
పెళ్ళిళ్ళు.. భజంత్రీలు..
అనూహ్య కెనడాలో ఉద్యోగం చెస్తోంది. తల్లిదండ్రులు ఇక్కడ ఒక పెద్దింటి సంబంధం చూశారు. వధూవరులిద్దరు స్కైప్ లో మాట్లాడుకున్నారు. రెండు కుటుంబాలు సరే అనుకున్నారు పెళ్లి జరిగింది. పెళ్లైన నెల రోజుల తర్వాత ఆమె తిరిగి కెనడా వెళ్లిపోవాలనుకుంది. అత్తింటి వారు అలా కుదరదు అన్నారు... అంతే ఆమె విడాకులు కావాలనుకుంది. కొత్తగా పెళ్లయి జంట కాలక్షేపం కబుర్లలో కాలేజి ముచ్చట్లు వచ్చాయి. ఆమె తనకు కాలేజి రోజుల్లో ఉన్న చిన్న అఫైర్ గురించి చెప్పింది. అతడికి అది నచ్చలేదు. చినికి చినికి ఆ జంట నెల రోజుల్లోపే ఒకరిని ఒకరు వద్దనుకున్నారు... విడిపోవడానికి సిద్ధపడ్డారు.
విశాలకు పెళ్లికి పుట్టింటి వాళ్లు కిలో బంగారం పెట్టారు. పెళ్లయిన తర్వాత అత్తింటి వారు లాకర్ లో దాచేశారు. అలా ఎందుకు నా నగలు నా దగ్గరే ఉండాలని విశాల భావించింది. అదే మాట అనేసింది కూడా. అంతే ఆ ఇంట్లో యుధ్ధమే జరిగింది. ఆ అమ్మాయి ఇక ఆఇంట్లో తాను ఉండలేనని వెళ్లిపోయొంది. పెళ్లి అంటే పందిళ్లు, సందళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడు ముళ్లు, ఆరడుగులు మొత్తం కలిపి నూరేళ్లు అని చెప్పారు ఓ కవి. అది ఒకప్పటి మాట.
పెళ్లంటే నూరేళ్ల పంటా? నూరేళ్ల భాగస్వామ్యమా?
ఇలా పెళ్లి ఒక ప్రశ్నగా మారి పోయంది ఈ రోజుల్లో. భారతీయ సమాజపు ముఖచిత్రం అనూహ్య రీతిలో మారిపోయింది. గత దశాబ్ధ కాలంగా మన సమాజంలో కూడా విడిపోతున్న జంటల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఆశ్చర్యకరంగా కొత్త జంటలు పెళ్లై సంవత్సరమైనా గడవక ముందే విడిపోయ్యేందుకు సిద్ధ పడుతున్నారు. ఎందుకు?ఎందుకు పెళ్లిళ్లు అంత్య నిష్ఠూరాలు అవుతున్నాయి. అందుకు ఎలాంటి పరిస్థితులు దారి తీస్తున్నాయి? ఈ ప్రశ్నలన్నీ నేటి సామాజికవేత్తలను ఆలోచనలో పడేస్తున్నాయి. అందుకు నిపుణులు సూచిస్తున్న పరిష్కారం ఆది నిష్టూరం. దీన్నే మనం ఇంకో మాటలో చెప్పుకోవచ్చు. అదే ప్రి మ్యారిటల్ కౌన్సెలింగ్.
పెళ్లి ప్రతి వారి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. జీవితానికి ప్రధాన మలుపు. కానీ ఊహలో ఉన్నంత అందంగా వైవాహిక జీవితం ఉండకపోవచ్చు. కొన్ని సార్లు పూర్తి భిన్నంగానూ ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో ఒక్కోసారి ఆ వివాహం విఫలమై జంట విడిపోనూవచ్చు. ఇది వాస్తవానికి పెళ్లి సినారియో. కానీ రోజులు మారాయి. సమాజిక స్థితి గతులు మారిపోయాయి. ఇప్పుడు విడిపోతున్న జంటల సంఖ్య గణనీయంగా పెరిగి పోతోంది. గత పది సంవత్సరాలుగా విడాకుల సంఖ్య చాలా పెరిగిందని న్యాయ నిపుణులు అంటున్నారు. కారణాలను విశ్లేషిస్తే పరిష్కారం సూచించడం సులువవుతుంది.
మారిన స్థితిగతులు
ఇది వరకు పెళ్లి జరిగింది అంటే ఇక ఈ జన్మకు ఇంతే అనే భావానలో ఉండేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థతి లేదు. ఏ కాస్త నచ్చకపోయినా లేక అనుకున్నట్టు లేకపోయినా విడిపోవడానికి సిద్ధ పడుతున్నారు. ఇంతకు ముందు మధ్య తరగతి సమాజంలో విడాకులు చాలా పెద్ద విషయంగా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో విడాకులను అంత సీరియస్ గా పరిగణించడం లేదు. విడాకులు, రెండో వివాహం అనేవి చాలా చిన్న విషయాలుగా మారిపోయాయి. అందుకు కేవలం దంపతుల ఆలోచనా విధానం మాత్రమే కాదు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు సర్దుకుపోవాల్సిన అవసరాన్ని గురించి పెద్దగా చర్చించకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు సామాజిక విశ్లేషకులు. అంత సర్దుకుని బతకాల్సిన అవసరం తమ పిల్లలకు అవసరం లేదనే ధోరణి బాగా పెరిగిపోయింది.
పెరిగిన స్త్రీ సాధికారత
ఈ కాలంలో అమ్మాయిలు చాలా సాధిస్తున్నారు. అన్ని రంగాల్లో ముందుంటున్నారు. సర్వస్వతంత్రులుగా ఉంటున్నారు. కుటుంబ బాధ్యత తీసుకోవడంలో కూడా వెనుకాడడం లేదు. అందువల్ల అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అది చాలా ఆనందించాల్సిన విషయం. అయితే అమ్మాయిల్లో వేగంగా పెరిగిన ఆత్మవిశ్వాసం ఆమె ఆలోచనా ధోరణి మీద చాలా ప్రభావాన్ని చూపుతోంది. ఈ వేగానికి తగిన రీతిలో అబ్బాయిల మూస ధోరణి మారకపోవడం మరొక కారణం. భార్యను సరిసమానంగా చూడగలిగే విశాలత్వం కొంత మంది పురుషుల్లో కొరవడుతోంది. ఇది ఇద్దరి మధ్య దూరానికి కారణం అయ్యేందుకు హేతువు అవుతోంది.
కట్న కానుకలు
పెళ్లన్న తర్వాత కట్న కానుకలు, ఇచ్చిపుచ్చుకోవడాలు తప్పనిసరిగా జరిగేవే. అయితే వీటిలో పారదర్శకత లోపించడం ఒక్కోసారి విడాకులకు దారితీస్తుంది. ఈ విషయాల్లో పెద్దల మధ్య వచ్చే విబేధాలు పిల్లల కుటుంబ జీవితంలో కుంపటి రాజేస్తున్నాయి. ఇవే కాకుండా పెరిగిన కమ్యునికేషన్ కూడా కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది. పెళ్లికి ముందున్న సంబంధాలు, లేదా పెళ్లి తర్వాత కొనసాగుతున్న సంబంధాలు పెళ్లిళ్ల విచ్చిన్నానికి కారణం అవుతున్నాయి. ఇది వరకు రోజుల్లో అనుమానాల స్థాయిలో ఉండే అక్రమ సంబంధాలు కమ్యూనికేషన్ సాధానాల పుణ్యాన రుజువులుగా రూపాంతరం చెంది తిరిగి కులుసుకునేందుకు వీలులేని రీతిలో దంపతుల మధ్య చిచ్చు పెడుతున్నాయి.
విడాకులు ఒక విపత్తు
స్త్రీ పురుషులిద్దరి జీవితాల్లో విడాకులు తెచ్చిపెట్టే బాధ చాలా భయంకరమైనది. దీని నుంచి బయట పడడానికి చాలా సమయం పడుతుంది. పిల్లలున్న జంట విడిపోతే అది మరింత దయనీయమైన స్థితి. విడిపోతున్నదంపతులకు ఎలాగూ తప్పదు, కానీ అభం శుభం తెలియని పిల్లలు ఈ మొత్తం ప్రహసనంలో బాగా నలిగిపోతారు. వారి మానసిక, సామాజిక, ఆర్థిక స్థితి గతుల మీద తల్లిదండ్రుల విడాకులు ఒక విపత్తుగా పరిణమిస్తాయి. ఇలా పెళ్లిళ్లు విచ్చిన్నం కాకుండా ఉండాలంటే పెళ్లికి ముందే ఒక అవగాహనకు రావడం చాలా ముఖ్యం. అటువంటి అవగాహన కలిగించేదే పెళ్లికంటే ముందే తీసుకునే కౌన్సెలింగ్. దీనినే మనం ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ గా అభివర్ణిస్తున్నాం. ఇలాంటి కౌన్సెలింగ్ ప్రస్తుత సమాజానికి చాలా అవసరం. ఈ మాట తరచుగా వినిపిస్తున్నప్పటికీ ఇంకా పెద్దగా ఆచరణలోకి, అవగాహనలోకి రాలేదు.
ఈ కౌన్సెలింగ్ లో ఏముంటుంది?
ఇంతకు ముందు పెళ్లిళ్లు తెలిసిన కుటుంబాల మధ్య ఎవరో ఒకరు మధ్య వర్తిగా ఉండి కుదుర్చుకునే వారు. ఇప్పుడు అలా మధ్య వర్తిత్త్వం వహించే బాధ్యత మ్యాట్రీమోనియల్ సైట్లు, కంపెనీలు తీసుకుంటున్నాయి. ఇక్కడ అటు పెళ్లి కుదిర్చే సంస్థకూ ఈ కుటుంబాల గురించిన అవగాహన ఉంటుంన్న గ్యారెంటీ లేదు. ఇక వధూవరుల కుటుంబాలు పూర్తిగా అపరిచిత కుటుంబాలుగా ఉంటాయి. అందువల్ల పూర్తిగా పరిచయం లేని రెండు కుటుంబాల మధ్య సంబంధాలు కుదరడం వల్ల ఆచార వ్యవహారలు, ఇతర ఇచ్చి పుచ్చుకునే విషయాల గురించిన చర్చ పూర్తిగా జరగకపోతే అది రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలకు కారణం కావచ్చు. పెళ్లి కుదుర్చుకున్న తర్వాత రెండు కుటుంబాల సభ్యులు ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ కు సిధ్దపడితే మధ్యవర్తి చేసే పని ఇక్కడ నిపుణులు చేస్తారు.
పెద్దలు ఎప్పుడో చెప్పారు అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు అని. ఇద్దరి మధ్య పెళ్లికి ముందే స్నేహం ఉండే ప్రేమ వివాహాల్లోనూ పెళ్లికి సిద్ధపడే సమయాల్లో తప్పనిసరిగా ఇలాంటి కౌన్సెలింగ్ ఒకటి తీసుకుంటే బావుంటుంది. మ్యాట్రీమోనిల ద్వారా, లేదా ఇతర పరిచయస్తుల ద్వారా పెళ్లికి సిద్ధ పడే కుటుంబాలు పెళ్లికి ముందే కౌన్సెలింగ్ తీసుకోవడం ఎంతో మంచిది. లక్షలు, కోట్లు ఖర్చు చేసి చేసే పెళ్లి మీద పెట్టే శ్రద్ధలో పెళ్లి తర్వాత మొదలయ్యే పండంటి జీవితం మీద కాస్త పెడితే తప్పులేదేమో కదా.
నిజాలు తెలుసుకోవాలి
సంబంధం కుదుర్చుకోవాలని అనుకుంటున్నాం, ఇలాంటి ప్రశ్నలు అడగడం వల్ల అవతలి వాళ్లు నొచ్చుకుంటారేమో అనే మొహమాటం కొద్ది చాలా సందర్భాల్లో ఎన్నో విషయాల్లో పెళ్లికి ముందు ఒక నిశ్చిత అభిప్రాయం ఏర్పరుచుకోవడం సాధ్యపడదు. కానీ అలా ఏర్పరుచుకోవాలంటే ముందు అన్ని విషయాల్లో పారదర్శకత అవసరం ఉంటుంది. నేరుగా మాట్లడలేని విషయాలను కౌన్సెలర్ ద్వారా అడిగించడం వల్ల సంబంధాలు కుదుర్చుకునే ముందే అన్ని విషయాలు చర్చించవచ్చు. ఇది వరకు వంద అబద్ధాలడయినా సరే ఒక పెళ్లి చెయ్యాలని అనేవారు. కానీ ఇప్పడు అది చెల్లదు. పెళ్లి నూరేళ్లు సజావుగా ఉండాలంటే ఒక్క అబద్ధం కూడా ఆడకూడదు. ఒక్క అబద్ధం చెప్పినా అది ఆ వివాహ విచ్ఛిన్నానికి దారి తియ్యవచ్చు. అందుకే పెళ్లికి ముందే వధూవరులతో పాటు ఇరువైపుల పెద్దలను కూర్చోబెట్టి విడివిడిగా మాట్లాడి తర్వాత అందరికి కలిపి కూడా ఒక సెషన్ ఉంటుంది. ఒక పెళ్లి జరిపించడానికి ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ లో భాగంగా కనీసం 5 నుంచి 7 సెషన్లు అవసరం అవుతాయి.
ఇందులో భాగంగా వధూ వరుల వ్యక్తిగత, వృత్తిగత, ఆర్థిక కుటుంబ అంశాలన్నింటిని చర్చిస్తారు. అంతేకాదు పెళ్లిలో ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో, ఆర్థిక లావాదేవీలలో స్థిరచరాస్తులు వాటి కస్టడీ వంటి అన్ని అంశాల గురించి పక్కగా ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా చేసి నిర్ణయించేందుకు అవకాశం ఉంటుంది. పెళ్లి తర్వాత పొరపొచ్చాలకు తావు ఉండదు. అంతేకాదు భవిష్యత్తులో ఎప్పుడైనా విడిపోవాల్సిన అగత్యం ఏర్పడితే ఎలాంటి నిబంధనల ప్రకారం విడిపోవాలో కూడా ఒక మాట అనుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమయంలోనే చట్టపరమైన అంశాలు కూడా చర్చకు వస్తాయి. కాబట్టి అన్ని అంశాల మీద ఒక అవగాహనతో రెండు కుటుంబాలు జంటను ఏకం చేస్తాయి. అందువల్ల చిన్న చిన్న కారణాలతో విడిపోయ్యే జంటల సంఖ్యను తగ్గించేందుకు అవకాశాలు ఎక్కువ.
ప్రీమారిటల్ కౌన్సెలింగ్ లో నిపుణులు ప్యానెల్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒక సైకాలజిస్ట్, ఒక న్యాయవాది, ఒక డాక్టర్ ఉండాల్సి ఉంటుంది. వీరు వధూవరుల కుటుంబాల పూర్తి వివరాల గురించి చర్చించి డాక్యుమెంట్ చేసి అందిస్తారు. ఇరు కుటుంబాలకు ఆమోద యోగ్యమైన నియమనిబంధనలతో పెళ్లి జరిపించేందుకు కావల్సిన అవకాశం ఏర్పడుతుంది.
