Let's talk: editor@tmv.in
పెళ్లి పేరుతో ఎస్ఐ మోసం

పెళ్లి పేరుతో ఎస్ఐ మోసం

Panthagani Anusha
26 సెప్టెంబర్, 2025

ప్రజల రక్షణ బాధ్యతను మోయాల్సిన ఒక పోలీస్ అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాక, వివాహం చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఒక మహిళ జీవితాన్ని నాశనం చేశాడు. ఈ సంచలన ఘటనలో అత్యాచారం, బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలపై ఒక పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పై కేసు నమోదైంది.

అధికారుల సమాచారం ప్రకారం ఘాజీపూర్ జిల్లాకు చెందిన సుజిత్ కుమార్ యాదవ్ అనే ఎస్‌ఐ 2024 నుంచి ప్రతాప్‌గఢ్ జిల్లాలోని కోహందౌర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. విద్యార్థి దశలోనే ఝాన్సీ జిల్లాకు చెందిన ఒక యువతితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆ పరిచయం క్రమంగా వ్యక్తిగత సంబంధంగా మారడంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో బాధితురాలు స్థానిక పోలీస్టేషన్ ఫిర్యాదు చేసింది.

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పెళ్లి చేసుకుంటానని నమ్మించి సుజీత్ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, కోహందౌర్ ప్రాంతంలోని ఒక అద్దె ఇంట్లో ఉంచి హింసించేవాడని, చివరికి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి తనను మౌనంగా ఉండమని బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సంబంధిత అధికారిని సస్పెండ్ చేశారు. అయితే కేసు నమోదైన వెంటనే సుజిత్ కుమార్ పరారయ్యాడని సుజిత్ ని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు కసరత్తు చేస్తున్నాయని డీఎస్పీ ప్రశాంత్ రాజ్ తెలిపారు. ఇక ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన అధికారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

పెళ్లి పేరుతో ఎస్ఐ మోసం - Tholi Paluku