Let's talk: editor@tmv.in
పవన్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ

పవన్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ

FL - SUNL
29 సెప్టెంబర్, 2025

వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు యోగక్షేమాలు ఆరా తీశారు. ఆయనతో మాట్లాడి.. ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. పవన్‌కు చంద్రబాబు ధైర్యం చెప్పారు. ప్రస్తుతం జ్వరం తీవ్రత లేదని, దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తోందని తెలిపారు. పరీక్షలు చేసి క్రానిక్ బ్రాంకైటిస్ మూలంగా దగ్గు ఎక్కువగా వస్తోందని, ఫలితంగానే గొంతు దగ్గర నొప్పి కూడా ఉందని వైద్యులు చెప్పినట్లు వివరించారు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.ఐదు రోజులుగా పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అందుకే మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ, అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరు కాలేదు. తొలుత మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలోనే వైద్య సేవలు పొందిన పవన్, అయినా జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్ వచ్చి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అందులో భాగంగా, తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జ్వరంతోనే ఇటీవల ఏపీ అసెంబ్లీకి, తన శాఖలపై సమీక్షలు చేశారు.

అసెంబ్లీ పరిణామాలపై ఆరా

ఇటీవల అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై పవన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అనవసరంగా చిరంజీవి ప్రస్తావన తీసుకురావడం, దానిపై బాలకృష్ణ స్పందించడం, కూటమి వర్సెస్ వైసీపీగా చర్చ జరగడంపై మాట్లాడుకున్నట్లు సమాచారం. త్వరితగతిన కోలుకుని ఏపీకి రావాలని, రాబోయే రోజుల్లో ప్రభుత్వం తరఫున పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే పవన్ కళ్యాణ్ మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి ఒకేసారి 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రస్తావించారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నియామకపత్రాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహించి యువతలో మనోధైర్యాన్ని, స్ఫూర్తిని నింపారని ముఖ్యమంత్రివర్యులకు కృతఙ్ఞతలు తెలిపారు.

అక్టోబర్ 4వ తేదీన 'ఆటో డ్రైవర్ల సేవలో...' కార్యక్రమంపై చర్చించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని విజయవంతంగా అమలు చేయగలిగామని, తద్వారా మహిళలకు ఆర్థికపరమైన వెసులుబాటు కలుగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకం మూలంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు చొప్పున ఆర్థిక భరోసాను కల్పించే దిశగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని, 4 వ తేదీన విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్ల కోసం ఆలోచన చేసిన, చేపట్టిన ఈ పథకం కూడా కచ్చితంగా అందరి మన్ననలు పొందుతుందనే విశ్వాసాన్ని ఉప ముఖ్యమంత్రి వ్యక్తపరిచారు. అక్టోబర్ 16న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయడంపై చర్చించుకున్నారు. జి.ఎస్.టి. సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు చేపడుతున్న రోడ్ షో నిర్వహణ, అందుకు సంబంధించిన ప్రణాళికల ప్రస్తావన వచ్చింది.

పవన్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ - Tholi Paluku