, ఆస్ట్రేలియాలోనో ఉండేవారి కుటుంబాలు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు దాదాపు కుటుంబానికి ఒకరు ప్రవాసంలో ఉన్నారని చెప్పే పరిస్థితి ఏర్పడింది.

అమెరికా, యూకే వంటిదేశాల్లో వలసలకు వ్యతిరేకంగా గడచిన కొన్ని రోజులుగా పెరుగుతున్న నిరసనలు భారతీయ సమాజాన్ని ఆందోళనపరుస్తున్నాయని అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. నిజానికి వలస వాదాన్ని స్వాగతించే దేశాలుగా ప్రసిద్ధికెక్కిన ఈ దేశాలు ఇప్పుడు సంక్షుభిత రాజకీయ వాతావరణంలో అల్లకల్లోలంగా మారాయని చెప్పక తప్పదు. ఈ నిరసనల వెనుక ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ భయాలు ముడిపడి ఉన్నాయి. సమస్య ఏదైనప్పటికీ భారతీయ వలసదారుల మీద విద్వేషపూరిత దాడులకు ఇవి కారణం అవుతున్నాయి.

ఇంత నిరసన దేనికి?

నిరసనలకు ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది ఆర్థిక పరమైన అభద్రతలు. పాశ్చాత్య దేశాల్లో ద్రవ్యోల్బణం తన ప్రభావాన్ని మునుపటికంటే ఎక్కువే చూపుతోందని అనుకోవచ్చు. ఫలితంగా ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమవుతోంది. కొంత మంది స్థానికుల్లో ఇందుకు కారణం వలసదారులేననే భావన ఉంది. వలదారుల వల్ల తమకు తగిన వేతనాలతో ఉద్యోగాలు దొరకడం లేదని స్థానికుల్లో చాలా బలంగా భావించేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రజల్లో ఏర్పడిన ఈ అభద్రతను కొంత మంది రాజకీయ నాయకులు సైతం వాడుకుంటున్నారు. యూకేలో చట్ట విరుద్ధ వలసదారులను నియంత్రించాలనే నినాదం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇది కాస్త ముదిరి చట్టబద్ధంగా వలస వచ్చిన వారి మీద ముఖ్యంగా భారతీయులు, ఇతర ఆసియా దేశాల వారి మీద కూడా ఎక్కువ ప్రబావాన్నే చూపుతున్నాయి.

ఆర్థిక కారణాలు మాత్రమే కాదు

ఆర్థిక సంక్షోభాలు ఒకవైపు భయపెడుతుండగా మరోవైపు సాంస్కృతిక అభద్రత కూడా ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయింది. వలస వచ్చిన ఇతర దేశాల సంస్కృతులు తమ స్థానిక సంస్కృతిని కనుమరుగయ్యేంతగా ప్రభావితం చేస్తున్నాయని కొంత మంది స్థానిక పౌరులు భావిస్తున్నారు. ఇది వలసదారుల మీద తీవ్రమైన ద్వేషానికి ముఖ్యమైన కారణంగా చెప్పటానికి అనుమానం అవసరం లేదు. అందుకే మా దేశాన్ని మాకిచ్చెయ్యండి అనే నినాదం లండన్ వీధుల్లో చాలా ప్రధానంగా వినిపించింది. ఇదొక రకమైన జాతీయవాద భావనగా ప్రతిబింబిస్తోంది. ముఖ్యంగా చాలా బలమైన సాంస్కృతిక అస్తిత్వం కలిగిన భారతీయులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని చెప్పటంలో అతిశయోక్తి ఏమీ లేదు. భారతీయులు, ఇతర ఆసియా దేశ వలసదారుల మీదే ఈ సాంస్కృతిక విధ్వేషం కనిపిస్తోంది.

మనవాళ్లూ కారణమే

ఏ దేశ వాసులైనా సరే తమ సంస్కృతి తమకు గొప్పదిగానే భావిస్తారు. అందుకే పాటిస్తుంటారు. అలాగే ప్రతీ సంస్కృతిలోనూ, నాగరికతలోనూ తప్పకుండా కొద్దిపాటి లోపాలు, సంకుచితాలు ఉంటూనే ఉంటాయని చెప్పక తప్పదు. ఏదేశమేగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని చెప్పారు కానీ మీ సంస్కృతి లోని హేయమైన రూపాన్ని సైతం అక్కడ వ్యాప్తి చెయ్యమని చెప్పలేదుగా. అవి కాస్త సవరించుకోవాల్సింది పోయి, అక్కడ నివసిస్తున్న మన తెలుగు వాళ్లు చెయ్యని ఆగడం లేదు. దేశం కాని దేశంలో నివసిస్తున్న వారు సైతం ప్రాంతీయ వివక్షలు, కుల వివక్షలు, హద్దు మీరిన ఫ్యానిజం వంటివన్ని అక్కడ కూడా వ్యాపింపజేస్తున్నారు. ఉదాహరణకు మొన్నీమధ్యే ఎన్టీఆర్ సినిమా విడుదల సందర్భంలో డల్లాస్ లోని సినిమా థియేటర్ లో డల్లాస్ గడ్డ, ఎన్టీఆర్ అడ్డా అనే నినాదాలు చేస్తున్న ఫ్యాన్స్ కనిపించారు. మరి వారు కేవలం సినిమా విడుదల సందర్భంగా అమెరికా వెళ్లిన టూరిస్టు అభిమానులా? లేక ప్రవాసులో? తెలియలేదు కానీ ఇది జరిగింది మాత్రం డల్లాస్ లోనే. ఇలాంటివి జరిగినపుడు స్థానిక పౌరుడికి తప్పక అనిపిస్తుంది కదా ఎవరీ ఎన్టీఆర్ అతడిదెందుకు అవుతుంది ఈ డల్లాస్ గడ్డ? అని. కేవలం సనిమాలు మాత్రమే కాదు పండుగల సందర్భంగా చేసే ఊరేగింపులు, విగ్రహాల నిమజ్జనాల వంటివి వారి పర్యావరణానికి హాని చేస్తున్నాయని ఈ మధ్య సోషల్ మీడియా వేదికల్లో వాపోతున్న పాశ్చాత్యుల సంఖ్య పెరిగిపోతోంది.

మన సంస్కృతిని కాపాడుకోవడంలో తప్పు లేదు కానీ ఇతరులను అభద్రతకు గురిచెయ్యడం అది కూడా స్థానిక పౌరులకు అలాంటి భావన కలిగించడం కూచున్న కొమ్మను నరుక్కోవడమే అవుతుంది. కుల విద్వేశాలు, ప్రాంతీయ విద్వేశాలు, భారతదేశంలోని రాజకీయా విద్వేశాలను విదేశాల వరకు మోసుకుపోవడం మన వాళ్లు చేస్తున్న అతి పెద్ద పొరపాటు. పొరపాటు మాత్రమే అంటే సరిపోదేమో ఇప్పుడు అది పొరపాటు స్థాయి దాటిపోయిందనే చెప్పాలి. పైన ఉదహరించినటువంటి చెదురు మొదురు సంఘటనల ప్రభావం కొందరి మీద తీవ్రంగానే ఉంటోంది. యూకేలో ఈ నిరసనలు అందుకే మిన్నంటాయి. ఇటీవల లండన్ వీధుల్లో నిరసనకారుల భారీ ర్యాలీలో చేసని నినాదాలు పడవలను ఆపాలని, వారందరిని వెనక్కి పంపాలనేవే ప్రధానంగా వినిపించాయి.

ఇక్కడ ఆందోళన పడాల్సిన విషయం ఏమిటంటే ఈ నిరసనలు, వీటి వెనుకున్న విద్వేషం కొంత మంది ఆవేశపూరిత నిరసనకారులు దాడులకు తెగబడేలా చేస్తున్నాయి. ఇటీవల బ్రిటన్ లో భారతీయ మూలాలున్న సిక్కు మహిళ మీద స్థానికి యువకులు అత్యాచారం చేసి నీ దేశానికి నువ్వు తిరిగి వెళ్లు అని బెదిరించిన సంఘటన ప్రవాస భారతీయ సమాజాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఇది యూకేలో చట్టబద్ధంగా నివసిస్తున్న భారతీయుల భద్రతను ప్రశ్నార్థకం చేసిందని చెప్పక తప్పదు. ఇప్పటికే చాలా మంది విద్యార్థుల స్టడీ విసాలను కెనెడా తిరస్కరిస్తోంది. ఆస్ట్రేలియాలోనూ ఈ భావన నెమ్మదిగా పెరుగుతోంది.

అమెరికాలోనూ

అమెరికాలో కూడా ట్రంప్ విజయం తర్వాత వలస వ్యతిరేక భావనలు బహిర్గతమవుతున్నాయి. పాండమిక్ తర్వాత ఆర్థిక సమస్యలు పెరిగిపోవడంతో ఈ ధోరణి పెరిగిపోయింది. చట్ట విరుద్ధ వలసదారులపై విమర్శలు బాగా పెరిగిపోయాయి. ప్రత్యక్షంగా భారతీయులు లక్ష్యంగా సాగకపోయినప్పటికీ వలసలకు వ్యతిరేకంగా పెరుగుతున్న నిరసనల రాజకీయ వాతావరణం, భారతీయ అమెరికన్లపైనా, ప్రత్యేకంగా ఇమిగ్రేషన్ స్టెటస్ కోసం ప్రయత్నిస్తున్న వారిపైనా ప్రతికూల ప్రభావాలను చూపుతోంది.

పశ్చిమ దేశాల్లో పెరుగుతున్న ఈ వలస వ్యతిరేక నిరసనలు భారత పౌర సమాజానికి కాస్త ఆందోళన కలిగించే అంశమనే చెప్పాలి. వీటి వెనుకున్న ఆర్థిక, సాంస్కృతిక భయలు విద్వేషదాడులకు కారణం అవుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి నిరసనకారుల భయాలను అర్థం చేసుకోవడం అవసరం. అంతేకాదు అక్కడి ప్రభుత్వాలు వలసదారుల సహకారాన్ని గురించి సామన్య ప్రజలకు అర్థం అయ్యే రీతిలో ప్రచారం కల్పించడం చాలా అవసరం. దేశాల మధ్య సహకారానికి, దౌత్యానికి సహృద్భావ వాతావరణం ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడం కూడా అవసరం. లేకపోతే ఈ నిరసన దేశపు వైవిద్యాన్ని నాశనం చేసి సమాజం మరింత చీలి పొయ్యెందుకు కారణం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా విద్వేశ పూరిత వాతావరణం ఏర్పడడం మానవాళి మనుగడకు, మానవతకు అంత మంచిది కాదని చెప్పక తప్పదు.

పశ్చిమాన పెరుగుతున్నవిధ్వంసం - Tholi Paluku