
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టుకు రూ. 35.19 కోట్లు కేటాయింపు: కేంద్రమంత్రి బండి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. కొండగట్టులో భక్తుల వసతి కోసం 96 గదుల సత్రం నిర్మించేందుకు రూ. 35.19 కోట్లు కేటాయించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి తన ఎక్స్ వేదిక ద్వారా ఈ సత్రం నిర్మాణంతో కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులకు వసతి సమస్య తీరడమే కాకుండా, దర్శన అనుభవం మరింత సౌకర్యవంతంగా మారుతుందని తెలిపారు. కొండగట్టు ఆలయం తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటని, ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఇక్కడకు వస్తారని బండి సంజయ్ గుర్తుచేశారు. అలాంటి ఆలయానికి కనీస వసతి, సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. కొండగట్టు అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన బీఆర్ఎస్, ఆ మాటను అమలు చేయకుండా చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదన్నారు.
అదేవిధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, ఆర్జిత సేవల ఛార్జీలను పెంచి భక్తులపై అదనపు భారం మోపిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి తక్షణమే తగిన నిధులు కేటాయించి, వసతి, రవాణా, పారిశుధ్యం వంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, టీటీడీ సహకారంతో చేపట్టిన ఈ సత్రం నిర్మాణం కొండగట్టు అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
