Let's talk: editor@tmv.in
పల్లె ప్రగతికి సీఎం రేవంత్ ప్రత్యేక నిధులు

పల్లె ప్రగతికి సీఎం రేవంత్ ప్రత్యేక నిధులు

Gaddamidi Naveen
25 డిసెంబర్, 2025

తెలంగాణ రాష్ట్రంలోని 12,706 గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నూతన సంవత్సర కానుకగా శుభవార్తను అందించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద అదనపు నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. మేజర్ గ్రామ పంచాయతీలకు ఒక్కోటి రూ.10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షల చొప్పున నిధులు అందజేస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇప్పటికే వచ్చే నిధులకు ఇవి అదనపు, నూతన సంవత్సరంలోనే ఈ ప్రత్యేక నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్ల కోసం కోస్గీ కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన ప్రజాప్రతినిధులను సత్కరించి అభినందనలు తెలిపారు. అనంత‌రం సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వం సర్పంచులకు అండగా ఉంటాం. మార్చి 31 లోపు గ్రామ పంచాయతీలకు రావాల్సిన రూ.3 వేల కోట్ల నిధులను విడుదల చేసే బాధ్యతను తానే తీసుకుంటానని భరోసా ఇచ్చారు.

గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే సర్పంచులకు ప్రజల్లో గౌరవం, మర్యాద పెరుగుతుందని సీఎం సూచించారు. గ్రామ సభలు నిర్వహించి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సీఎం హితవు పలికారు. ఎన్నికలు పూర్తయ్యాయని, ఇకపై పార్టీలు, పంథాలు పక్కన పెట్టి ప్రతి పౌరుడిని కుటుంబ సభ్యుడిలా చూడాలని సూచించారు. వివక్షకు తావివ్వకుండా అందరికీ సమానంగా సేవలందించాలని సీఎం పిలుపునిచ్చారు. గత పదేళ్లలో పూర్తికాని ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా చేపట్టి అనుమతులు సాధిస్తూ ముందుకు వెళ్తున్నామని, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు, రంగారెడ్డి వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం చెప్పారు.

చదువే నిరుపేదల జీవితాలను మార్చగలదని పేర్కొంటూ, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం అందించే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్‌, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ చీరల వంటి సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా సర్పంచులు పర్యవేక్షించాలని కోరారు.

విద్య, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

పేద పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని సీఎం తెలిపారు.చదువే నిరుపేదల జీవితాలను మార్చగలదని పేర్కొంటూ, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం అందించే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్‌, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ చీరల వంటి సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా సర్పంచులు పర్యవేక్షించాలని సీఎం కోరారు.

కొడంగల్ - దేశానికే రోల్ మోడల్

కొడంగల్‌ను దేశానికి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని, 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్‌, జూనియర్‌, డిగ్రీ, మెడికల్‌, అగ్రికల్చర్ కాలేజీలు, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతోనే తాను ముఖ్యమంత్రి అయ్యానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతరప్రజాప్రతినిధులు, కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.