Let's talk: editor@tmv.in
పీవీ సింధు శుభారంభం

పీవీ సింధు శుభారంభం

Shaik Mohammad Shaffee
17 సెప్టెంబర్, 2025

భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో ఆమె డెన్మార్క్కు చెందిన డవాల్ జాకబ్సెన్ను ఓడించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది.

సింధు సునాయాస విజయం

ఈ ఏడాది సింధు ప్రదర్శన అంతగా ఆశాజనకంగా లేదు. ఈ సంవత్సరం ఆమె ఆరు టోర్నీలలో తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో చైనా ఓపెన్లో ఆమె ప్రదర్శన ఎంతో కీలకం కానుంది. ఈ మ్యాచ్లో సింధు అద్భుతమైన ఫామ్ను కనబరిచింది. ఆమె కేవలం 27 నిమిషాల్లోనే 21-5, 21-10 తేడాతో జాకబ్సెన్ను సునాయాసంగా ఓడించింది. తొలి గేమ్లో సింధు కేవలం 10 నిమిషాల్లోనే భారీ ఆధిక్యాన్ని సాధించింది.

రెండో గేమ్లో కూడా ఇదే దూకుడును కొనసాగించి 17 నిమిషాల్లోనే గేమ్ను ముగించింది. ఈ గెలుపుతో సింధు జాకబ్సెన్పై మూడోసారి విజయం సాధించింది. 2016లో చైనా ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న సింధు, ఈసారి కూడా అదే అద్భుతాన్ని పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఆమెకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే ఇండియా ఓపెన్, బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్లలో క్వార్టర్ ఫైనల్కు చేరుకోవడమే.

ఆయుష్ శెట్టికి నిరాశ

మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టికి నిరాశ ఎదురైంది. ఆరో సీడ్, చైనీస్ తైపీ ఆటగాడు చౌ టియెన్ చెన్తో జరిగిన హోరాహోరీ పోరులో ఆయుష్ తొలి రౌండ్లోనే 19-21, 21-12, 16-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. ఆయుష్ చివరి వరకు పోరాడి మ్యాచ్ను మూడో గేమ్కు తీసుకెళ్లినా, విజయాన్ని అందుకోలేకపోయాడు. ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్లో టైటిల్ గెలిచిన ఏకైక భారత క్రీడాకారుడు ఆయుష్ శెట్టి. ఈయన జూన్లో జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్స్లో కెనడాకు చెందిన బ్రియాన్ యాంగ్ను ఓడించి విజేతగా నిలిచాడు. కాగా సెప్టెంబర్ 16న ప్రారంభమైన ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 21 వరకు కొనసాగనుంది.

పీవీ సింధు శుభారంభం - Tholi Paluku