
పల్లె బాట పట్టిన భాగ్యనగరం: హైదరాబాద్–విజయవాడ రహదారిపై వాహనాల వెల్లువ
సంక్రాంతి పండుగకు స్వగ్రామాల బాట పట్టిన ప్రజలతో హైదరాబాద్,విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో నిండిపోయింది. రహదారిపై సాగుతున్న నిరంతర వాహన ప్రవాహాన్ని చూస్తే భాగ్యనగరం ఖాళీ అవుతోందన్న భావన కలుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు కుటుంబాలతో కలిసి స్వస్థలాలకు వెళ్లడంతో ఈ రద్దీ ఏర్పడింది. రానున్న నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని ట్రాఫిక్, జాతీయ రహదారి అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. కేవలం కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో వాహనాలు విజయవాడ దిశగా కదిలాయి. గంటకు సగటున 2,500 నుంచి 2,700 వాహనాలు జాతీయ రహదారిపైకి వచ్చాయని టోల్‌ప్లాజా సిబ్బంది తెలిపారు. సాధారణ రోజుల్లో రోజంతా కలిపి రెండు వైపులా దాదాపు 40 వేల వాహనాలే ప్రయాణిస్తే, సంక్రాంతి వేళ ఆ సంఖ్య ఒక్కసారిగా రెట్టింపుకు చేరింది.
జాతీయ రహదారి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఒక్కరోజే పంతంగి టోల్‌ప్లాజా గుండా 70 వేలకుపైగా వాహనాలు వెళ్లాయి. అదేవిదంగా విజయవాడ సమీపంలోని కీసర టోల్‌ప్లాజా వద్ద గత 24 గంటల్లో సుమారు 55 వేల వాహనాలు నమోదయ్యాయి. అయితే ఆదివారం రోజు ఉదయం నుంచే రద్దీ కొనసాగుతుండటంతో రాత్రి వరకు పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మరోవైపు వాహనాల రద్దీ కారణంగా పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ నెమ్మదిగా సాగడంతో అధికారులు తక్షణమే అదనపు టోల్ బూత్‌లను తెరిచారు. ఫాస్ట్‌ట్యాగ్ స్కానింగ్ వేగంగా పూర్తయ్యేలా ప్రత్యేక సిబ్బందిని నియమించారు. దీనికితోడు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద గస్తీ వాహనాలు, క్రేన్లు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు.
గతేడాది సంక్రాంతి సమయంలో ఏర్పడిన తీవ్ర ట్రాఫిక్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పోలీసులు ముందుగానే కార్యాచరణ రూపొందించారు. చిట్యాల పరిధిలో రహదారి విస్తరణ, మరమ్మతు పనులు జరుగుతున్న ప్రాంతంలో వాహనాలు నిలిచిపోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ వంటి ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే వాహనాలను సూర్యాపేట మండలం టేకుమట్ల నుంచి సూర్యాపేట,ఖమ్మం 365 బీబీ జాతీయ రహదారి వైపు మళ్లిస్తున్నారు.
ఇక సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, డీఎస్పీ ప్రసన్నకుమార్ డ్రోన్ కెమెరాల సహాయంతో జాతీయ రహదారిపై వాహనాల వేగం, రద్దీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులకు భరోసా కల్పిస్తూ సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కొందరు వాహనదారులకు గులాబీ పువ్వులు అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇక హైదరాబాద్ నుంచి ఏపీ వైపు భారీగా వాహనాలు రావడంతో ఎన్‌టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో కూడా ట్రాఫిక్ మందగించింది. ముఖ్యంగా వై-జంక్షన్ వద్ద కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులు వాహనాల కదలికపై ప్రభావం చూపడంతో కొంతసేపు వాహనాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్‌లో భోగి, మకర సంక్రాంతి, కనుమగా మూడు రోజుల పాటు సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ పండుగకు స్వగ్రామాలకు వెళ్లేవారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కనుమ రోజు వరకు రద్దీ కొనసాగే సూచనలు ఉన్నాయని, పండుగ అనంతరం జనవరి 18 ప్రాంతంలో ప్రజలు తిరిగి నగరాల బాట పట్టే సమయంలో మరోసారి రహదారులపై భారీ ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా సంక్రాంతి వేళ గోదావరి జిల్లాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అక్కడ సంప్రదాయ ఉత్సవాల్లో భాగంగా జరిగే కోడి పందాలు, గ్రామీణ సంబరాలు ప్రజలను ఆకర్షించడంతో ఆ ప్రాంతాలకు వెళ్లే వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. దీని ప్రభావం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లే మార్గాలపైనా స్పష్టంగా కనిపిస్తోంది.
మొత్తంగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో నిండిపోగా, ప్రయాణికులు సహనం పాటిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలను నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలని అధికారులు సూచిస్తున్నారు.
